ఆయన యూనివర్సిటీలలో చదివారో లేదో తెలియదు. ఆయనకు ఆంజనేయుడి తోకలా పది పదిహేను డిగ్రీలు ఉన్నాయో లేవో తెలియదు. కానీ ఆయన ప్రజల గుండె చప్పుడు కాగలిగాడు. ప్రజల కష్ఠాలు, పల్లెల సౌందర్యం ఆయన కవిత్వానికి కథావస్తువు అయింది. పచ్చని పొలాలు, గలగలా పారే కాలువలు, నిండుగా భాసించే కాసారాలు, పొలాల్లోకి వయ్యారాలు పోతూ ప్రవహించే నీరు ఆయన పాటల్లో ప్రతిధ్వనిస్తాయి. పేదవారి జీవన విధానం, పల్లెలకు జరుగుతున్న అన్యాయం, పంట పండించడానికి రైతు పడే శ్రమ ఆయన గాత్రం గొంతెత్తి ఆలపిస్తుంది. ప్రజాకవి అనే పదానికి అచ్చమైన రూపం ఆయన. ఆయన పేరు గోరెటి వెంకన్న అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చట్టసభల్లో అడుగు పెట్టడానికి నేడు వందల కోట్ల రూపాయలను ఖర్చు చెయ్యాల్సి వస్తున్నది. డబ్బున్నవారికి, తమ పార్టీలకు మహారాజ పోషకులుగా ఉండే పారిశ్రామికవేత్తలకు, నేరుగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేని వారికి పునరావాస కేంద్రాలుగా అప్రతిష్ట పాలైన శాసనమండలి, రాజ్యసభల్లో సభ్యులు కావడానికి అవకాశం దక్కుతున్న దౌర్భాగ్య పరిస్థితి నేడు దేశం మొత్తం కనిపిస్తున్నది. అట్టడుగు వర్గాల వారు కనీసం ఆ సభల గేట్ల దగ్గరకు కూడా వెళ్లలేని దుస్థితి. విద్యావంతులు, మేధావులు, సమాజంలో ప్రజాసేవతో జీవితాన్ని వెళ్లదీసిన వారికోసం ఆవాసం కావాల్సిన ఎగువ సభలు గత మూడు నాలుగు దశాబ్దాలుగా కోటీశ్వరులకు మాత్రమే పరిమితం అవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో మధ్యతరగతి జీవి గోరెటి వెంకన్నను గవర్నర్ కోటాలో శాసనసభకు నామినేట్ చెయ్యాలని కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుత పరిస్థితుల్లో జేజేలు పలకాల్సినంత గొప్ప నిర్ణయం. సాహిత్యం మీద అవగాహన, అభిరుచి, పట్టు ఉన్న కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రులకు మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకునే సాహసం చెయ్యగలరు. ఒకరికి మేలు చేస్తే అతని వలన ఎన్ని ఓట్లు వస్తాయి అని ఆలోచించే సంకుచిత మనస్తత్వం నిండిపోయిన ఈ రోజుల్లో ఆర్ధికబలం లేని గోరెటి వెంకన్నను ఎమ్మెల్సీ చెయ్యాలని కేసీఆర్ భావించారంటే అది దేశానికే ఆదర్శం. తెలంగాణ ఉద్యమ సమయంలో గోరెటి వెంకన్న తన విప్లవ గీతాలతో ఉద్యమకారులను ఉత్తేజితులను చేశారు. వేదికల మీద తన డప్పులు, అందెల చప్పుడుతో ఉద్యమస్ఫూర్తికి ఊపిరి పోశారు. ఆయన సినిమా కవిగా అనేక ప్రబోధాత్మక గీతాలను రచించారు. వేలాదిగా జానపదగీతాలను రచించారు. “గల్లీ సిన్నది…గరీబోళ్ల కథ పెద్దది” అనే పాట సూపర్ హిట్. ఈ పాట పల్లవిని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగు మహాసభలలో వేదిక మీద హమ్మింగ్ చేశారంటే గోరెటి వెంకన్న ప్రతిభ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. “నువ్ కొననివి కొనిపిస్తది నిను కోతిగా చూపిస్తది” అంటూ ఆయన ఈనాటి మార్కెట్ విధానాలను ఎండగడుతూ రచించిన పాట ఎప్పటికీ సజీవంగా నిలిచిపోతుంది. ఒకటి రెండు కాదు…వెంకన్న రచించిన వందలాది పాటలు ప్రజల గుండెల్లో మార్మోగుతుంటాయి.
అలాంటి ప్రముఖ జానపద వాగ్గేయకారుడిని ఎమ్మెల్సీగా పట్టాభిషేకం చెయ్యడం ఒక్క తెలంగాణలోనే సాధ్యం అవుతుందేమో!
ఇతర ముఖ్యమంత్రులు కూడా ఈ విషయంలో కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకుని ప్రతిభ కలిగిన కళాకారులను, కవులను, రచయితలను చట్టసభలకు పంపించి కళలను ప్రోత్సహించాలి.
గోరెటి వెంకన్నతో పాటు గవర్నర్ కోటాలో మండలిలో అడుగుపెట్టబోతున్న బస్వరాజు సారయ్య, దయానంద్ లకు “తెలుగు రాజ్యం” అభినందనలు తెలియజేస్తోంది.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు