కాపులను కాపాడేది ఉద్యమాలే, నాయకులు కాదు !

Mudragada Padmanabham, Kapu Leader
కాపు ఉద్యమం నుంచి ముద్రగడ పద్మనాభం తప్పుకోవడం పెద్దగా ఆశ్చర్యం  కలిగించే విషయం కాదు. వెనుకబడి ఉన్న కాపులకు, ఉపకులాలలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ముద్రగడ దానికి ఉద్యమరూపం తీసుకురావడంలో కొంత వరకే సఫలమయ్యారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాగుడుమూతలాడగా ఈ కులానికి ఫలితం దక్కలేదు. కాపుల రిజర్వేషన్లకు అనేక సాంకేతిక కారణాలు అడ్డుపడడంతో వైఎస్సార్ సిపి ప్రభుత్వం కూడా ఈ కులానికి ప్యాకేజీ ప్రకటించి సరిపెట్టుకోమంది.  
 
1956లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల జాబితా నుంచి కాపులను తొలగించింది. అప్పటి వరకు కాపులు బీసీలే. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 1961లో ఒక ఉత్తర్వు ద్వారా కాపులను మళ్లీ వెనుకబడిన తరగతి కింద గుర్తించేందుకు ప్రయత్నించగా ఆ జీఓను సాంకేతిక కారణాలు చూపుతూ హైకోర్టు కొట్టివేసింది.

అప్పటి నుంచీ కాపులకు రిజర్వేషన్ల కోసం డిమాండ్లు, ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 27 శాతంగా ఉన్నట్టు చెబుతున్న  కాపు, ఉపకులాలు ఎన్నికల రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉండటంతో కాపు ఉద్యమం రాజకీయంగా కూడా కీలకంగా మారిపోయింది. 2016 లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కాపు ఉద్యమం హింసాత్మకంగా మారడంతో కర్ణాటక హైకోర్టు రిటైర్డు జడ్జి   మంజునాథ నాయకత్వలో కమిషన్ వేశారు. చివరికి ఎక్కడి గొంగడి అక్కడే అన్న చందంగా మారింది.

ఇక్కడ ముద్రగడ పద్మనాభం నాయకత్వ లక్షణాల గురించి చెప్పుకోవాలి. కాపుల వంటి ఫెయిర్ బ్రాండ్ కమ్యూనిటీని కదం తొక్కించడంలో ముద్రగడ వంటి మృదు స్వభావి ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు. అనేక కారణాల వల్ల ఆయన రాజకీయ జీవితంలో తూర్పుగోదావరి జిల్లాకు మాత్రమే పరిమితమయ్యారు. ఎన్ఠీఆర్ కూడా ఆయనను నిజాయితీ పరుడిగా గుర్తించి అభిమానించిన ఉదంతాలు ఉన్నాయి. అటువంటి నాయకుడు 1994 లో ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా ఓడిపోవడం విచిత్రమే. ఆ విచిత్ర రహస్యం అక్కడి ప్రజలకే తెలుసు. రాజకీయ నిర్వేదానికి లోనై, జన్మలో ప్రత్తిపాడు నుంచి పోటీచేయనని ప్రకటించారు. 2009లో వై. ఎస్‌. ఆయనను పిలిచి ప్రత్తిపాడు నుంచి పోటీచేయాలని అడిగారు, కానీ ఆయన ప్రత్తిపాడు నుంచి గాక కాపు ఓటర్లు అధికంగా గల పిఠాపురం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. 2014 లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేశారు. మళ్ళీ ఓడిపోయారు. ఓటమి పొంది ప్రశాంతంగా ఉన్న పద్మనాభంను కొంతమంది కాపు నాయకులు , ‘కాపు ఉద్యమం’ను మీరే ముందుకు తీసుకెళ్లాలని పట్టుబట్టగా ఆయన ఆ బాధ్యతను తీసుకుని శ్రమించారు.

1978 లోనే ఎమ్మెల్యేలుగా గెలిచిన ప్రముఖులు వైఎస్, చంద్రబాబు నాయుడు కోవలో అసెంబ్లీ లోకి   అడుగు బెట్టిన నాయకుడు ముద్రగడ.  ఆయనలో నిజాయితీ పాలు ఎక్కువ, నిలకడ  పాలు తక్కువ అని రాజకీయ పరిశీలకులు అంటూ ఉంటారు. తరతరాలుగా తమ వెంట ఉన్న  బడుగు వర్గాలు ఎక్కువగా ఉన్న పత్తిపాడు నియోజకవర్గాన్ని వదులుకుని, కాపులు ఎక్కువగా ఉన్న పిఠాపురంను ఎన్నుకోవడం ఆయన అంచనా రాహిత్యానికి నిదర్శనం. ఆ 2009 ఎన్నికల్లో ఆయనను వైఎస్ కూడా గట్టు ఎక్కించుకోలేకపోయారు. ఎన్నికలంటే భయపడే  ఉండవల్లి వంటి వారిని గెలిపించుకున్న వైఎస్ ముద్రగడను విజయపథంలోకి నడిపించలేకపోయారు.

ముద్రగడకు వయసు మీద పడింది. సుదీర్ఘకాలంగా సాకారం కాని కాపు, బలిజ, ఒంటరి కులాల కలలు సాకారం కావాలంటే నెత్తురు మండే యువనాయత్వాన్ని ఆయన వంటి వారు తయారు చేయాలి. తన అనుభవాలను పాఠాలుగా బోధించి వెనుకనుండి వారిని నడిపించాలి.  తన జాతివారు  కొందరు  చేస్తున్న విమర్శలకు ఆయన కుంగిపోయి సన్యాసం తీసుకోకూడదు. ఉద్యమంలో పుట్టిన నెల బాలుళ్లకు ఆయన మార్గ దర్శనం చేయాలి. “నాయకుల వల్ల ఉద్యమాలు రావు. ఉద్యమాల నుంచే నాయకులు పుడతారు” అన్న అనుభవ సూక్తిని ఇక్కడ గుర్తుంచుకోవాలి.

శాంతారాం , సీనియర్ జర్నలిస్టు