తెలంగాణపైనా జనసేన ఫోకస్.! ఏంటీ, నిజంగానేనా.?

తెలంగాణలో ఎన్ని సీట్లలో పోటీ చేద్దాం.? మీరే చెప్పండి.,. లెక్క తేల్చేద్దాం.. అంటూ కొన్నాళ్ళ క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ క్రియాశీల కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించారు. దాంతో, ఓ రెండు డజన్ల సీట్లలో పోటీ చేయాలన్నదానిపై ఓ అవగాహన వచ్చింది జనసైనికులకి.

జనసేనాని పిలుపు మేరకు జనసేన తెలంగాన విభాగం ఓ 50 సీట్ల వరకూ బలంగా వున్నామనే నిర్ధారణకు వచ్చింది. ఏంటీ, నిజంగానేనా.? ఏమోగానీ, అందులో ఓ ముప్ఫయ్ రెండు వరకు సీట్లలో పోటీ చేస్తే.. గట్టిగా నిలబడగలమనే భావనతో, ఆయా నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల నియామకం జరిగింది. ఆ విషయాన్ని తాజాగా జనసేన తెలంగాణ విభాగం ప్రకటించేసింది కూడా.

నిజానికి, జనసేన పార్టీ గనుక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ఆ పార్టీకి అభ్యర్థులతో సమస్య లేదు. ఎందుకంటే, గెలవడానికి గట్టిగా కష్టపడాల్సిన పనిలేదు.. సో, ఎవరో ఒకరు బరిలోకి దిగొచ్చు. ఎటూ పవన్ కళ్యాణ్ అభిమానులే జనసైనికులు గనుక.. అభ్యర్థ విషయంలో ఇబ్బందులేమీ లేవు. అంతా బాగానే వుందిగానీ, తెలంగాణలో జనసేన పార్టీ ఎవరికి మద్దతుగా పనిచేయనుంది.? ఏపీలోనే బీజేపీకి జనసేన మిత్రపక్షం. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్‌తో కొంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఎటూ తెలంగాణలో టీఆర్ఎస్ కాస్త ఇబ్బందుల్లో (బీజేపీ కారణంగా) వున్న దరిమిలా, గులాబీ పార్టీతో జనసేన అంటకాగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు వుండరన్నది జగమెరిగిన సత్యం. ఎలాగూ టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ అయిన దరిమిలా, ఏపీలోనూ గులాబీ పార్టీ నుంచి జనసేనకి మద్దతు లభించొచ్చు. అలాంటప్పుడు బీజేపీ పరిస్తితేంటి.?