జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళడం ముమ్మాటికీ రాంగ్ టైమింగ్.. అని జనసైనికులే ఆఫ్ ది రికార్డ్‌గా అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల వేళ బీజేపీ, చాలా తెలివిగా పావులు కదిపింది మిత్రపక్షం జనసేనపైన. ఆ వ్యూహంలో జనసేనాని చిక్కుకున్నారు. ఢిల్లీకి వెళ్ళారు.. అక్కడే ఇరుక్కుపోయారు పవన్ కళ్యాణ్. నిజానికి, పవన్ ఢిల్లీకి వెళ్ళకముందే ఢిల్లీలో బీజేపీ పెద్దలతో అపాయింట్‌మెంట్ ఖరారయి వుండాలి. కానీ, అలా జరగలేదు.
జనసేనాని పవన్ ఇకనైనా తెలుసుకుంటారా.?
సోషల్ మీడియా వేదికగా జనసేన మీద చాలామంది జాలి చూపిస్తోంటే, ఎలా స్పందించాలో తెలియడంలేదు జనసైనికులకి. వైసీపీ, బీజేపీల నుంచి ట్వీటు పోట్లు జనసైనికుల గుండెల్లో గుచ్చేసుకుంటున్నాయి.. అదీ చాలా ఘోరంగా. వాటికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వున్న జనసైనికులు, ఇకనైనా బీజేపీ నైజం తమ అధినేత తెలుసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు.
పవన్ కళ్యాణ్‌ని తప్పుదోవ పట్టించిందెవరు.!
నిజానికి, జనసేనాని ఇలాంటి విషయాల్లో తొందరపడరు. ఎటూ గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనాయకులు వస్తారు గనుక, అలా వచ్చినప్పుడే వారితో చర్చలు జరిపి వుంటే పెద్దగా సమస్య వచ్చేది కాదు. ఓ వైపు ‘నివర్’ తుపాను, ఇంకో వైపు గ్రేటర్ ఎన్నికలు, మరోపక్క కరోనా.. ఈ మూడు ‘వంకలు’ చాలు, జనసేనానిని బీజేపీ లైట్ తీసుకోవడానికి. ‘బిజీగా వున్నాం..’ అంటూ పవన్ కళ్యాణ్‌ని బీజేపీ పెద్దలు పక్కన పడేస్తారని చాలామంది ముందే ఊహించారు కూడా.
ఏపీలో పొత్తు కొనసాగుతుందా.?
ఈ పరిస్థితిని జనసైనికులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ అగ్రనాయకత్వంతో జనసేనాని భేటీ కుదిరినా, అట్నుంచి జనసేనకు అనుకూలంగా స్పందన వస్తుందని ఆశించలేం. ఆ లెక్కన, ఆంధ్రప్రదేశ్‌లోనూ బీజేపీతో జనసేన కొనసాగడం కష్టమే కావొచ్చు. అలాగని ఇప్పటికప్పుడు బీజేపీపై జనసేన ‘వ్యతిరేక’ నిర్ణయం ఏదీ తీసుకోకపోవచ్చు. అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది జనసేనాని పరిస్థితి ప్రస్తుతం.