జనం గుండెల లోగిళ్ళలో జగన్మోహన్ రెడ్డి

Jaganmohan Reddy in the logs of people's hearts
ఏడాది కాలంలోనే ప్రజల హృదయాల్లో కొలువైన జగన్మోహన్ రెడ్డి! 
సంక్షేమ పధకాల అమలులో అగ్రగామి!! 
రోజులు లెక్కబెట్టుకుంటున్న తెలుగుదేశం!!
నాయకులు, కార్యకర్తలు దూరమైపోతున్న వైనం
బీజేపీ, జనసేనలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే!  
మరో పదేళ్ల దాకా జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు!!!
 
క్లుప్తంగా చెప్పుకోవాలంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి అలా ఉంది.  
 
అనుభవం లేనివాడు, తొలిసారిగా రాష్ట్రాధినేత అయినవాడు, బోలెడు అపనిందలు ఎదుర్కొంటున్నవాడు, ఖాళీ ఖజానాతో పరిపాలన ప్రారంభించినవాడు, ఆరు నెలలైనా రాష్ట్రాన్ని పాలించగలడా అని నాబోటి అనేకమంది సందేహాలను వెలిబుచ్చారు.  కానీ, విసుగూ విరామం లేకుండా ఇన్నిన్ని పధకాలను ఎలా అమలు చేస్తున్నాడా అనేది నాకు మిలియన్ డాలర్ ప్రశ్న!  
 
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు సగటు మనిషి మెదడులో నిక్షిప్తమై ఉండే మెమొరీ చిప్ స్టోరేజ్ ను  మించిపోయాయి.  అందుకే నేను ప్రధానంగా నాకు నమ్మశక్యం కాని రెండు పధకాలు…గ్రామ సచివాలయాలు, ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాల మీద ఫోకస్ చేశాను.  ప్రకాశం జిల్లాలో సుమారు వంద గ్రామాలకు పైగా పర్యటించి ఆ కార్యక్రమాలను కళ్లారా చూశాను.  కొందరితో మాట్లాడాను.   ఆ కార్యక్రమాలను చూసిన నాకు దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రులలో జగన్మోహన్ రెడ్డి మూడో స్థానంలో నిలవడం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు.  
 
Jaganmohan Reddy in the logs of people's hearts
Jaganmohan Reddy in the logs of people’s hearts
మహాత్మాగాంధీ స్వప్నించిన గ్రామస్వరాజ్యం, ఎన్టీఆర్ ఆశించిన ప్రజలవద్దకు పాలన అనే రెండు కార్యక్రమాలను సాకారం చేసిన తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పవచ్చు.  గ్రామగ్రామాన “గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు” కనిపించాయి.  ప్రతి రెండు వార్డులకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు.  పౌరులకు కావలసిన సుమారు ఆరువందల సేవలను ఈ సచివాలయాలను అందిస్తున్నాయి.  రేషన్ కార్డు కావాలన్నా, ఇంటి పట్టా కావాలన్నా, ఒక సర్టిఫికెట్ తీసుకోవాలన్నా, గతంలో ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ పదులసార్లు తిరగాల్సి వచ్చేది.  పనికాకపోతే ఎమ్మెల్యే చుట్టూ, బ్రోకర్ల చుట్టూ ప్రదక్షణలు చెయ్యాల్సివచ్చేది.  అడుగడుగునా లంచాలు ఇచ్చుకుంటూ కావాల్సిన పని సాధించుకోవడం ఒక శత్రుదేశం మీద యుద్ధం చేసినంత జటిలంగా ఉండేది.  ఇపుడు అదేమీ లేదు.  గ్రామసచివాలయానికి ఏ పని మీద వెళ్లినా గంటలు, నిముషాల్లో పని అయిపోతున్నది.  ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన పనిలేదు. ఇంట్లో కూర్చుని ఆన్లైన్ ద్వారా కూడా మనకు కావలసిన సేవలు పొందవచ్చు.  తాసిల్దార్ ఆఫీసులు బోసిపోయి ఉన్నాయి.  
 
ఇక వాలంటీర్ వ్యవస్థ అనే ఆలోచన జగన్ మదిలోనుంచి పుట్టిందో, లేక ఎవరైనా సలహాలు ఇచ్చారో తెలియదు కానీ, వారికి శిరసువంచి మొక్కాలి.   వలంటీర్ల సేవలకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు.  ముఖ్యంగా కరోనా కాలంలో ఈ వాలంటీర్లు ప్రదర్శిన సేవాభావాన్ని కొనియాడటానికి కావ్యాలు కూడా సరిపోవు.  ప్రతిరోజూ ఇల్లిల్లూ తిరుగుతూ ఇంట్లోవారి ఆరోగ్యాన్ని గమనిస్తూ బాధితులను ఆసుపత్రులకు తీసుకెళ్లడం దగ్గరనించి ఇంటికి తీసుకురావడం వరకు వాలంటీర్లు పడిన శ్రమకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు.  తమకు కావలసిన వస్తువులకోసం ఎవరూ బయటకు వెళ్లే అవసరం లేకుండా బియ్యం, కిరాణా సరుకులు, పాలు వాలంటీర్లు ప్రతి ఇంటి గడప తట్టి అందించారు.  తెల్ల కార్డులు ఉన్నవారికి సరుకులు అన్నీ ఇళ్లకే వెళ్లి ఇస్తున్నారు.  ఇక నెలవారీ పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగులకన్నా ముందుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఇస్తున్నారు.   “మూటలు మోసే ఉద్యోగం” అంటూ చంద్రబాబు ఈసడించిన వాలంటీర్ వ్యవస్థ ఇవాళ దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రతిష్టను అంబరాన్ని తాకించింది.  
 
ఈ గ్రామసచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థల ఏర్పాటు వలన సుమారు నాలుగు లక్షలమందికి ఉద్యోగాలు దక్కాయి.  అవేమీ చౌకబారు ఉద్యోగాలు కావు.  వీరికి పదిహేను వేలరూపాయలు వేతనం ఇస్తున్నారు.   ఈ ఉద్యోగాలు ఇవ్వడంలో కులమత  పార్టీ భేదాలను పాటించలేదు.  అర్హత ఉన్న అందరికీ ఇస్తున్నారు.  వీరిలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల అభిమానులు కూడా ఉన్నారు.  చంద్రబాబు హయాంలో కేవలం పచ్చ చొక్కాల వారికి, ఒక కులం వారికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు.  ఇప్పుడు అలాంటిది కలికానికి కూడా కనిపించడం లేదు.  ఒక పట్నంలో ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పుకొచ్చారు.  “చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా వార్డ్ మెంబర్ వైసిపి నాయకుడు.  దాంతో మామీద కక్ష గట్టి పట్నంలోని అన్ని రోడ్లు సిమెంట్ తో వేశారు.  కానీ,  మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా వీధికి తారు రోడ్డు కూడా వెయ్యలేదు.  జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే   మా వీధికి సిమెంట్ రోడ్డు వేశారు”  అన్నారు.  త్వరలో ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్ల రిజిస్ట్రేషన్లు కూడా ఈ సచివాలయంలోనే జరుగుతాయట.  నయాపైసా లంచం ఇవ్వకుండా ఆస్తుల మార్పిడి చేసుకోవచ్చు.  
 
ఇక ఇళ్లస్థలాల పంపిణీ అనేది ఒక అద్భుతంగా చెప్పుకోవాలి.  ఇళ్ల స్థలాల లే ఔట్లు వేసిన కొన్ని ప్రాంతాలను నేను పరిశీలించాను.   రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా  అంత పకడ్బందీగా వెయ్యరేమో!  అర్హతలను బట్టి కొందరికి యాభై గజాల స్థలం, కొందరికి డెబ్బై అయిదు గజాల స్థలం ఇచ్చారు.  ఎంతలేదన్నా వారికి ఇచ్చిన స్థలాల విలువ మార్కెట్ విలువను బట్టి కనీసం మూడు లక్షల రూపాయల నుంచి అయిదు లక్షల రూపాయల వరకు ఉంటుంది.  ఈ ఏడాది చివరిలోగా అందరికీ ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేస్తామని ప్రభుత్వం వారికి హామీ ఇచ్చింది.  చంద్రబాబు నాయుడు హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన టిడ్కో ఇళ్లను సైతం జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసి లబ్దిదారులకు  ఉచితంగా ఇచ్చేస్తున్నారు!  చంద్రబాబు హయాంలో కొన్ని కులాలవారికి మాత్రమే ఇలాంటి కేటాయింపులు జరిగేవి.  జగన్ పాలనలో అలాంటిది లేదు.  వారు ఏ కులం అయినప్పటికీ తెల్ల కార్డు ఉండి, ప్రభుత్వం రూపొందించిన అర్హతలు వుంటే స్థలాలు ఇచ్చారు.  చంద్రబాబు పాలనలో నిర్లక్ష్యానికి గురయిన బ్రాహ్మణులకు కూడా  స్థలాలు దక్కాయంటే ఎంత పారదర్శకంగా జగన్ పరిపాలన సాగుతున్నదో అర్ధం చేసుకోవచ్చు.  
 
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇతర అంశాలు ఎలా అమలవుతున్నప్పటికీ ఇళ్లస్థలాల పంపిణీ, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి కీర్తిచంద్రికలను కనీసం ఇరవై సంవత్సరాలు వెలిగిస్తాయి.  ఇసుక సమస్య, మద్యం సమస్య ఉన్నాయని అంటున్నారు కానీ అవి అందరికీ సంబంధించినవి కావు.  జగన్ అమలు చేస్తున్న పాలనాసంస్కరణలు మాత్రం రాష్ట్రం మొత్తానికి శాశ్వతంగా వర్తించేవి.  ఈ విషయంలో మాత్రం జగన్ మరో ఏడాదిలో దేశం మొత్తానికే ఉత్తమ ముఖ్యమంత్రి అనిపించుకోవడం ఖాయం.  ఇతర రాష్ట్రాలు కూడా త్వరలో జగన్ చూపించిన బాటలో నడవడం తధ్యం.   నాలుగు కాలాలపాటు అధికారంలో ఉండాలంటే జగన్ విధానాలను అనుసరించక తప్పదు.  
 
తెలుగుదేశం పార్టీ అత్యంత దయనీయస్థితిలో ఉన్నది.  పచ్చపత్రికల్లో చూపిస్తున్నంత పుంజుకోవడం ఏమీ లేదు.  ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెల్లాచెదురైపోయారు.  జగన్ వచ్చి రెండేళ్లు దగ్గర పడుతున్నా రవంత కూడా వ్యతిరేకత లేకపోవడంతో ఆ పార్టీ నిరాశలో కూరుకుని పోయింది.    2024 ఎన్నికల తరువాత తెలుగుదేశం సమాధి అవుతుందని ఎక్కువమంది నమ్ముతున్నారు.  ఒకటిరెండు చోట్ల తెలుగుదేశం ఫ్లెక్సీలు కనిపించాయి.  కానీ వాటిమీద ఉన్న పేర్లను చదివితే అవి అన్నీ చంద్రబాబు సామాజికవర్గం వారివే.   అన్ని వర్గాల ఆదరణను చంద్రబాబు కోల్పోయారని అక్కడ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయ్.  
 
బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉన్నది.  ప్రత్యేకహోదా విషయంలో మోసం చేసిందని  బీజేపీని ప్రజలు తీవ్రంగా ద్వేషిస్తున్నారు.  ఆ పార్టీకి సమీపకాలంలో ఎలాంటి భవిష్యత్తు లేదు.  కొంచెంలో కొంచెం జనసేన నయం.  అక్కడక్కడా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు కనిపించాయి.  ఇక కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవడమే వృధా ప్రయాస.  
 
స్థూలంగా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు విశ్వాసం ఏర్పడింది.  చెబితే చేస్తాడన్న నమ్మకం కలిగింది.  ఇవాళ కాకపోతే రేపైనా వాగ్దానాలు నిలుపుకుంటారనే అభిమానం  ఏర్పడింది.  పోయిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన అనేకమంది ప్రస్తుతం ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు.  వారి మాటలను బట్టి చూస్తే గతంలో ఉన్నంత ఓటు బ్యాంకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి లేదని కచ్చితంగా చెప్పవచ్చు.  అమరావతి విషయం, ఆలయాల మీద దాడుల విషయం పచ్చ ఛానెళ్లలో తప్ప బయట ఇసుక రేణువంత కూడా లేదు.   
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు