India Vs Pakistan: భారత్ – పాక్: ఇంతకు ‘హాట్‌లైన్’ అంటే ఏంటీ?… లేటెస్ట్ గా ఏం మాట్లాడారు?

సైనిక ఉద్రిక్తతల వేళ, రెండు దేశాల మధ్య నేరుగా కమ్యూనికేషన్ జరగడం ఎంతో అవసరం. అలాంటి సందర్భాల్లో ఉపయోగపడేదే హాట్‌లైన్ వ్యవస్థ. ఇది ఒక ప్రత్యేకమైన సురక్షిత టెలికమ్యూనికేషన్ లైన్. ద్వైపాక్షిక వైమానిక, సైనిక విషయాల్లో తక్షణ సమాచారం మార్పిడికి ఉపయోగపడుతుంది. భారత ప్రభుత్వం తరపున ఢిల్లీలోని డీజీఎంఓ కార్యాలయం, పాకిస్థాన్ ప్రభుత్వం తరపున ఇస్లామాబాద్‌లోని సమానస్థాయి కార్యాలయం దీనికి అనుసంధానంగా పనిచేస్తాయి.

హాట్‌లైన్ అనేది అణు ఆయుధ సామర్థ్యం కలిగిన దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగకుండా, సమయానుకూలంగా స్పందించేందుకు అత్యవసరంగా ఉపయోగపడుతుంది. ఇది సాధారణ ఫోన్ కాల్‌లా కాకుండా, కోడ్ చేసిన కమ్యూనికేషన్ మార్గం ద్వారా సురక్షితంగా వ్యవహరించబడుతుంది. ముఖ్యంగా డీజీఎంఓల హాట్‌లైన్ చర్చలు గతంలో అనేక సార్లు పరస్పర అవగాహన పెరిగేలా దోహదపడ్డాయి.

ఇక తాజా పరిణామాల్లో, నేడు భారత్ – పాకిస్థాన్ మధ్య హాట్‌లైన్ ద్వారా కీలక చర్చలు జరిగాయి. భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాశిప్ మధ్య ఈ సంభాషణ సాగింది. మధ్యాహ్నం జరగాల్సిన చర్చలు సాయంత్రానికి వాయిదా పడటంతో అంచనాలు పెరిగాయి.

ఈ చర్చల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తిరిగి కట్టుబడి ఉండటం, ఇటీవల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, పీవోకే అంశంపై పాకిస్థాన్ వైఖరి వంటి కీలక అంశాలపై చర్చ జరిగి ఉంటుందని సమాచారం. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఈ చర్చల ద్వారా రెండు దేశాల మధ్య స్వల్ప స్థాయి భద్రతా అవగాహన పెరగడం, మరిన్ని సైనిక ఘర్షణలను నివారించడంలో తోడ్పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Ka పాల్ యేసుప్రభు కాదు || Director Geetha Krishna Fun Comments On Ka Paul || Telugu Rajyam