Operation Polo: ఆపరేషన్ పోలో పేరు ఎలా వచ్చింది..? ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు..?

Operation Polo

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా దేశం నడిబొడ్డులో ఉన్న హైదరాబాద్ సంస్థానానికి మాత్రం స్వతంత్రం లభించలేదు. తాము భారత్, పాకిస్తాన్‌లో కలవమని అప్పటి నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ తేల్చిచెప్పారు. తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. అయితే నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలు ఎక్కువ కావడంతో భారత ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్య చేపట్టింది. ఆపరేషన్ పోలో అనే పేరు ఎందుకు పెట్టారు. ఎన్ని రోజులు ఈ ఆపరేషన్ జరిగింది.? ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఆపరేషన్ పోలో అంటే అర్థం ఏంటి..?

జనరల్ జయంత్ నాథ్ చౌధురి ఈ సైనిక చర్యకు ఆపరేషన్ పోలో అనే పేరు పెట్టారు. హైదరాబాద్ సంస్థానంలో ఉన్నత వర్గాలు పోలో ఆటను ఇష్టంగా ఆడతారు. దీంతో ఆ ఆట ప్రాచుర్య పొందడంలో ఈ ఆపరేషన్‌కు ఆ పేరు పెట్టారు. నవాబ్ ఉస్మాన్ తలొగ్గాలంటే సైనిక చర్య అనివార్యమని భారత ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో ప్రారంభించింది. ఈ క్రమంలో భారత సైన్యం హైదరాబాద్ సంస్థానాన్ని నలువైపులా చుట్టుముట్టింది.

నలువైపులా చుట్టుముట్టిన భారత సైన్యం..

భారత బలగాలు పశ్చిమ దిశ నుండి షోలాపూర్ నుండి హైదరాబాద్‌లోకి ప్రవేశించాయి. మరికొన్ని బలగాలు ఉత్తర దిశ మార్గంలో ఔరంగాబాద్ నుంచి.. తూర్పు దిశ మార్గంలో విజయవాడ, గుంటూరు వైపు నుంచి.. దక్షిణ దిశ మార్గంలో కర్నూలు వైపు నుంచి సైనిక దశాలు హైదరాబాద్‌లోకి ఎంటర్ అయ్యాయి. నలువైపులా సైన్యం చుట్టుముట్టడంతో నిజాం పాలకుల్లో భయం పుట్టుకుంది. భారత సైన్యం ముందు చేతులెత్తేశారు. ఈ సమయంలో భారత సైన్యం, నిజాం సైనికుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. 1948 సెప్టెంబర్ 13న ప్రారంభమైన ఈ ఆపరేషన్ ఐదు రోజుల పాటు సాగింది. భారత సైన్యం నిజాం సైన్యాన్ని మట్టుబెట్టడంతో సెప్టెంబర్ 17న నిజాం ప్రభువు ఉస్మాన్ లొంగిపోయారు. దీంతో ఆపరేషన్ పోలో ముగిసింది.

భయంతో లొంగిపోయిన నిజాం నవాబ్‌..

నల్దుర్గ్ తుల్జాపూర్, జల్నా, జహీరాబాద్, సూర్యాపేట-కోదాడ, బీదర్ ఎయిర్ ఫీల్డ్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో నిజాం సైన్యాన్ని భారత సైన్యం ఓడించింది. అనంతరం మేజర్ జనరల్ చౌధురి నాయకత్వంలోని భారత సైనికులు హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించింది. అప్పటికే భారత సైన్యం తెగువను చూసి రజాకార్లు, నిజాం సైనికులు భయపడిపోయారు. దీంతో చేసేదేమీ లేక నిజాం నవాబ్ సైతం భారత బలగాల ముందు లొంగిపోయారు.

ఎంతమంది ప్రాణాలు కోల్పోయారంటే..?

ఆపరేషన్ పోలోలో అధికారికంగా 42 మంది భారత సైనికులు వీరమరణం పొందినట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాగే నిజాం సైన్యంలో దాదాపు 807 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 1373 మంది రజాకార్లు మరణించారు. కానీ ఈ ఆపరేషన్ తర్వాత హైదరాబాద్‌లో జరిగిన మత ఘర్షణల్లో 30 నుంచి 40వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని సుందర్‌లాల్ కమిటీ నివేదిక వెల్లడించింది. మొత్తానికి ఆపరేషన్ పోలోలో తక్కువ ప్రాణ నష్టంతోనే హైదరబాద్ సంస్థాన భారత్‌లో విలీనం అయింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలు తమకు స్వేచ్ఛ లభించిన రోజుగా వేడుకలు చేసుకుంటారు.

పార్టీకో పేరుతో కార్యక్రమాలు.

ప్రస్తుతం సెప్టెంబర్ 17వ తేదీపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఒక్కో వైఖరి అవలంభిస్తున్నాయి. పలు రకాలు పేరులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విలీన దినోత్సవం(ప్రజాపాలన దినోత్సవం), బీఆర్ఎస్ పార్టీ జాతీయ సమైక్యత దినోత్సవం, బీజేపీ తెలంగాణ విమోచణ దినోత్సవం, కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవం పేరుతో కార్యక్రమాలు జరుపుతున్నాయి. ఒక్కో పార్టీ తమ సిద్ధాంతాలు ఆధారంగా పేర్లను పెట్టుకున్నాయి. పేర్లు వేరైనా ఉద్దేశం మాత్రం అమలరులను స్మరించుకోవడమే.