భారత త్రివిధ దళాలను మరింత శక్తివంతంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సైన్యం, నావికాదళం, వాయుసేనల సామర్థ్యాలను ఆధునికీకరించడంతో పాటు దేశీయంగా రక్షణ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రూ.79 వేల కోట్ల విలువైన ఆయుధ, పరికరాల సేకరణ ప్రతిపాదనలకు రక్షణ సేకరణ మండలి (DAC) ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమావేశంలో సీడీఎస్‌తో పాటు త్రివిధ దళాల అధిపతులు, రక్షణ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ నిర్ణయంతో భారత సైనిక బలగాల ఆపరేషనల్ సామర్థ్యం మరింత పెరగనుందని రక్షణ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. భారత సైన్యం కోసం లోయిటరింగ్ మ్యూనిషన్ సిస్టమ్స్, లైట్ వెయిట్ రాడార్లు, పినాకా మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్‌కు అనుసంధానమైన లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్లు, ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్‌డిక్షన్ సిస్టమ్ Mk-IIలను సేకరించనున్నారు. ఇవి శత్రు లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులకు, తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేయడానికి కీలకంగా మారనున్నాయి. టాక్టికల్ యుద్ధ ప్రాంతాలతో పాటు దేశంలోని కీలక ఆస్తుల భద్రతను మరింత బలోపేతం చేయనున్నాయి.
ఇదే సమయంలో భారత నావికాదళానికి సంబంధించి బొల్లార్డ్ పుల్ టగ్స్, హై ఫ్రీక్వెన్సీ సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ రేడియోస్, హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ రిమోట్‌లీ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్‌లను లీజు పద్ధతిలో తీసుకునేందుకు డీఏసీ అనుమతి ఇచ్చింది. ఇవి నౌకలు, సబ్‌మేరిన్లను హార్బర్లలో సురక్షితంగా మాన్యూవర్ చేయడం, బోర్డింగ్ ఆపరేషన్లలో భద్రతాయుత కమ్యూనికేషన్, సముద్ర జలాల్లో నిరంతర నిఘా సామర్థ్యాన్ని పెంచనున్నాయి.
వాయుసేన సామర్థ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేలా ఆటోమేటిక్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ రికార్డింగ్ సిస్టమ్, ఆస్ట్రా Mk-II ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్‌కు ఫుల్ మిషన్ సిమ్యులేటర్, SPICE-1000 లాంగ్ రేంజ్ గైడెన్స్ కిట్స్ సేకరణకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇవి అన్ని వాతావరణాల్లో ఆపరేషన్లను మరింత సురక్షితంగా మార్చడంతో పాటు, పైలట్ల శిక్షణను ఖర్చు తక్కువగా, అత్యంత సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడనున్నాయి.
మొత్తానికి ఈ భారీ నిర్ణయంతో ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి బలం చేకూరడంతో పాటు, భారత త్రివిధ దళాల యుద్ధ సన్నద్ధత కొత్త స్థాయికి చేరనుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
