Polluted Country: కాలుష్యం కోరల్లో భారత్.. వరల్డ్ లో 3వ స్థానం!

భారత్‌లో కాలుష్యం ఏరోజుకారోజు పెరిగిపోతూ తీవ్ర సమస్యగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య దేశాల జాబితాలో భారత్ మూడో స్థానాన్ని ఆక్రమించడం ఆందోళన కలిగించే విషయం. రియల్ టైమ్ గాలి నాణ్యతను పరిశీలించే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2024 నివేదిక ప్రకారం, భారత్ 111 AQIతో మూడో స్థానంలో నిలిచింది. తొలిస్థానంలో 140 AQIతో బంగ్లాదేశ్, రెండో స్థానంలో 115 AQIతో పాకిస్థాన్ ఉన్నాయి. ఈ జాబితాలో బహ్రెయిన్, నేపాల్, UAE, ఈజిప్ట్, కువైట్ వంటి దేశాలు కూడా ఉన్నాయి.

భారత్‌లో ప్రధానంగా ఉత్తరభాగంలోని నగరాలు అత్యంత కాలుష్య నగరాలుగా మారాయి. ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా 169 AQIతో నిలవడం గమనార్హం. అంతేకాదు, గ్రేటర్ నోయిడా, నోయిడా, ఘాజియాబాద్, పాట్నా వంటి నగరాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వాహనాల కాలుష్యం, పరిశ్రమల ఉద్గారాలు, భారీ ట్రాఫిక్, నిర్మాణాల వల్ల వచ్చే ధూళి వంటి అంశాలు ప్రధాన కారణాలుగా పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.

కాలుష్య నియంత్రణకు భారత ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నా, అవి సమర్థంగా అమలవుతాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రత్యేకించి, పరిశ్రమల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు కఠిన చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. కాలుష్యం నియంత్రణపై మరింత దృష్టి పెట్టకపోతే, భారతదేశం ఆరోగ్యపరంగా, పర్యావరణపరంగా తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత్‌లో కాలుష్య సమస్యను తక్షణమే అదుపులోకి తేవాలన్న డిమాండ్ ప్రజల్లోనూ పెరుగుతోంది. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని, నగరాల్లో గాలి నాణ్యత మెరుగుపరచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే త్వరలోనే ఇది అనారోగ్య సమస్యల పెరుగుదలకు దారితీయనుందని వారంటున్నారు.

షర్మిల చంద్రబాబుకు చంచాగిరి || YSRCP SV Satish Kumar Reddy Shocking Comments On Ys Shamila || TR