డయాబెటిస్ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న వ్యాధి. చిన్న పిల్లల నుంచే పెద్దవారి వరకు, ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి షుగర్ సమస్య ఉండడం సాధారణంగా మారిపోయింది. కానీ ఈ వ్యాధి నుంచి తప్పించుకోవాలంటే రోజూ జిమ్‌కి వెళ్లాలి, కఠినమైన డైట్లు పాటించాలి అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ, వైద్యులు చెబుతున్నది వింటే.. మీరు ఆశ్చర్యపోతారు. భోజనం తర్వాత కేవలం 10 నిమిషాల నడక చాలు… అది డయాబెటిస్ రాకుండా కాపాడగలదని అంటున్నారు.
తాజాగా Scientific Reports జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం, రాత్రి భోజనం చేసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు లైట్ వాక్ చేయడం బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. భోజనం చేసిన తర్వాత ఏమి చేయకుండా కూర్చుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అమాంతం పెరుగుతాయి. కానీ వాక్ చేయడం వల్ల మజిల్స్ రక్తంలోని గ్లూకోజ్‌ను త్వరగా శోషించుకుంటాయి. దాంతో ప్రమాదకరమైన షుగర్ స్పైక్స్‌ను అడ్డుకోవచ్చు.
వైద్యులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఈ చిన్న అలవాటు రోజూ పాటిస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరుగుతుంది. అంటే శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ నేచురల్‌గా కంట్రోల్‌లో ఉంటాయి. ప్రీ-డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఈ పద్ధతి మంచి ఫలితాలు ఇస్తుంది.
ఇది కేవలం షుగర్‌కే కాదు, హార్ట్ హెల్త్‌కీ గొప్ప మిత్రం. నడక వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది. రక్తనాళాలపై ఒత్తిడి తగ్గుతుంది. గుండె సక్రమంగా పని చేస్తుంది. అదనంగా, డిన్నర్ తర్వాత వాక్ చేయడం వల్ల జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. తిన్న తర్వాత కడుపు బరువుగా అనిపించకపోవడమే కాదు, ఆహారం పేగుల్లో సాఫీగా కదిలిపోతుంది. దీంతో గ్యాస్, బ్లోటింగ్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గిపోతాయి.
వైద్యులు చెబుతున్న సూచనల ప్రకారం, ఈ వాక్ భోజనం చేసిన 30 నుంచి 60 నిమిషాల లోపు చేయాలి. వేగంగా నడవాల్సిన అవసరం లేదు, లైట్ లేదా మోడరేట్ పేస్‌లో 10 నుండి 15 నిమిషాలు నడిస్తే సరిపోతుంది. క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీరంలోని మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. నడకతో పాటు డైట్‌లో కొన్ని చిన్న మార్పులు చేస్తే ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. లీన్ ప్రోటీన్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్‌తో కూడిన బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవడం, తగినంత నీరు తాగడం, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, షుగరీ ఫుడ్స్‌ను తగ్గించడం ద్వారా గ్లూకోజ్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. అలాగే ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది.
ఈ సింపుల్ హ్యాబిట్‌ను రాత్రి రొటీన్‌గా మార్చుకుంటే డయాబెటిస్‌తో పాటు గుండె జబ్బులు, ఒబెసిటీ, డైజెస్టివ్ ఇష్యూస్ వంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. ఏ ఔషధం, ఏ జిమ్ కంటే ఈ 10 నిమిషాల నడక మీ ఆరోగ్యానికి మంత్రంలా పనిచేస్తుంది.
