“నలభై ఎనిమిది గంటల గడువిస్తున్నా…అసెంబ్లీని రద్దు చేస్తారా లేదా?” అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పిచ్చికేక పెడితే, దాన్నేదో సింహగర్జన స్థాయిలో హైలైట్ చేసి తరించిన పచ్చమీడియా ఆ నలభై ఎనిమిది గంటల గడువు దాటిన పిదప చంద్రబాబు ఏదో సంచలనం సృష్టిస్తారనే వెఱ్ఱిభ్రమలకు లోనయ్యారు. చంద్రబాబు తన పదవికి రాజీనామా చేస్తారని, అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేసి ఉపఎన్నికలకు వెళ్లి జగన్ యవ్వారం తాడోపేడో తెలుస్తారని బోలెడన్ని ఊహాగానాలు చేశారు.
అయితే అంత తేలికగా రాజీనామాలు చేసేట్లయితే ఆయన చంద్రబాబు ఎందుకవుతారు? రాజకీయ జీవితం అంతా వెన్నుపోట్లు, నయవంచనలే సిద్ధాంతాలుగా ఎదిగిన చంద్రబాబు చివరకు నిన్న సాయంత్రం జూమ్ లో ప్రత్యక్షమై “డెడ్‌లైన్‌పై పారిపోయిన ప్రభుత్వం, “తాజా ప్రజాతీర్పునకు సిద్ధపడకుండా పిరికిపంద మాదిరిగా తప్పుకొన్నారు…అయినా వదలం.. కడిగేస్తాం” అంటూ కరోనాకు, జగన్ కు భయపడి గత నాలుగు నెలలుగా పొరుగురాష్ట్రంలో తలదాచుకుంటున్న చంద్రబాబు తన అభిమానుల ఆశలమీద చన్నీళ్ళు చల్లేసి ఉసూరుమనిపించారు!
ఓకే..వైసిపి వాళ్ళు పిరికిపందలు…వాళ్ళు రాజీనామా చెయ్యరు. తమకు ఐదేళ్లు ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి మేము చెయ్యం అంటున్నారు. అలాంటప్పుడు చంద్రబాబు, ఆయన ఎమ్మెల్యేలే రాజీనామాలు చేసి జగన్ కు ముఖం పగిలేట్లు జవాబు చెప్పొచ్చు కదా! పోనీ…. రాజధాని ప్రాంతంలోనే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కనీసం వారితో అయినా రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్తే చంద్రబాబుకు వచ్చే నష్టం ఏముంది? వారి వాదం నిజమని నిరూపించుకునే మహత్తర అవకాశాన్ని చంద్రబాబు ఎందుకు చేజేతులా వదులుకుంటున్నారు? హీనపక్షం తన కొడుకు లోకేష్ తో అయినా ఎందుకు రాజీనామా చేయించడం లేదు?
అమరావతి రైతులకు అండగా నిలబడాలనుకున్నప్పుడు ఎవరినో ధర్నాలు చెయ్యండి, ఎర్రటి ఎండల్లో మోకాళ్ళమీద నిలబడండి…త్యాగాలు చెయ్యండి అని హైదరాబాద్ నుంచి పిలుపులు ఇచ్చేబదులు తానే స్వయంగా అమరావతిలో రైతులముందు నిలబడి ఎందుకు పోరారాటం చెయ్యరు చంద్రబాబు? పోనీ, తనకు వార్ధక్యం మీద పడిందని సరిపెట్టుకుందాము. పార్టీకి భావి నేత లోకేష్ ను అయినా ఉద్యమసారధిగా నిలబడి జగన్ మీద సమరం చెయ్యమని భుజం తట్టి పంపొచ్చు కదా! ఆమ్మో…ఇంకేముంది? చంద్రబాబులో అసలు ఏనాడైనా పోరాటాలక్షణాన్ని చూశామా? చీమలు కష్టపడి పుట్టలు పెడితే, నాగుబాములా దూరి వాటిని వెళ్లగొట్టి పుట్టాను ఆక్రమించడమే కదా ఆయన గత రాజకీయజీవితం?
రైతులందరూ ఎండకు మాడి, వైరస్ ను అంటించుకుని ప్రాణాలు అర్పిస్తే అప్పుడు చంద్రబాబు వచ్చి తాను క్రెడిట్ స్వీకరిస్తారు! రాష్ట్ర విభజన కూడా ఆయన్ను బాధించలేదట! అమరావతి వెళ్లిపోతుంటే మాత్రం ఆయనకు కన్నీళ్లు వస్తున్నాయట! ఎందుకు రావు? తన సామాజికవర్గం వారికి, ఇతరపార్టీలలోని తన కులస్తులకు, విదేశాల్లోని తన సామాజికవర్గం వారికి వేలకోట్ల రూపాయల లాభాలు కలిగించడానికి తాను కష్టపడి నిర్మించిన అక్రమాల కోట అంతా జగన్ ఈ విధంగా బద్దలు కొడుతుంటే కన్నీళ్లు జలపాతాల్లా ప్రవహించడంతో వింత ఏముంది?
ఇక మూడు రాజధానుల మాట ఎన్నికల ముందు చెప్పలేదని చంద్రబాబు ఆక్రోశిస్తున్నారు…ఎన్నికల ముందు చెప్పినవన్నీ ఆనాడు చంద్రబాబు చేశారా? రుణమాఫీ చేశారా? నిరుద్యోగభృతి ఇచ్చారా? పదేళ్ళపాటు ప్రత్యేకహోదా తెచ్చారా? విభజన చట్టం ప్రకారం పదేళ్ళపాటు హైద్రాబాద్ ను రాజధానిగా ఎందుకు ఉంచలేదు? మధ్యలో పారిపోయి వస్తానని జనానికి చెప్పారా? మరి ఆనాడు తానెందుకు రాజీనామా చెయ్యలేదు?
2014 నుంచి నాలుగేళ్లపాటు మోడీతో అంటకాగిన చంద్రబాబు …మోడీ హామీ ఇచ్చినట్లు ..అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోగా విదేశాలనుంచి నల్లధనాన్ని తెప్పించలేకపోయినా, అవినీతిపరులను జైళ్లలో వేయకపోయినా, ఎన్నికలకు ముందు చెప్పనివిధంగా నోట్లరద్దు చేసినా మోడీని ఏనాడైనా ప్రశ్నించారా? మోడీని రాజీనామా చెయ్యాలని నిలదీశారా? ఇప్పుడు మోడీ బాత్ రూమ్ కు వెళ్లినా ఆహా ఓహో అంటూ భజన చేస్తూ మోడీ అన్న పేరు వింటేనే గజగజ వణికిపోతున్న చంద్రబాబుకు జగన్ ను రాజీనామా చెయ్యమని కోరే నైతిక హక్కు ఎక్కడిది?
చంద్రబాబుకు బాగా తెలుసు…తన ఎమ్మెల్యేలను పదవులకు రాజీనామా చేయమన్న మరుక్షణం ఇరవైఒక్కమంది ఎమ్మెల్యేలు టిడిపికి రాజీనామా చేస్తారు! అందుకే చంద్రబాబు “లేస్తే మనిషిని కాను” అన్నట్లు హాస్యాస్పదమైన ప్రకటనలు చేస్తూ మీడియాతో డప్పు కొట్టించుకుంటున్నారు.
అయితే చిల్లి పడిన కుండలో గంగాళాలతో నీళ్లు తోడి పోసినా వృదాయే కదా!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు
Chandra Babu Naidu disappoints TDP cadre after 48 hours deadline. Chandra Babu Naidu did not come with an action plan for the TDP cadre on Amaravati.