సిట్ ఏర్పాటుపై తెలుగు దేశం గుండెల్లో పరిగెత్తుతున్న రైళ్లు 

ప్రతివారం మొక్కు తీర్చుకుంటున్నట్లే ఈ వారం కూడా తన బాధ ప్రపంచం బాధ అన్నట్లు రోతపలుకుల రాధాకృష్ణ  “రాజు కక్షకు రాజ్యం బలి” అనే మకుటం కింద   వలవల ఏడుస్తూ మనలను కూడా ఏడవమంటున్నాడు.  చంద్రబాబును రక్షించే నాధుడికోసం చకోరపక్షిలా గిలగిలా కొట్టుకుంటున్నాడు.    మచ్చుకు కొన్నింటిని చూసి నవ్వుకుందాం.  
 
****
“”చంద్రబాబు అయిదేళ్ల పాలనపై గంపగుత్తగా విచారణకు సిట్‌ ఏర్పాటుచేయడం జగన్మోహన్‌రెడ్డి మనోపైత్యానికి అద్దంపడుతోంది. గత ప్రభుత్వాలలో అవకతవకలు జరిగి ఉంటే నిర్దుష్టమైన అంశాలపై విచారణ జరిపించడం ఏ ప్రభుత్వానికైనా సహజం. అందుకు విరుద్ధంగా గత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలపై విచారణ చేయాలనుకోవడం, అందుకు పది మంది పోలీస్‌ అధికారులతో సిట్‌ ఏర్పాటు చేయడాన్ని ఇప్పుడే చూస్తున్నాం…..””
అవును మరి!   చంద్రబాబు గారి అయిదేళ్ల పాలనలో దేశం కంటే రాష్ట్రమే ఎక్కువ జీడీపీ సాధిస్తున్నదని, నలభై లక్షలమందికి ఉద్యోగాలు వచ్చాయని  క్షుద్రజ్యోతి లాంటి భజనబృందాలు ప్రజలందరూ అసహ్యించుకునే రీతిలో కైవారాలు చేసినప్పటికీ, ఆ తరువాత చూస్తే “ఎంచబోతే మంచమంతా కంతలే” అని సామెత చెప్పినట్లు ఎక్కడ చూసినా అవినీతిపుట్టల పొట్టలు పగిలి కుంభకోణాల కాలసర్పాలు బుసలు గొడుతూ పైకి వస్తుంటే, గంపగుత్తగా విచారణ జరపక ఒక్కొక్క కుంభకోణానికి ఒక్కొక్క పోలీసును నియమిస్తే రాష్ట్రంలోని పోలీస్ బలగం మొత్తం కూడా సరిపోదేమో?  
 
****
“రాజశేఖర్‌రెడ్డి.. తాను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇళ్ల నిర్మాణ పథకం అమలులో ఉదారంగా వ్యవహరించడం వల్ల అనేక అవకతవకలు జరిగాయి. అనర్హులు లబ్ధి పొందారు. ఒక్కొక్కరు రెండు, మూడు ఇళ్లకు బిల్లులు తీసుకుని భవనాలు నిర్మించుకున్నారు. ఈ నేపథ్యంలో విచారణ జరిగితే వేలు, లక్షల్లో ఉన్న లబ్ధిదారులపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. విచారణను మధ్యలోనే ముగించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రభావం కూడా రాష్ట్ర భవిష్యత్తుపై తీవ్రంగా ఉంటుంది.”
ఎన్నడో మరణించిన రాజశేఖర రెడ్డిని ఇప్పుడు ముగ్గులోకి దించాడు రాధాకృష్ణ! చంద్రబాబు కూడా  రాజశేఖర రెడ్డి లాగే ఉదారంగా వ్యవహరించాడట!   ఆయన్ని కేసీఆర్ దయతలచి వదిలేసారు కాబట్టి ఆయన కొడుకుగా నువ్వు కూడా చంద్రబాబును అలాగే వదిలెయ్యాలి అని ధర్మ సూక్ష్మాన్ని ఎంతో అధర్మంగా సూచిస్తున్నాడు!  వారేవా!  
 
*****
“జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవ్వడమే కాకుండా వివాదాస్పదం కూడా అయ్యాయి. ఫలితంగా ఆయా దేశాలకు భారత ప్రభుత్వం సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పెట్టుబడిదారుల్లో విశ్వాసం సన్నగిల్లింది.    ఈ నేపథ్యంలో ఇప్పుడు గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటిపైనా సిట్‌తో విచారణ జరిపించాలనుకోవడం దుస్సాహసమే అవుతుంది. ఇలా ఒక ప్రభుత్వ నిర్ణయాలన్నింటిపై మరో ప్రభుత్వం గంపగుత్తగా విచారణ జరిపించడం వల్ల అరాచకం ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ వైపు చూడటానికి కూడా పెట్టుబడిదారులు ఇష్టపడరు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ప్రయివేట్‌ పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా రావాలి. అలా జరగనప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి తయారవుతుంది. రాష్ట్ర ఆదాయం క్రమంగా పడిపోతుంది.”
వావ్!  పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రపు ముఖ్యమంత్రి తన అధికారపరిధిలో తీసుకున్న నిర్ణయాలను అంతర్జాతీయంగా చర్చించుకుంటున్నారట!  అమెరికా, చైనా, రష్యా, కొరియా దేశాలు  కూడా జగన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అని  వణికిపోతున్నాయని రాయనందుకు సంతోషించాలి.   ఇక గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించడం తప్పెలా అవుతుందో బాధాకృష్ణకే తెలియాలి.  అంటే గత పాలకులు ఎంత దోచుకున్నా, తరువాతి ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలన్నమాట.  గత ప్రభుత్వ అవినీతి మీద విచారణ జరిపిస్తే పెట్టుబడిదారులకు వచ్చే నష్టం ఏమిటి?  ఫలానా రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అవినీతికి పాల్పడితే, తరువాత వచ్చే ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది అనే ధైర్యం ఉంటె పెట్టుబడిదారులు ఇంకా ఉత్సాహంగా ముందుకు వస్తారు కదా!   తమిళనాడులో జయలలిత జైలుకు వెళ్లినంతమాత్రాన పెట్టుబడిదారులు తమిళనాడును బహిష్కరించారా?  హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌతాలా జైలుకు వెళితే అక్కడికి పరిశ్రమలు రావడం లేదా?  చంద్రబాబును జైలుకు పంపిస్తే రాష్ట్రం పెట్టుబడులు రాక దివాళా తీస్తుందనే బెదిరింపులు తప్ప మరేమైనా ఉన్నదా రాధాకృష్ణా?  
 
****
“రాజధాని అమరావతి వికేంద్రీకరణ పేరిట జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర భవిష్యత్‌ అగమ్యగోచరంగా తయారైంది. ప్రస్తుత నిర్ణయంతో ”ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టనేల.. కష్టాలు కొనితెచ్చుకోనేల?” అని పెట్టుబడిదారులు భావించకుండా ఎలా ఉండగలరు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వంపై జగన్‌ అండ్‌ కో పలు ఆరోపణలు చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతోంది. ఒక్కటంటే ఒక్క ఆరోపణపై కూడా ఆధారాలు సేకరించలేకపోయారు. రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్నది జగన్‌ అండ్‌ కో చేసిన ప్రధాన ఆరోపణ! ఇప్పటివరకు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు చంద్రబాబు పాల్పడ్డారని రుజువు చేయలేకపోయారు. “
ఆవు వ్యాసం లాగా మళ్ళీ రాజధాని వికేంద్రీకరణ మీద పడ్డాడు రాధాకృష్ణ.  రాజధాని వికేంద్రీకరణ వలన రాష్ట్ర భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైందా లేక అమరావతి పేరుతో వందల ఎకరాల భూములను అమాయక రైతులనుంచి  దోచుకున్న తెలుగు దేశం భవిష్యత్తు కుప్పకూలిపోయిందా?  కర్ణాటక ప్రభుత్వం సైతం జగన్ ను చూసి తమ కార్యాలయాలను రాష్ట్రం లోని ప్రధాన నగరాలకు తరలిస్తున్నదంటే వారి భవిష్యత్తు వారికి తెలియదంటారా?
 
***
“రెండు పార్టీల మధ్య నెలకొన్న రాజకీయ కక్షలకు తోడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్‌ ఆందోళనకరంగా మారింది. తాజాగా సిట్‌ ఏర్పాటుచేయడమే కాకుండా అది పోలీస్‌స్టేషన్‌గా పనిచేస్తుందనీ, సీఆర్‌పీసీ కింద కేసులు నమోదు చేస్తుందనీ ఉత్తర్వులు ఇవ్వడంపై జాతీయ స్థాయిలో స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాలి.”
జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తో ప్రమాదమే అని రాధాకృష్ణ కు గ్రహింపుకు వచ్చినట్లుంది.  పైగా సిట్ కు నేతృత్వం వహిస్తున్న అధికారి ఎవ్వరికీ తలవంచని  నిజాయితీపరుడు…సిట్ లో ఉన్నది మొత్తం పోలీసు అధికారులే కావడంతో దొంగలందరికీ ముచ్చెమటలు పోస్తున్నాయి.  ఆ దొంగల్లో ఎవరిమీద క్రిమినల్ కేసులు నమోదు చేసినా ఇక వారి జీవితం మొత్తం అంధకారమే అవుతుంది.  అందుకే ఇప్పుడు జాతీయస్థాయిలో తమ ఉప్పు తిన్న మీడియాను, రాజకీయనాయకులను రంగంలోకి దూకమని, తమ చర్మాన్ని రక్షించమని చేతులెత్తి వేడుకుంటున్నాడు!!  హ్హాహ్హా  
 
***
“రాష్ట్రం అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు.. తాను అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే తనను మళ్లీ గెలిపిస్తాయని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బలంగా నమ్ముతున్నారు. అందుకే అప్పులు చేసి మరీ అడ్డగోలుగా పంచిపెడుతున్నారు.”
ఓహో…ఏమి తెలివిడి!  ఇంతకుముందు చంద్రన్న కూడా  సంక్షేమపథకాలే తనను గెలిపిస్తాయని పిచ్చపిచ్చగా నమ్మేసాడు కదా!   చంద్రన్న తోఫాలు, చంద్రన్న కానుకలు అంటూ పుచ్చిపోయిన పప్పును, ముక్కిపోయిన బెల్లాన్ని అమాయక ప్రజలకు అంటగట్టారు.  ఎన్నికలు మరో ఆరు నెలల్లో రాబోతుండగా ముప్ఫయివేల కోట్ల రూపాయలు అప్పు చేసి పప్పుబెల్లాలు పంచినట్లు జనానికి పంచేసాడు కదా?  ఆయన అప్పులు చేసి పంచక, తన హెరిటేజ్ సొమ్మును తెచ్చి పంచాడా?  అన్న కాంటీన్లు పోయాయి…చంద్రన్న బీమా పోయింది అనే ఏడ్చేబడులు గత ఎనిమిది నెలల్లో ప్రారంభించిన పాతిక పధకాలు, వాటిని నిక్కచ్చిగా అమలు చెయ్యడం ప్రస్తావించలేదేమిటి రాధాకృష్ణ?  
 
***
“అమరావతి నిర్మాణానికి ప్రభుత్వ వనరుల నుంచి డబ్బు ఖర్చు చేయనవసరం లేదు. రైతులు ఉచితంగా ఇచ్చిన భూములను అమ్మి నిధులు సమకూర్చుకోవచ్చు అన్న సంగతి ఆమెకు తెలియనిది కాదు. చంద్రబాబు ఉండకూడదు.. ఆయన మొదలుపెట్టిన అమరావతి ఉండకూడదు అని వైసీపీ నాయకులు పైనుంచి కిందిస్థాయి వరకు లక్ష్యంగా పెట్టుకున్నందున అసత్యాలే సత్యాలుగా ప్రచారం అవుతున్నాయి.”
అమరావతి నిర్మాణానికి ప్రభుత్వ వనరుల నుంచి డబ్బు ఖర్చు చేయనవసరం లేదనే జ్ఞానోదయం ఎప్పుడయింది?  ప్రజలు అసహ్యించుకుకుని అధికారం నుంచి తన్ని తరిమేసిన తరువాత కదా?  అధికారంలో ఉన్నన్నినాళ్ళు లక్ష కోట్లు కావాలి రెండు లక్షల కోట్లు కావాలి అని ఎందుకు పదేపదే నుడివినట్లు?   భూములను అమ్మి నిధులను సమకూర్చుకుని అమరావతిని ఎందుకు పూర్తి చెయ్యలేదు చంద్రబాబు?  నిధులకోసం కేంద్రం చుట్టూ ఎందుకు తిరిగారు?  రాజధాని కోసం నిధులు ఇవ్వడం లేదని కేంద్రాన్ని ఎందుకు నిందించారు?  అసలు ఆ భూముల వ్యవహారమే పెద్ద కుంభకోణం అని ప్రజలు నమ్ముతుంటే, విచారణలో బయటపడుతుంటే, ఇంకా ఆ భూములను కొనేదెవరు?  డబ్బులిచ్చేదెవరు?  
 
మొత్తానికి సిట్ నియామకం,  కుంభకోణాలను వెలికితీసి నేరగాళ్ళను బోనెక్కించాలని జగన్ నిర్ణయం తెలుగు దేశం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయని రాధాకృష్ణ తన తాజా చెత్తపలుకులో వణికిపోతున్న తీరు స్పష్టంగా తెలిసిపోతున్నది!!
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు