పగబట్టి విషం చిమ్ముతున్న జర్నలిజం

“సలహా అనేది ఆముదం లాంటిది.  ఇవ్వడం చాల సులభం.  పుచ్చుకోవడం చాలా కష్టం” అంటారు పెద్దలు.  చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారపక్షం వారికి నీతులు గీతులు రీతులు బోధించడంలో మన రాధాకరష్ణకు బోధిసత్వుడు కూడా దిగదుడుపే.  పరమ శాంతమూర్తిలా, చంద్రబాబుకు ఎలాంటి కీడు రాకుండా చూడాలని శతసహస్రం ప్రయత్నిస్తూ ప్రజాస్వామ్యం గూర్చి అధికారంలో ఉన్నవారికి హితోక్తులు వల్లిస్తుంటారు.  ఏవైతే పనులు మహా దుర్మార్గంగా ఉన్నాయని రాధాకృష్ణ విమర్శిస్తారో, అంతకంటే ఘోరంగా అధికారంలో ఉన్నసమయంలో  చంద్రబాబు చేస్తుంటే మాత్రం నోరు పెగలదు ఆయనకు.  అందుకు ఉదాహరణ “పగబట్టిన రాజకీయం” పేరుతో నేడు కక్కిన చెత్తపలుకు!   ఒక్క జగన్ మీద మాత్రమే విరుచుకుని పడితే బాగుండదని మొహమాటపడ్డాడేమో తెలియదు కానీ, ఈసారి కేసీఆర్ మీద కూడా నాలుగు అక్షింతలు వేశాడు.   అలాగే నెమలి ఈకతో చుబుకాలను మీటినట్లు మోడీ మీద కూడా సుతారంగా ఒకటి రెండు విమర్శలు చేసి “హమ్మయ్య” అని ఊపిరి పీల్చుకున్నాడు.   మచ్చుకు కొన్ని పరిశీలిద్దాం.  
 
“జగన్మోహన్‌రెడ్డి పాలన ఫ్యాక్షనిస్టు తరహాలో సాగుతోందన్న భావన రాష్ట్రంలో విస్తృతంగా వ్యాపించిన నేపథ్యంలో అచ్చెన్నాయుడు అరెస్ట్‌ వంటివి మరింత వివాదాస్పదం అవుతాయి. “
 
అరెరెరె  …ఫాక్షనిస్టు తరహా పాలన అంటే ఏమిటో మరి”  అధికారంలోకి వచ్చింది తడవుగా తెలుగుదేశం పార్టీ పాలనలో అణచివేతకు, అన్యాయానికి గురైన వివిధ వర్గాల వారిని ఎప్పుడో పాదయాత్రలో ప్రకటించిన విధంగా నవరత్నాల పధకాలను అమలు చెయ్యడం, దివాళా తీసిన ఖజానాను కూడా లెక్కచెయ్యకుండా వాటికోసం నిక్కచ్చిగా నిధులు కేటాయించడం, అమలు చెయ్యడం ఫ్యాక్షనిస్ట్ తరహా ఏమో మనకు తెలియదు.  చంద్రబాబు పాలనలో ఆయన, ఆయన ముఠా పందికొక్కుల్లా రాష్ట్రం మీద పడి నిలువుదోపిడీ చేశారనే క్రుద్ధం తోనే కదా చంద్రబాబును ప్రజలు తరిమి కొట్టారు?  అచ్చెన్నాయుడు అరెస్ట్ వివాదాస్పదం ఎలా అవుతుంది?  ఆయన మీద ప్రభుత్వం నిర్దిష్టమైన ఆరోపణలు చేసింది.  అందుకు ఆధారాలను కూడా చూపింది.  నేరం చేసినపుడు అరెస్ట్ చెయ్యడం తప్పెలా అవుతుంది?  బీసీ కార్డు వాడి దాన్ని వివాదాస్పదం చెయ్యాలని చంద్రబాబు ప్రయత్నించారు.  అందుకు బీసీ సంఘాలవారే అసహ్యించుకున్నారు!  
 
***
“జగన్‌ అండ్‌ కో శాశ్వతంగా అధికారంలో ఉండదు. అప్పుడు అధికారంలోకి వచ్చేవాళ్లు కచ్చితంగా ప్రతీకారానికి పాల్పడతారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు వైసీపీలో చేరడానికి అంగీకరించే వరకు గ్రానైట్‌ క్వారీలో పర్మిట్లు కూడా నిలిపివేయించారు. కండువా మార్చుకోగానే పర్మిట్లు జారీ అయ్యాయి. ఇలా అయితే వ్యాపారాలు ఉన్నవారు అధికార పార్టీలనే ఆశ్రయించాలన్న సందేశం ఇచ్చినట్టే కదా! “
 
“నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా” అనే ప్రసిద్ధ పద్యపాదాన్ని  రాధాకృష్ణ వినే ఉంటారు.  బాధ్యత కలిగిన సభాపతి పదవిలో ఉంటూ “రాబోయే పదిహేనేళ్ళు మన కులం వారే అధికారంలో ఉండాలి” అని వనభోజనాల సందర్భంగా కులగజ్జి ఉపన్యాసాలు ఇచ్చారు కోడెల శివప్రసాదరావు.  ”  2050  వరకు మేమే అధికారంలో ఉంటాము” అని అనేకసార్లు ప్రకటించారు చంద్రబాబు.  అప్పుడు ఈరకమైన సుద్దులు చెప్పారా రాధాకృష్ణ?  అదే జిల్లాకు చెందిన గొట్టిపాటి రవికుమార్ వైసిపి టికెట్ మీద ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  ఆయనకూ గ్రానైట్ వ్యాపారాలు ఉన్నాయి.  ఆయన్ను టిడిపిలో చేరమని ఆరోజుల్లో తెలుగుదేశం వాళ్ళు అనేకరకాల వేధింపులకు గురి చేశారు.  ఆయన క్వారీల మీద దాడులు చేయించారు.  చివరకు ఆయన అధికారపార్టీలో చేరక తప్పని పరిస్థితి తీసుకొచ్చారు.  పచ్చ కండువా కప్పగానే రవికుమార్ వ్యాపారాలు అన్నీ నిరాటంకంగా సాగిపోయాయి!  మరి ఆరోజుల్లో చంద్రబాబు ఎలాంటి సంకేతాలు ఇచ్చినట్లు?
 
***
“లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు అడ్డం, పొడవు మాటలు చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు ప్రజలను గాలికి వదిలేయడం ఏమిటి? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ”ఇక మా వల్ల కాదు.. మీ ప్రాణాలు మీరే కాపాడుకోండి” అని ప్రభుత్వం చేతులెత్తేస్తే ప్రజలు వారి తిప్పలు వారు పడతారు కదా? తొలి దశలో లాక్‌డౌన్‌కు సహకరించిన ప్రజలు.. ఇప్పుడు ఆంక్షలు సడలించడంతో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. అటు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఇటు ప్రజల్లో బాధ్యతారహిత ధోరణితో వైరస్‌ అదుపు తప్పుతోంది. “
 
దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చినపుడు రెండు తెలుగు రాష్ట్రాలు సమర్ధవంతంగా పనిచేశాయి.  కరోనా పాజిటివ్ కేసులు తెలుగురాష్ట్రాల్లోనే తక్కువగా నమోదయ్యాయి.  లాక్ డౌన్ ను కూడా కేసీఆర్ అందరికన్నా మిన్నగా అమలు చేశారు.  కేంద్రం లాక్ డౌన్ లో ఇచ్చిన సడలింపుల మేరకే కేసీఆర్, జగన్ వ్యాపారకార్యకలాపాలకు అనుమతులు ఇచ్చారు.  ప్రజలు అవసరం అయితేనే బయటకు రావాలని , మాస్కులను విధిగా ధరించాలని, భౌతికదూరాన్ని పాటించాలని ప్రభుత్వం కచ్చితమైన ఆదేశాలను జారీ చేసింది.  వాటిని పాటించాల్సిన బాధ్యత ప్రజలదే.  కేసీఆర్ కానిస్టేబుల్ లాగా దగ్గరుండి జనాన్ని కంట్రోల్ చేస్తారా?   మొదటి వాక్యంలో కేసీఆర్ ను తప్పు పడుతూ మళ్ళీ రెండో వాక్యంలో జనాన్ని తప్పు పడుతున్నారు.  జనం నిర్లక్ష్యమే వైరస్ వ్యాప్తికి కారణం అని వారిని నిందిస్తున్నారు.  ఏమిటీ రెండు నాలుకల వైఖరి? 
 
****
“ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఇప్పుడు పాలకులు అందరూ చెబుతున్న ”కరోనాతో సహజీవనం చేయాల్సిందే..” అన్న మాటను అందరికంటే ముందే జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రారంభంలో అధికారులతో సమావేశాలు జరిపినట్టు ప్రకటించి, వీడియో సందేశాలు విడుదల చేసిన జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు కరోనా ఊసే ఎత్తడం లేదు.”
 
జగన్ యొక్క దార్శనికత, ముందుచూపు, అవగాహనాశక్తి ఏమిటో ఇప్పటికి అర్ధం అయింది రాధాకృష్ణకు.  కరొనతో సహజీవనం చెయ్యాల్సిందే అని జగన్ చెప్పినపుడు రాధాకరష్ణ దాన్ని ఎంతగా విమర్శించాడో మరచిపోయాడు.  దాన్ని హేళనచేస్తూ చంద్రబాబు అవివేక ప్రకటనలు చేస్తే వాటికి ప్రాధాన్యత ఇస్తూ జగన్ మీద చెలరేగిపోయాడు.  కరోనాతో సహజీవనం చెయ్యక తప్పదు అని ప్రపంచంలో అందరికన్నా ముందుగా ప్రకటించిన ఉత్తమ పాలకుడు జగన్.  ఆయన చెప్పిన తరువాతనే మిగిలిన అందరూ అదేవిధమైన ప్రకటనలు చేశారు.  ఇక రాధాకృష్ణ ప్రకారం ప్రతిరోజూ కాబినెట్ సమావేశాలు, పత్రికాసమావేశాలు ఏర్పాటు చేస్తూ “కరోనా కరోనా” అంటూ భజనలు చెయ్యాలా?  లేక అమరావతి గ్రాఫిక్స్ తో అయిదేళ్లపాటు ప్రజలను వంచించిన చంద్రబాబు మాదిరిగా “కరోనాను జయించాను” అంటూ ఈవెంట్స్ చెయ్యాలా??
 
***
“కేసీఆర్‌ను అగ్రజుడుగా పరిగణిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఒక ఆకు ఎక్కువే చదివినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పనిలో ఆయన ఉన్నారు. దీంతో జగన్‌ కంటే కేసీఆర్‌ మెరుగు అన్న అభిప్రాయం కలిగిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సోషల్‌ మీడియాలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, తప్పుబట్టినా కేసులు పెడుతూ వచ్చారు.”
 
అయ్యయ్యయ్యో….2014  ఎన్నికల్లో వైసిపి టికెట్ మీద 67 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు గెలిస్తే, కనీసం ప్రమాణస్వీకారం కూడా చెయ్యకుండానే, ముగ్గురు ఎంపీలను, ఆ తరువాత 22 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనేసి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చెయ్యడానికి చంద్రబాబు ప్రయత్నించలేదా? ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టలేదా?  సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైసిపి అభిమానులను, కార్యకర్తలను జైళ్లలో నెట్టలేదా?  గతాన్ని అంత తేలికగా మర్చిపోతే ఎలా?  
 
****
“జగన్‌ అండ్‌ కో, వారి ఆధ్వర్యంలోని నీలి మీడియా సీబీఐని ‘పంజరంలోని చిలుక’ అని విమర్శించిన విషయం ప్రజలు మరిచిపోలేదు. ఇప్పుడు వారికి సీబీఐపై అంత ప్రేమ, నమ్మకం ఎందుకు కలిగాయో తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా ఏపీలో ఇప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాలు రాష్ట్రానికి మంచి చేయవు. హుందాతనంతో నడవాల్సిన రాజకీయాలు కక్షపూరితం కావడం వల్ల చివరకు మిగిలేది వినాశనమే!”
 
ఆహ్హాహ్హా…. “అబ్బా…ఏమి చదివితే వచ్చిందబ్బా నీకు ఈ తెలివి” అని రమణారెడ్డి డైలాగ్ ఉన్నది ఏదో పాత సినిమాలో.  రాజకీయాల్లో హుందాతనం నశించింది తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాతనే అన్న సంగతి రాధాకృష్ణకు గుర్తు లేదేమో పాపం!  వంగవీటి రంగా, పింగళి దశరధరామ్ వంటి అనేకమంది తెలుగుదేశం వ్యతిరేకుల  హత్యలు జరిగింది తెలుగుదేశం పాలనలోనే.  అఖండమైన మెజారిటీ సాధించిన ఎన్టీఆర్ ను కూలదోసి చంద్రబాబు అధికారం కైవసం చేసుకోవడం హుందాతనమేమో?  అంతెందుకు?   పదేళ్ల తరువాత విభాజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ముద్రగడ పద్మనాభం విషయంలో ఎలా ప్రతీకారాన్ని ప్రదర్శించారు?  ముద్రగడను, ఆయన భార్యాపిల్లలను బండబూతులు తిడుతూ, వాళ్ళ ఇంట్లోనే వారిని లాఠీలతో కొట్టుకుంటూ తరిమిన దృశ్యాలు హుందాతనాన్ని ప్రతిబింబిస్తున్నాయా?    రాజకీయాల్లో హుందాతనం అన్నమాటకు విలువ లేకుండా చేసిన నేలబారు రాజకీయనాయకుడు ఎవరు అంటే పసిపిల్లవాడు కూడా చెప్పే జవాబు చంద్రబాబు అనే!  అధికారంలో ఉన్నప్పుడు సీబీఐని ఘోరంగా విమర్శించి రాష్ట్రంలో అడుగుపెట్టకుండా నిషేధించిన చంద్రబాబు ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేస్తున్నారేమి?  ఆనాడు చేదైన సిబిఐ ఇప్పుడు చంద్రబాబుకు పటికబెల్లం ఎలా అయింది?  
 
***
ఇక ఇందులో రాధాకృష్ణ రాసిన ఒక విషయాన్ని మాత్రం ఎవరైనా అంగీకరించక తప్పదు.  ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారిని పడి అల్లాడిపోతున్న సమయంలో, రోజుకు కొన్ని వందలమంది వైరస్ బాధితులుగా నమోదవుతున్న పరిణామాల నేపథ్యంలో “మాకు స్టూడియోలకు స్థలాలు కావాలని, నంది అవార్డులు ఇవ్వాలని, కరెంట్ బిల్లులు మాఫీ చెయ్యాలని, షూటింగులకు అనుమతులు ఇవ్వాలని చిరంజీవి నేతృత్వంలో జగన్ ను కలిసిన సినిమారంగం వాళ్ళు దేబిరించడం నిస్సందేహంగా సిగ్గు, లజ్జ లేని పని.  వీరికి సామాన్యప్రజలు అంటే ఎంత అలుసో, ఎంత స్వార్ధపరులో తలచుకుంటేనే అసహ్యం వేస్తున్నది.  అసలు సినిమారంగాన్ని ఆంధ్రప్రదేశ్ లో బహిష్కరించాలి అన్నంత ఆగ్రహం కలుగుతోంది వీరి కోరికల చిట్టాలు వింటుంటే. 
 
జగన్ ను ముఖ్యమంత్రిగా గుర్తించడానికి నిరాకరించి “జగన్ ను కలవాలని రూల్ ఉన్నదా” అంటూ హేళనగా మాట్లాడిన అధములు వీళ్ళు.  అసలు వీళ్ళను కలవడమే జగన్ చేసిన అతిపెద్ద తప్పు.  “ఏడాదినుంచి కలవాలని ఉన్నా సమయం లేక కలవలేదు” అని చిరంజీవి ప్రకటించడం నికృష్టానికి పరాకాష్ట.  ఏడాదినుంచి ఏమి పీకుతున్నారు వీళ్ళు? ఏమైనా నెలకు పది సినిమాల్లో నటిస్తున్నారా?  ముఖ్యమంత్రి కంటే బిజీయా వీరు?  సిగ్గులేదా అలా మాట్లాడటానికి?  ఇప్పుడు వీరి సినిమాల కోసం జనం ఏమైనా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారా?  అటు హైద్రాబాద్ లో అందరికి లంకంత కొంపలు ఉన్నాయి.  ఎకరాలకు ఎకరాల్లో ఫామ్ హౌస్ లు ఉన్నాయి.  మళ్ళీ ఇప్పుడు విశాఖపట్నంలో కారు చౌకగా స్థలాలు కొట్టేయాలని దురాలోచన!  ఛీ..ఛీ…వీరివలన ప్రజలకు నయాపైసా ప్రయోజనం లేదు.  
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు