నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు! 

ABN Radhakrishna
మనకు ఇడ్లీ ఎంత ఇష్టమైన ఫలహారం అయినప్పటికీ, ప్రతిరోజూ ఇడ్లీ తినాలంటే మొహం మొత్తుతుంది.  మన బాధాకృష్ణ కూడా అలాగే భావించాడేమో,     ప్రతివారమూ జగన్ మీద పడి ఏడుస్తుంటే బోరు కొట్టిందో మరి విషం చిమ్మడానికి పెద్ద పాయింట్స్ ఏమీ దొరకలేదేమో…హఠాత్తుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అక్షయతూణీరాలు కురిపించాడు.  అయితే కేసీఆర్ అంటే ఉండే సహజసిద్ధమైన భయం, ఎక్కువగా మాట్లాడితే తోలు వలుస్తాడన్న వణుకు పొడసూపిందో ఏమో…తమలపాకుతో నిమిరినట్లుగా నాలుగు అక్షింతలు వేసి స్వయంతృప్తిని పొందాడు.  “ఫామ్ హౌస్ పాలిటిక్స్” మకుటంతో  తన మస్తకంలోని బూజును కాస్త బయటపెట్టుకున్నారు.  అవేమిటో కొన్ని చూద్దాం. 
 
***
“తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి. మన దేశంలోకి కరోనా వైరస్‌ ప్రవేశించిన తొలి దశలో, వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికై ముందుగానే లాక్‌డౌన్‌ ప్రకటించి, సుదీర్ఘ సమీక్షలు నిర్వహించిన కేసీఆర్‌… వైరస్‌ విజృంభించడంతో దాన్నొక సమస్యగా గుర్తించడానికి కూడా నిరాకరిస్తున్నారు. దాదాపు రెండు వారాలు ఫామ్‌ హౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌ సచివాలయ భవనాలను కూల్చడానికి అర్ధరాత్రి ముహూర్తం నిర్ణయించారు.”
 
 
కేసీఆర్ నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయని రాధాకృష్ణకు ఇంత ఆలస్యంగా తెలిసినందుకు చింతిస్తున్నాను.  మోడీ, సోనియా, రాహుల్ గాంధీ, గులాం నబీ, చంద్రబాబు, ఉత్తమ్ కుమార్  లాంటి హేమాహేమీలే కేసీఆర్ వ్యూహాల ముందు చిత్తైపోయారు.   కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.  కొందరు వనవాసం చేస్తున్నారు.  కరోనాను అరికట్టడానికి అందరికన్నా ముందుగా పటిష్టమైన చర్యలు తీసుకున్నది కేసీఆరే.  అది కేంద్రప్రభుత్వ నిర్ణయం ప్రకారం జరిగింది.  అన్ని పరిస్థితులను  సమీక్షించి  లాక్  డౌన్  ను సడలించాలని  మోడీ నిర్ణయించిన  తరువాతే తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్ణయించింది అని రాధాకృష్ణకు తెలియదా?  ఈ వైరస్  ఇప్పట్లో  పోయేది  కాదని, ప్రజలు  స్వీయనియంత్రణ పాటిస్తూ కరోనా కు దూరంగా మెసలాలని ప్రపంచం మొత్తం మొత్తుకుంటున్నది.  అలాంటప్పుడు ఒక్క కేసీఆర్ ఏమి చెయ్యగలరు? 
  
*****
“పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు ఘనంగా నిర్వహిస్తామని హడావిడి చేశారు. ఇదే కేసీఆర్‌ ఒకప్పుడు పీవీని తీవ్రంగా విమర్శించారు. ప్రధానమంత్రిగా ఉండి తెలంగాణకు ఏమీ చేయనందునే, ఆయన అంతిమయాత్రలో అపశ్రుతులు దొర్లాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు పీవీ మన ఠీవీ అంటూ పొగడడం మొదలెట్టారు.”
 
 
రాజకీయంగా చురుకుగా ఉన్నప్పుడు రాజకీయనాయకులు ఒకరినొకరు విమర్శించుకోవడం సహజాతి సహజం.  ఒకప్పుడు పీవీని విమర్శించినంత మాత్రాన ఆయన మరణించిన తరువాత కూడా విమర్శించాలా?   దక్షిణాది రాష్ట్రాల నుంచి మొదటిసారిగా ప్రధాని అయిన మొదటి వ్యక్తి పీవీ.  మెజారిటీ లేకపోయినప్పటికీ, అత్యంత సమర్ధవంతంగా ఐదేళ్లు పాలించడమే కాక దివాళా తీసిన దేశాన్ని సరికొత్త ఆర్ధిక సంస్కరణలతో అభివృద్ధిపథంలో నడిపించిన మహా మేధావి ఆయన.  అలాంటి నాయకుడిని అత్యంత ఘోరంగా అవమానించిన కాంగ్రెస్ సిగ్గుతో తలవంచుకునేలా పీవీ నూరేళ్ళ జీవిత ఉత్సవాలను  నిర్ణయించడం కేసీఆర్ రాజనీతిజ్ఞతకు  నిదర్శనం.     గత నలభై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని, ఇందిరాగాంధీ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకూ ఎవ్వరినీ వదలకుండా  తిట్టి దిగపారబోసిన చంద్రబాబు గత ఎన్నికల ముందు సోనియా, రాహుల్ గాంధీల పాదారవిందాలను కళ్ళకు అడ్డుకుని ఎంతగా పిసికి ఆనందింపజేసాడో మనం చూడలేదా?   అధికారంలో ఉన్న ఐదేళ్లలో నాలుగేళ్లపాటు మోడీ భజనలో తరించి, ఆ తరువాత మోడీని పరమ జుగుప్సాకరంగా విమర్శించాడో మనం మర్చిపోతామా?  చివరకు మోడీ భార్య పట్ల కూడా అసభ్యకరంగా విమర్శలు చేసినపుడు బహుశా రాధాకృష్ణ చెవుల్లో చెట్లు మొలిచి ఉంటాయి!  
 
****
” బీజేపీ ముఖ్య నాయకుడొకరు ఒకటికి రెండు పర్యాయాలు కేసీఆర్‌కు ఫోన్‌ చేసి తమ పార్టీకి కనీసం మూడు సీట్లు కేటాయించాలని కోరారు. అయితే కేసీఆర్‌ నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో బీజేపీ సొంతంగా పోటీ చేసి అనూహ్యంగా నాలుగు స్థానాలను గెలుచుకుంది. అప్పటి నుంచి బీజేపీ పెద్దల్లో తెలంగాణపై ఆశలు చిగురించాయి.”
 
 
తెలంగాణ ఏర్పడినది లగాయతు ఎమ్మైఎం పార్టీతో సఖ్యతను నెరపుతున్న కేసీఆర్ తో బీజేపీ  మూడు సీట్లకోసం అడిగిందా?  రాధాకృష్ణ కింద పనిచేసే అటెండర్ కూడా నమ్మడేమో!  బీజేపీ సొంతంగా పోటీ చేసి నాలుగు సీట్లు గెలుచుకోవడానికి కారణం సరైన అభ్యర్థులను ఎంచుకోవడంలో కేసీఆర్ ప్రదర్శించిన ఉదారత తప్ప  బీజేపీ సొంత బలం కాదు.  బీజేపీకి అంత బలమే ఉంటే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఎందుకు చావుదెబ్బ తిన్నది?  నాడా దొరకగానే గుర్రం లభించినట్లు ఫీలయితే నడ్డి విరిగిపోతుంది.  
 
****
“ప్రభుత్వ అధికారులను గవర్నర్‌ నేరుగా పిలిపించుకోవడంపై సహజంగానే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రులకు తెలియజేసిన తర్వాత అధికారులను పిలిపించుకునే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. అయితే, రాజకీయ కారణాలవల్ల గవర్నర్లు కొన్ని సందర్భాల్లో మౌనంగా మరికొన్ని సందర్భాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.”
 
 
ఏమి నీతులు!  నీతులు చెప్పడంలో మన రాధాకృష్ణకు పీఠాధిపతులు కూడా సాటిరారు.  గవర్నర్ నేరుగా ప్రభుత్వ అధికారులను పిలిపించుకుని సమీక్షలు చేస్తే ఇక ప్రజాప్రభుత్వం దేనికి?  గవర్నర్ ఎలాంటి పరిస్థితుల్లో పాలనలో జోక్యం చేసుకోవాలో రాజ్యంగంలో నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి.  ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉండగా, ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వకుండా గవర్నర్ ప్రభుత్వ అధికారులను పిలిపించుకోవడం సమర్ధనీయమా?  క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎలా విమర్శలపాలు అవుతున్నారో చూడటం లేదా?   ముఖ్యమంత్రి పదిరోజులపాటు అందుబాటులో లేనంతమాత్రాన పరిపాలన ఏమైనా ఆగిపోయిందా?  రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందా?  ప్రజలెన్నుకున్న ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు కేంద్రం ఏజెంట్ అయిన గవర్నర్ పాలనావ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనుచితం.  
 
****
“రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా, రాకపోయినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి కనీసం అరడజను లోక్‌సభ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు అనుగుణంగానే బీజేపీ రాష్ట్ర నాయకులు దూకుడు పెంచారు.”
 
ఎవరు వద్దన్నారు?  అరడజను కాకపొతే డజను గెలుచుకోవచ్చు.  ప్రజాస్వామ్యంలో నాయకులు, పార్టీల తలరాతలు నిర్ణయించేది ప్రజలే.  పార్టీలు లక్ష్యాలను నిర్దేశించుకోవడం, అందుకు అనుగుణంగా నడచుకోవడం అందరూ అంగీకరిస్తారు.  కానీ, దూకుడు పెంచడం అంటే ఏమిటి?  ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతును కూడగట్టాలి. అంతే తప్ప ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించడం, మంచిపనులు కూడా విమర్శించడాన్ని దూకుడు పెంచడం అంటారా?  
 
****
“దీనికితోడు రాష్ట్రంలో ఏ సమస్యా లేనట్టుగా సచివాలయం కూల్చివేయడాన్ని సమాజం జీర్ణించుకోలేకపోతోంది. కరోనా సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కేసీఆర్‌ ఈ కూల్చివేత నిర్ణయం తీసుకుని ఉండవచ్చుగాని, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందంటూనే, భారీ బడ్జెట్‌తో కొత్త సచివాలయాన్ని కట్టించాలనుకోవడాన్ని మాత్రం ప్రజలు హర్షించడం లేదు.”
 
 
హయ్యయ్యో….సచివాలయాన్ని కూల్చాలనేది నిన్నమొన్నటి ముచ్చటా?  ఎప్పటినుంచో కేసీఆర్ ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణ ప్రతిపాదన చేస్తూనే ఉన్నది.  ప్రతిపక్షాలు కోర్టులకు వెళ్లి ఆ ప్రతిపాదనను నిలువరించడానికి కేసులు వేశాయి.  చివరకు ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.  అప్పుడు మాత్రమే సచివాలయ భవనాల కూల్చివేతను మొదలు పెట్టారు.  రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నంతమాత్రాన నిర్మాణాలు ఆగిపోతాయా?  అరవై వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తామని అయిదేళ్లపాటు చంద్రబాబు ప్రజలను గ్రాఫిక్స్ మాయాజాలంతో మోసం చేస్తున్నప్పుడు ఈ సలహాను రాధాకృష్ణ ఇచ్చారా?  తాత్కాలిక భవనాల పేరుతో సచివాయలం, అసెంబ్లీ నిర్మాణాలకు చంద్రబాబు వెయ్యికోట్లు తగలేసినపుడు రాధాకృష్ణ కళ్ళు పనిచేయలేదా?  లక్షన్నర కోట్ల రూపాయల బడ్జెట్ కలిగిన రాష్ట్రం పాలనకు గుండెకాయ లాంటి భవనానికి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చెయ్యలేదా?  ఆ భవనం ప్రజల ఆస్తిగా మిగిలిపోతుంది తప్ప కేసీఆర్  కుటుంబంతో కాపురం ఉండటానికి కాదు కదా?  ఎందుకీ కడుపుమంట?  
 
****
” రెండు వారాలపాటు ప్రజలకు కనపడకుండా, వినపడకుండా ఫామ్‌హౌస్‌లో గడిపిన వైనం రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆయన ఆరోగ్యంపై వదంతులు షికార్లు చేశాయి. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను పట్టించుకోకుండా తన భద్రత తాను చూసుకోవడం ఏమిటన్న ప్రశ్నలు వినిపించాయి.”
 
 
ముఖ్యమంత్రి అంటే ప్రతిరోజూ ప్రజలకు కనపడాలా?  నేను బతికేవున్నాను అని రోజూ చాటిచెప్పాలా?  ఫార్మ్ హౌస్ ఏమైనా దండకారణ్యంలో ఉన్నదా?  లేక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నదా?  నగరానికి కూతవేటు దూరంలోనే కదా ఉన్నది?  ముఖ్యమంత్రి ఫార్మ్ హౌస్ లో కూర్చుంటే ఏమిటి?  ప్రగతి భవన్ లో కూర్చుంటే ఏమిటి?  పరిపాలనకు ఏమైనా ఆటంకాలు ఏర్పడ్డాయా?  ప్రభుత్వ పధకాలు ఆగిపోయాయా?  అయినా ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు?  ఎవరింట్లో ఉన్నాడు అనేది ప్రజలకు అవసరమైన విషయమా?  ముఖ్యమంత్రి తన వయసు రీత్యా, ఆరోగ్యం రీత్యా భద్రత పాటించడం నేరమా?  ఆయన మాత్రం మనిషి కాదా?  అధికార పార్టీ, ప్రతిపక్షంలో కొందరు నాయకులకు కూడా కరోనా సోకి క్వారంటైన్ లోకి వెళ్లారు.  మహమూద్ ఆలీ ఆసుపత్రిలో పదిరోజులు ఉన్నంతమాత్రాన పోలీసు వ్యవస్థ కూలిపోయిందా?  అంతెందుకు?  రాధాకృష్ణ యజమాని చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు అయ్యుండీ,  రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజలకు ధైర్యం చెప్పడం మానేసి కరోనా భయంతో మూడు నెలలపాటు తెలంగాణలోని తన దివ్యభవనంలో ఎందుకు దాక్కున్నట్లు?  అడిగావా రాధాకృష్ణా?  
 
****
“ఇప్పుడు కేసీఆర్‌ సుదీర్ఘకాలం ఫామ్‌హౌస్‌లోనే గడుపుతున్నందున తనకు బదులు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయవచ్చుకదా… అన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడుతోంది. ప్రజల నుంచి అలాంటి డిమాండ్‌ రావాలని కేసీఆర్‌ కూడా కోరుకుంటున్నారేమో తెలియదు. అందుకోసమే రెండు వారాలు ఆయన ఫామ్‌హౌస్‌కే పరిమితమై ఉండవచ్చు కూడా! కేసీఆర్‌ ఆలోచనలు, చర్యలు ఇలాగే అనూహ్యంగా ఉంటాయి మరి!”
 
 
హ్హాహ్హా…మనకు తెలియదు కానీ, రాధాకృష్ణలో మరో రాజబాబు, రేలంగి, రమణారెడ్డిలు కట్టగట్టుకుని దాగున్నారు.  తండ్రి కొడుకుల మధ్య అభిప్రాయభేదాలు సృష్టించి పార్టీ శ్రేణుల్లో అయోమయాన్ని రగిలించడానికి పన్నిన దుష్ట పన్నాగం తప్ప మరొకటి ఉందా?  కేసీఆర్ బొందిలో ఊపిరి ఉండగా మరొకరిని ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు ఊహల్లో అయినా అనుమతిస్తారా?   కేసీఆర్ స్వచ్ఛందంగా కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చెయ్యాలనుకుంటే ఆయనకు చిటికెలో పని అది.  అందుకోసం ఫార్మ్ హౌస్ లో రెండు వారాలపాటు దాక్కోవాల్సిన అవసరం ఆయనకు ఎంతమాత్రమూ లేదు.  పార్టీ వారితో నాటకాలు ఆడించాల్సిన అగత్యం అసలే లేదు.  
 
****
“సునీల్‌ దేవధర్‌, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వంటి వారు ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తుంటారని బీజేపీలోని ఒక వర్గం ఎప్పటి నుంచో ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేస్తోంది. ఆ ఫిర్యాదులను పార్టీ అగ్రనాయకత్వం పెద్దగా పట్టించుకోలేదు.”
 
సునీల్, జీవీఎల్ అనేకమార్లు కొండబద్దలు కొట్టారు.  మేము చెప్పే ఏ విషయం అయినా కేంద్ర నాయకత్వం మాటే అని స్పష్టంగా చెప్పారు.  ఇక బీజేపీలోని ఒక వర్గం అంటే బహుశా రాధాకృష్ణ దృష్టిలో చంద్రబాబు అవినీతి సొమ్ము మరిగిన బానిస వర్గం, కోవర్టులు వర్గం కావచ్చు.  అందుకే బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబు ముఠా ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు.  
 
*** 
“ఇలాంటి పరిణామాలను నిశితంగా గమనిస్తే ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దలకు, ముఖ్యమంత్రి జగన్‌ అండ్‌ కోకు మధ్య బయటకు కనబడని అవగాహన ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.”
 
 
అనుమానాలు ఇప్పుడు వ్యక్తం కావడం ఏమిటయ్యా బాబూ?  కేంద్రం తో మాకు సఖ్యత ఉన్నదని, రాజధాని తరలింపు, పోలవరం ఇంకా అనేక అంశాలను కేంద్రం అనుమతితోనే చేస్తున్నామని విజయసాయిరెడ్డి ఎన్ని వందలసార్లు ప్రకటించలేదు?  చంద్రబాబు మీద నమ్మకం లేకపోవడం, జగన్ చిత్తశుద్ధి మీద విశ్వాసం కలగడం…కారణాలు ఏవైనా కానీ, జగన్ మద్దతు తమకు అవసరం అని బీజేపీ తొలినుంచి భావిస్తున్నది.  
 
****
“ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై తాము దూకుడు పెంచితే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ లాభపడుతుందన్న ఉద్దేశంతో తాము సంయమనం ప్రదర్శిస్తున్నామని బీజేపీ రాష్ట్ర నాయకుడొకరు చెప్పుకొచ్చారు. ఎన్నికలనాటికి సొంతంగా బలపడలేని పక్షంలో మళ్లీ తెలుగుదేశంతో జతకట్టాల్సి రావచ్చునని, తమ పార్టీలోకూడా కొంత మంది అదే కోరుకుంటున్నారని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి వ్యవహార శైలిని గమనించాక ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సంస్థలు కూడా చంద్రబాబు విషయంలో తమ వైఖరిని మార్చుకుంటున్నట్టు చెబుతున్నారు.”
 
హమ్మయ్య…చివరకు తన మనసులోని మాటను బయటపెట్టుకున్నారు రాధాకృష్ణ.  తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయకత్వంలో సమాధి తప్పదని అర్ధమైంది.  లోకేష్ నాయకత్వంలో ఆ సమాధి లోతు మరింతగా పెరిగి పాతాళలోకం అంచులు చూస్తుందని తెలుసు.  అందుకే ఇప్పుడు అర్జెంట్ గా విడాకులు తీసుకున్న బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పెళ్లి చెయ్యాలి. అందుకని తెలుగుదేశంతో జట్టు కట్టాలని ఎవరో కోరుకుంటున్నారని ఒక గాలివార్తను ప్రచారంలోకి తీసుకుని రావాలి.   తాము యమర్జంటుగా చంద్రబాబుతో జత కట్టకపోతే రాష్ట్రంలో చచ్చిపోతామని బీజేపీ నాయకులు నమ్ముతున్నట్లు పుకార్లు లేవదీసి ఛానెల్స్ లో చర్చోపచర్చలు నిర్వహించి మోడీ మనసు కరిగించాలి.  చంద్రబాబు జైలుకు వెళ్లకుండా రక్షించాలి.  బీజేపీ సహకారంతో జగన్ ను ఇబ్బందులకు గురి చేసి మళ్ళీ దోపిడీ పాలనకు లాకులెత్తాలి!   ఇక దీనిలో ఆరెస్సెస్ ను కూడా లాగేసారు రాధాకృష్ణ.  ఆరెస్సెస్ వాళ్ళు చంద్రబాబు పట్ల తమ వైఖరిని మార్చుకుంటున్నారట!  నవ్వొస్తుందా….నవ్వుకోండి…నాకేమి సిగ్గు!  
 
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు