తెలుగు రాష్ట్రాల్లో బిర్యానీ అంటే భలే ఫేమస్.. పార్టీలు, పెళ్లిళ్లు, చిన్న గెట్టు టుగెదర్స్ అయినా.. బిర్యానీ లేకుండా పూర్తి అవదు. ఇక బిర్యానీకి అభిమానులు లక్షల్లో ఉంటారు. కమ్మని బిర్యానీని వేడి వేడి గా ఆరగించడంలోనే తాపత్రయం చాలా మందికి దాగి ఉంటుంది. కానీ అదే బిర్యానీ అధిక బరువు పెంచేస్తుందన్న భయం ఇప్పుడు చాలా మందిని భయపెడుతుంది.. దీంతో బిర్యానీ తినడానికి కొందరు జంకుతున్నారు. బిర్యానీ ఎక్కువ తింటే కొవ్వు పడుతుందని.. బరువు పెరుగుతుందన్న ఆందోళనతో నోటికి తాళం వేసుకుని బిర్యానీకి దూరమవుతున్నారు. అయితే ఇలాంటి వారికి గుడ్‌న్యూస్! బిర్యానీ తిన్నా బరువు పెరగని విధానం కూడా ఉందని డైట్ నిపుణులు చెబుతున్నారు. ఈ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సాధారణంగా బయట హోటళ్ళ బిర్యానీలు తినడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు. అయితే ఇంట్లో చేసుకునే బిర్యానీ కొంచెం స్మార్ట్‌గా చేస్తే చాలు, ఇది రుచికి రుచి.. ఆరోగ్య పరిరక్షణ కూడా ఎంతో మంచిదని చెబుతున్నారు. ఇంట్లో తయారు చేసుకునే బిర్యానీ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే బరువు అస్సలు పెరగరని నిపుణులు అంటున్నారు.
ముందుగా బాస్మతీ బియ్యం వదిలేయండి. దాని బదులు బ్రౌన్ రైస్ వాడండి. ఫైబర్ ఎక్కువగా ఉండే బ్రౌన్ రైస్ తిన్నప్పుడు ఎక్కువగా తినలేరు. కొంచెం తిన్నా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఈ బ్రౌన్ రైస్ బిర్యానీ రుచి కూడా అదిరిపోతుంది. అలాగే చిరుధాన్యాలు కూడా బిర్యానీకి బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా అరికలు (కుడో మిల్లెట్)తో బిర్యానీ చేస్తే బరువు నియంత్రణలోనే ఉంటుంది.
ఇంకా.. బిర్యానీని కూరగాయలతో నింపేయండి. క్యారెట్, బీన్స్, బఠాణీలు, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటివి చేర్చుకుంటే రుచీ, ఆరోగ్యం రెండూ లభిస్తాయి. మాంసాహార ప్రియులకు కూడా కాస్త జాగ్రత్తలు తప్పవు. చికెన్ బిర్యానీ తింటే, స్కిన్ లెస్ చికెన్ మాత్రమే వాడాలి. ఇక పన్నీర్ బదులు సోయా ముక్కలు జోడిస్తే మరింత ఆరోగ్యం. మసాలాలు తక్కువగా వాడటం గుండెకు మేలు చేస్తుంది.
ముఖ్యంగా బిర్యానీ ఎంత రుచిగా ఉన్నా, ఎంత ఆరోగ్యంగా చేసినా ఎక్కువ తింటే ప్రయోజనం ఉండదు. వారానికి ఒకసారి సరిపోతుంది. అదే వారంలో మూడు సార్లు బిర్యానీ తింటే బరువు తగ్గడం కలే అవుతాయి. కడుపు మాత్రమే కాదు.. కాళ్లు కూడా కదలాలి. వాకింగ్, జాగింగ్, జిమ్.. ఏదైనా సరే.. కొవ్వు ఖర్చు చేయాల్సిందే. మొత్తానికి రుచి కోసం బిర్యానీకి దూరం ఉండే రోజులుకి గుడ్ బై చెప్పండి. చిన్న మార్పులతోనే కమ్మటి బిర్యానీని ఆరోగ్యంగా తిని, బరువును అదుపులో పెట్టొచ్చు. ఇక పార్టీలు, పెళ్లిళ్లు, స్నేహితుల గెట్టు టుగెదర్స్‌లో బిర్యానీ వద్దు అని చెప్పాల్సిన పని ఉండదు.
