సమకాలీన రాజకీయాల్లో మరెవరికీ దక్కనటువంటి అరుదైన అనూహ్యమైన అసాధారణమైన రాజకీయ ప్రస్థానం ఆయనది. సువిశాలమైన దేశంలో ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదుగుతూ చివరికి ఆ దేశానికే ప్రధాన మంత్రి కావడం అనేది మాటల్లో వ్యక్తీకరించడం సాధ్యం కానటువంటి అత్యద్భుతమైన ఘట్టం. అటువంటి ఘనత సాధించిన ఏ వ్యక్తి అయినా అత్యున్నత ప్రసంశలకు అర్హుడే. ఆ ఘనత సాధించిది ప్రస్తుత మన ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అలియాస్ నరేంద్ర మోడీ. ఛాయ్ వాలా నుంచి దేశ ప్రధాని దాకా ఆయన ఎదిగిన తీరు నభూతో నభవిష్యత్ అనే నానుడికి నిలువెత్తు నిదర్శనం. అంతటి అసాధారణ ప్రయాణం కాబట్టే ఆయనను ప్రపంచం ప్రశంసలతో ముంచెత్తుతోంది. నేడు నరేంద్ర మోడీ 70 వ పుట్టిన రోజు…ఈ సందర్భంగా ఆయన జీవన ప్రస్థానంపై ప్రత్యేక కథనం.
నరేంద్ర మోడీ బాల్యం
1950, సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని వాద్‌నగర్‌లో వెనకబడిన సామాజిక వర్గానికి చెందిన ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో నరేంద్ర మోడీ జన్మించారు. తల్లిదండ్రులు శ్రీమతి హీరాబా మోడీ, శ్రీ దామోదర్ దాస్ మోడీ. ఈ దంపతులకు మొత్తం ఆరుగురు సంతానం కాగా వారిలో మూడో వ్యక్తి నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ బాల్యం అంత సుఖమయంగా ఏమీ సాగలేదు. పేదరికం కారణంగా కుటుంబం మొత్తం ఒక చిన్న ఇంట్లో నివాసం ఉండే వారు. మోడీ తండ్రికి స్థానిక రైల్వే స్టేషన్‌లో ఒక టీ స్టాల్ ఉండేది. చిన్నప్పుడు నరేంద్ర మోడీ చదువుకుంటూనే తన తండ్రి టీ స్టాల్‌లో ఆయనకు సహాయపడుతూ ఉండేవారు. అలా 1967 వరకు వాద్‌నగర్‌లోనే హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత ఆయన కూడా అదే రైల్వే స్టేషన్ లో సొంతంగా ఒక టీ స్టాల్ ఏర్పాటు చేసుకొని నడిపారని, అందువల్లే ఆయన ఛాయ్ వాలా అయ్యారంటారు.
ఆర్ఎస్ఎస్ లోకి అడుగు
మోడీ ఎనిమిదేళ్ల వయస్సులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పట్ల ఆకర్షితులయ్యారు. అలా అందులో బాల సేవక్ గా కొనసాగుతూ 1971లో ఆయన ఆర్ఎస్ఎస్‌లో పూర్తి స్థాయిలో చేరిపోయారు. ఆ క్రమంలో 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో మోడీ కూడా కొన్నాళ్లు అండర్ గ్రౌండ్‌లో తలదాచుకోవాల్సి వచ్చింది. అనంతరం 1978లో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ నుంచి పొలిటికల్ సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పొందారు. ఆ తరువాత 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి డిస్టన్స్‌లో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పొందారు.
ఆర్ఎస్ఎస్ నుంచి బిజెపి లోకి
ఆ తరువాత 1985లో ఆర్ఎస్ఎస్ ఆయనను బీజేపీలో చేర్పించింది. అలా మోడీ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ క్రమంలో 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం వెనుక మోడీ నిర్విరామ కృషి ఉంది. దీన్ని గుర్తించిన పార్టీ ఆ తరువాత గుజరాత్ బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీని చేసింది. ఆ తరువాత 1990లో బీజేపీ నేషనల్ ఎలెక్షన్ కమిటీలో మోడీ సభ్యుడయ్యారు. ఆ తరువాత అదే ఏడాది బిజెపి అగ్ర నేత ఎల్‌కే అద్వానీ చేపట్టిన రామ్ రథ్ యాత్రకు, 1991-92లో మురళీ మనోహర్ జోషి చేపట్టిన ఏక్తా యాత్రకు మోడీ కో ఆర్డినేటర్ గా పనిచేశారు. అయితే 1992 నుంచి 1994 వరకు పలు వ్యక్తిగత కారణాల వల్ల బీజేపీకి దూరం అయిన మోడీ మళ్లీ పార్టీలోకి వచ్చి రాజకీయాల్లో మరింత చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టారు.
ఆ గుజరాత్ ఎన్నికలే మలుపు
బిజెపిలో హార్డ్ వర్కర్ గా,ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన ఆయనను 1995 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరుపున పనిచేసే బాధ్యత అప్పగించారు. ఆ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించగా ఆ గెలుపుకు కార్యసాధకుల్లో ఒకరిగా మోడీకి బీజేపీ జాతీయ కార్యదర్శి పదవి లభించింది. దీంతో ఆయన మకాం అప్పుడు గుజరాత్ నుంచి ఢిల్లీకి మారింది. ఈ నేపథ్యంలో 1998లో గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వం అనూహ్యంగా కూలిపోయింది. దీంతో మళ్లీ ఎన్నికలు రాగా అంతకుముందు గుజరాత్ ఎన్నికలకు పనిచేసిన నరేంద్ర మోడీనే మళ్లీ బీజేపీ విజయానికి వ్యూహం రచించారు.
దీంతో ఆ పార్టీ మరోసారి ఘన విజయం సాధించడంతో దరిమిలా మోడీకి అదే సంవత్సరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి లభించింది. అయితే 2001లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ అనారోగ్యానికి గురయ్యారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తన అసెంబ్లీల్లో కూడా ఓటమి పాలయింది. మరోవైపు భుజ్‌లో భూకంపం సంభంవించగా, బాధితులను ఆదుకోవడంలో సిఎం కేశూభాయి పటేల్ విఫలం అయ్యారు. దీంతో పటేల్‌ను సీఎంగా తప్పించిన బీజేపీ అధిష్టానం నరేంద్ర మోడీని గుజరాత్ సీఎంగా నియమించింది.
సిఎం గా మెరుపు…తరువాత పిఎం పదవి
అలా 2001 అక్టోబర్ 7 న ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నరేంద్ర మోడీ 2014 మే 22వ తేదీ వరకు 12 ఏళ్ల 7 నెలల పాటు సుదీర్ఘంగా పరిపాలన సాగించి గుజరాత్ చరిత్రలో నూతన రికార్డు నెలకొల్పారు. ఆ తరువాత ఆయన చూపు ప్రధాన మంత్రి పదవిపై పడింది. మీడియాను సమర్థవంతంగా వాడుకోవడంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఆయన దాన్నే కీలకంగా వినియోగించుకొని తానే భావి ప్రధాని గా రిఫరెండంలా జరిగిన 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని విజయతీరాలకు చేర్చారు. అయితే తాను ఎప్పుడూ ప్రధాని కావాలని కోరుకోలేదని, అలాంటి కలలు కనలేదని…కానీ ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి కావాలని మాత్రం కోరుకున్నట్టు మోడీ చెప్పేవారు. ప్రజలే తనను ప్రధాని అయితే బాగుండని కోరుకున్నారని అనేవారు.
ప్రధానిగా ప్రత్యేక ముద్ర
2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్డీయేను గెలుపు తీరాలకు చేర్చి పూర్తి మెజారిటీతో 2014 మే 26న ప్రధాన మంత్రి పీఠాన్ని తొలిసారి అధిరోహించారు. ఆ క్రమంలోనే దేశంలో మరే ప్రధాని సాహసించని రీతిలో అసాధారణ నిర్ణయాలు తీసుకొంటూ సంచలన సృష్టించారు. స్వచ్ఛభారత్, నోట్ల రద్దు, జీఎస్టీ విధింపు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన,శ్రమయోగి మాన్ ధన్ యోజన, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, జన్ సురక్ష, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, మేక్ ఇన్ ఇండియా, యోగా దివస్ వంటి పథకాలు ప్రవేశపెట్టారు. అలా ప్రజల్లో దార్శనికుడుగా గుర్తింపు పొంది 2019 ఎన్నికల్లో మరోసారి గెలిచి రెండో సారి ప్రధానమంత్రి పీఠం అధిరోహించారు.
మరకలు కూడా ఉన్నాయి…
2002లో మోడీ గుజరాత్ సియంగా ఉన్నప్పుడే గోద్రా అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి 27, 2002న గుజరాత్‌లోని గోద్రాలో సబర్మతి ఎక్స్‌పెస్ ఎస్-6లో చెలరేగిన మంటల్లో 59 మంది సజీవ దహనమైన ఘటన దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ సంఘటన తరువాత గుజరాత్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు, మతకల్లోలాలు చెలరేగాయి. పరస్పర దాడుల కారణంగా అనేక సజీవ దహనాలు చోటుచేసుకున్నాయి. వందలాది పట్టణాలు,గ్రామాలు అట్టుడికిపోయాయి.1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అయినా గుజరాత్ సిఎం నరేంద్ర మోడీ వాటిని అడ్డుకోకుండా ఒక వర్గానికి సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆ అల్లర్లలో హతమైన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ గుల్బర్గ్ సొసైటీ మారణకాండపై దాఖలు చేసిన పిటిషన్‌లో మోడీతో సహా 61 మందిపై హత్య, కుట్ర అభియోగాలు నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సుదీర్ఘకాలం పాటు జస్టీస్ నానావతి కమిషన్ నేతృత్వంలో సాగిన ఈ విచారణలో నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ లభించింది. అయితే నరేంద్ర మోడీ వివాహం, భార్యకి విడాకులు ఇవ్వకుండా విడనాడటం వీటిని లక్ష్యంగా చేసుకొని ప్రత్యర్థులు విమర్శలు చేస్తూనే ఉంటారు.
అందుకే మోడీ పై సినిమాలు
ఇంతటి అసాధారణ విజయాలు సాధించిన వ్యక్తి జీవితం సినిమా కు కథావస్తువు కాకుండా ఎలా ఉంటుంది. అందుకే ఈ ఏడాది ఆరంభంలో వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్ర పోషించిన ‘నరేంద్ర మోడీ’ అనే చిత్రం రూపుదిద్దుకొని విడుదలయింది. అయితే పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ జీవిత చరిత్ర ప్రతిబింబించేలా మరో బయోపిక్ ను నిర్మించేందుకు స్టార్ దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ సిద్దం అయ్యాడు. ఆయన కథలో అసాధారణ మలుపులు వంటివి బాగా నచ్చడంతో ఈ సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు సంజయ్ లీలా భన్సాలీ తెలిపారు. ఈ సినిమాకు ఈ చిత్రానికి ‘మన్ బైరాగీ’ అనే టైటిల్ ను ఖరారు చేశారని, సంజయ్ త్రిపాఠి దర్శకత్వం వహిస్తారని తెలిసింది.