బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ హింసావ్యాప్త ఘటనల నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందిన సంగతి తెలిసిందే. ఇటీవల అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ హింస తనను కూడా ప్రభావితం చేసిందని, ఆ సమయంలో తాను చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నానని హసీనా వివరించారు.
తనపై జరిగిన హత్యాయత్నాలను గురించి అవామీ లీగ్ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఓ ఆడియో సందేశంలో ఆమె పేర్కొన్నారు. ఆందోళనలు తీవ్రమవుతున్న సమయంలో తన సోదరి రెహానాతో కలిసి తాను అతి కష్టం మీద ప్రాణాలు కాపాడుకున్నానని హసీనా తెలిపారు. “మృత్యువు దరి చేరినా, తృటిలో తప్పించుకొని భారత్‌కు చేరుకున్నాం,” అని ఆమె అన్నారు.

ఇది మొదటిసారి కాదు గతంలోనూ తనపై పలు హత్యాయత్నాలు జరిగినట్లు హసీనా గుర్తుచేశారు. 2000లో కోటలీపర బాంబు దాడి, 2004 ఆగస్టులో జరిగిన ర్యాలీ దాడులను ప్రస్తావించారు. హర్కతుల్ జీహాద్ ఉగ్రవాదులు 2000లో కోటలీపర ప్రాంతంలో బాంబులు పెట్టి ఆమెను హతమార్చాలని యత్నించారని తెలిపారు. అయితే బాంబు నిర్వీర్య బృందాలు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ఆ దాడి విఫలమైంది.
2004 ఆగస్టులో ఉగ్రవాద వ్యతిరేక ర్యాలీలో జరిగిన గ్రెనేడ్ దాడి ఆమెకు మరోసారి ప్రాణాపాయం తెచ్చింది. ఈ దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా, 500 మంది గాయపడ్డారు. ఈ దాడిలో హసీనా స్వయంగా గాయపడిన విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న హసీనా తన ప్రాణాలను రక్షించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో బంగ్లాదేశ్‌ను శాంతియుత దేశంగా పునర్నిర్మాణం చేయాలని ఆమె ఆకాంక్షించారు.

