గుండె జబ్బులు ఒకప్పుడు పెద్దవారికి మాత్రమే సంభవిస్తాయనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు తిన్నది, తాగే నీరు, జీవనశైలి అన్నీ గుండె ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మనం ప్రతిరోజూ తినే కొన్ని ఆహారాలు గుండెకు నిశ్శబ్ద శత్రువులుగా మారుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఇటీవల గుండె వ్యాధులపై జరిగిన ఒక అధ్యయనంలో వాస్కులర్ సర్జన్ డాక్టర్ సుమిత్ కపాడియా హెచ్చరిస్తూ చెప్పారు “ఫ్రై చేసిన ఆహారాలు మాత్రమే కాదు, మనం తరచుగా తినే కొన్ని సాధారణ ఆహారాలు కూడా గుండెకు తీవ్ర హాని చేస్తాయి. ఇవి రక్తనాళాలను బలహీనపరచి, కొవ్వును పేరుకుపోయేలా చేసి, చివరికి గుండెపోటుకు దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రాసెస్ చేసిన మాంసం : సాసేజ్‌లు, సలామీలు, కబాబ్‌లు వంటి పదార్థాలలో అధిక సోడియం, సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి రక్తనాళాలను గట్టిపడేలా చేస్తాయి.
వేయించిన వీధి ఆహారాలు: పకోరాలు, సమోసాలు, పూరీలు, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి తరచుగా ఉపయోగించే నూనెలో వండడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడి రక్తప్రవాహం అడ్డుకుంటాయి.
పిండి పదార్థాలు: తెల్ల బ్రెడ్, పఫ్‌లు, బిస్కెట్లు రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచి గుండె మీద ఒత్తిడి పెంచుతాయి.
చక్కెర పానీయాలు: కోలా, ఎనర్జీ డ్రింక్స్, ప్యాక్ చేసిన జ్యూస్‌లు మొదట చల్లదనాన్ని ఇస్తాయేమో కానీ, రక్తపోటు, కొలెస్ట్రాల్ పెంచే ప్రమాదం ఎక్కువ.
ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు: ఊరగాయలు, పాపడ్‌లు, నూడుల్స్ వంటి వాటిలో ఉన్న అధిక సోడియం గుండెపై ఒత్తిడి పెంచుతుంది.
అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు: ఇన్‌స్టంట్ నూడుల్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్, సాస్‌లలో ఉన్న రహస్య చక్కెరలు, కొవ్వులు గుండె నాళాలను మూసివేస్తాయి.
వైద్యులు చెబుతున్న వివరాల ప్రకారం.. ప్రతిరోజూ అలాంటి ఆహారాలు తినడం వల్ల గుండెకు కనిపించని హాని కలుగుతుంది. ప్రతి సారి అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహారం తినేటప్పుడు గుండెపోటు ప్రమాదం 7 శాతం పెరుగుతుందనే అధ్యయనాలు ఉన్నాయని హెచ్చరించారు. అయితే ప్రమాదాన్ని తగ్గించుకోవడం అంత కష్టం కాదు. ఇంట్లో వండిన ఆహారాన్నే ఎక్కువగా తినడం, తాజా కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు తీసుకోవడం గుండెకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలు వీలైనంత తగ్గించాలి. రోజువారీ నడక, వ్యాయామం, నీరు ఎక్కువగా తాగడం, మానసిక ఒత్తిడిని తగ్గించడం కూడా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అదే సమయం లో, వైద్యులు చెబుతున్నట్లు “మన గుండె మనం తినే ఆహారమే తయారుచేస్తుంది. కాబట్టి గుండెపోటు తర్వాత కాదు, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
