వరద గుప్పిట్లో అగ్రరాజ్యం… నదీపాయలుగా న్యూయార్క్ రోడ్లు!

అగ్రరాజ్యం అమెరికా అయినా, భాగ్యనగరం హైదరాబాద్ అయినా… భారీ వర్షాలు కురిస్తే నగర వాసుల పరిస్థితి అత్యంత దయణీయంగా మారిపోతుందా అనే ఆలోచన కలిగే సంఘటన తాజాగా జరిగింది. భారీగా కురిసిన వర్షాలు, ఫలితంగా వచ్చిన వరదలతో అగ్రరాజ్యం అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని న్యూయార్క్ నగరం అయితే వరదలతో నిండిపోయింది!

అవును… భారీ వర్షాలతో అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ అతలాకుతలమౌతోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఏకంగా ఎమర్జెన్సీని విధించారు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఇళ్లల్లో నుంచి బయటికి రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. న్యూయార్క్‌ లో కురిసిన భారీ వర్షానికి వచ్చిన ఆకస్మిక వరదలే దీనికి కారణం.

శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా కురిసిన వర్షానికి న్యూయార్క్ నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. సబ్‌ వేలు, ఎయిర్‌ పోర్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో వాటిని తాత్కాలికంగా మూసివేశారు. ఇదే సమయంలో రైలు పట్టాలపై వరదనీరు భారీగా చేరడంతో పలు రైళ్లు రద్దయ్యాయి.

ఇలా అవిరామంగా కుండపోతగా కురుస్తోన్న వర్షాలతో వరదల ఉద్ధృతి మరింత పెరిగే అవకాశముందని అమెరికా జాతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని నగర మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరించారు.

శుక్రవారం తెల్లవారు జామున బ్రూక్లిన్, జాన్ ఎఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం, బారో ఆఫ్ క్వీన్స్, లోయర్ మన్‌ హట్టన్, కాలేజ్ పార్క్, లాంగ్ ఐస్‌ లాండ్, హడ్సన్ వ్యాలీ, అవుటర్ మేరీలాండ్ మొదలైన ప్రాంతాల్లో సుమారు ఆరు సెంటీ మీటర్ల మేర వర్షపాతం నమోదైందని చెబుతున్నారు.

కాగా.. సుమారు రెండేళ్ల కిందట సెప్టెంబర్‌ నెలలో కురిసిన భారీ వర్షాలు, ఫలితంగా ముంచుకొచ్చిన వరదలు ఈశాన్య రాష్ట్రాల్ని కోలుకొని విధంగా దెబ్బతీసిన సంగతి తెలిసిందే. ఈ వరదల వల్ల బ్రూక్లిన్‌, క్వీన్స్‌ రాష్ట్రాల్లో వరదల ధాటికి 13 మంది మృతి చెందారు. ఈ క్రమంలో తాజాగా ఇప్పుడు మరోసారి వరదలతో ఈశాన్య రాష్ట్రాలు వణికిపోతున్నాయి. జరిగిన నష్టాలకు సంబంధించి విషయాలు తెలియాల్సి ఉంది.