వానొస్తే, వరదొస్తుంది.. ఆ వరదతోపాటే రాజకీయం కూడా వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో కాదేదీ రాజకీయానికి అనర్హం. ఆ మాటకొస్తే, ఎక్కడైనా రాజకీయం ఒకటే. కాకపోతే, ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇంకా ఇంకా చిత్రం.
గోదావరి వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వరద ముంపు ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు రెండు వేల రూపాయల చొప్పున తక్షణ ఆర్థిక సాయం ప్రకటించింది. దాంతోపాటుగా, నిత్యావసర వస్తువులను ఉచితంగా అందించనున్నట్లు కూడా ప్రకటించింది ప్రభుత్వం.
ఏ ప్రభుత్వమైనా చెయ్యాల్సింది ఇదే. వరదల కారణంగా ముంపు ప్రాంతాల్లోని ప్రజలు సర్వం కోల్పోతుంటారు. వారి బాధలు వర్ణనాతీతం. ప్రభుత్వాలు ఎంత శ్రద్ధ పెట్టినా, ప్రజల్ని పూర్తిస్థాయిలో ఆదుకోవడం కష్టం. ఆ స్థాయి చిత్తశుద్ధి ప్రభుత్వంలో వున్నవారికి వుండదన్నది బహిరంగ రహస్యమే.
‘నిధులకు లోటు లేదు.. అందర్నీ ఆదుకోండి..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వరదలపై అధికారులతో సమీక్ష సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతేనా, విపక్షాలు వరదలతోనూ రాజకీయాలు చేస్తున్నాయనీ, మీడియా సైతం, ప్రభుత్వంపై బురద చల్లుతోందని అధికారులతో చెప్పారు వైఎస్ జగన్.
బాధితుల్ని ఆదుకోండి.. బురద రాజకీయాలు చేస్తోన్నవారిపై చర్యలు తీసుకోండని అధికారులకు ముఖ్యమంత్రి సూచించడం గమనార్హం. వరద అన్నాక బురద రాజకీయం తప్పదు. విపక్షంలో వున్నప్పుడు వైసీపీ కూడా చేసింది అదే. ఆ రాజకీయమే లేకపోతే, ప్రజల్ని పట్టించుకునేదెవరు.?
ప్రశ్నిస్తున్న విపక్షాలపైనా, నిలదీస్తున్న మీడియాపైనా చర్యలకు సిద్ధమవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించడం సబబు కాదన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.