ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాత, రాజధాని లేని రాష్ట్రంగా పాత పేరుతో కొత్తగా ఏర్పడింది 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించడం, అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అమరావతికి ‘విధిలేని పరిస్థితుల్లో’ ఆమోద ముద్ర వేయడం, ఈ క్రమంలో చాలా పబ్లిసిటీ స్టంట్లు తెరపైకి రావడం, చివరికి వైఎస్ జగన్ హయాంలో అమరావతి అయోమయంలో పడటం తెలిసిన సంగతులే.
అమరావతి శంఖుస్థాపనకి ఐదేళ్ళు
అమరావతికి శంఖుస్థాపన జరిగి నేటితో ఐదేళ్ళు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. మూడు వందల రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు అమరావతి రైతాంగం. సరే, వారి డిమాండ్లలో ఎంత న్యాయం వుంది.? ప్రస్తుత అధికార పార్టీ వాదన ఏంటి.? గత ప్రభుత్వం అమరావతి పేరుతో కేవలం పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే చేసిందా.? అన్నది వేరే చర్చ. కానీ, రాష్ట్రానికి రాజధాని అనేది గుండెకాయ. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఆ రాజధాని నుంచే రాష్ట్రాలకు అత్యధిక ఆదాయం సమకూరుతుంటుంది.
రాజధాని పంచాయితీ ఈనాటిది కాదు
13 జిల్లాల తెలుగు ప్రజానీకానికి మొదటి నుంచీ రాజధానితో పంచాయితీనే. చాలా ఏళ్ళ క్రితం మద్రాసుతో గొడవ, ఆ తర్వాత హైద్రాబాద్‌తో గొడవ. ఇప్పుడేమో అమరావతి విషయంలో గొడవ. మింగడానికి మెతుకుల్లేవుగానీ, మీసాలకు సంపంగె నూనె.. అన్నట్లు, ఒక్క రాజధానికే దిక్కులేని పరిస్థితుల్లో, రాష్ట్రానికి ఏకంగా మూడు రాజధానులంటోంది ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం. హైద్రాబాద్, మద్రాస్ లాంటి సమస్యలు రాకుడదంటే, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందేలా మూడు రాజధానులన్న ఆలోచనని పూర్తిగా తప్పు పట్టేయలేం. కానీ, అసలంటూ ఓ రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేశాక కదా, ఇంకోదానిపై దృష్టి పెట్టాలి.?
లక్ష కోట్లు అవసరంలేదుగానీ..
చంద్రబాబు ఆలోచన చేసినట్లుగా లక్ష కోట్లతో రాజధాని అవసరం లేదు. ఓ పది వేల కోట్లతో రాజధానిని పూర్తి చేయొచ్చు కదా.? ఇంకో పది వేల కోట్లు మరో రాజధాని కోసం కేటాయించొచ్చు కదా.! అదనంగా మరో పది వేల కోట్లతో మూడో రాజధానిని అభివృద్ధి చేయొచ్చు కదా.? ఏడాదిన్నరగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయింది. అమరావతి మొండిగోడలతో నిస్తేజంగా మారిపోయింది. ఎవరిది పాపం.? ఎవరికి నష్టం.? ఎవరిదీ కష్టం.? రాజకీయ నాయకులకు నష్టమేమీ వుండదు. చంద్రబాబుకి ఏమన్నా నష్టమా.? లేకపోతే, రేప్పొద్దున్న వైఎస్ జగన్‌కి ఏమన్నా కష్టమా.? రాజధాని లేని రాష్ట్రం.. అనే ఆవేదన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలోనూ వుంది.. వుండిపోతుంది కూడా.!
అది జరగదు, ఇది ముందుకు సాగదు..
ఇప్పట్లో మూడు రాజధానుల సాధ్యం కాదు, అందాకా అమరావతిని అభివృద్ధి చేయరు. కారణాలైవేతేనేం, ఆంధ్రప్రదేశ్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. కొత్తగా అభివృద్ధి అనే మాటకు అవకాశం లేని పరిస్థితి. సంక్షేమ పథకాలు అవసరమే కావొచ్చు, కానీ, అభివృద్ధి లేకపోతే ఎలా.? సంక్షేమ పథకాలకు చేస్తున్న ఖర్చులో పదో వంతు అయినా, రాష్ట్ర రాజధాని కోసం వెచ్చిస్తే.. కాస్తో కూస్తో అభివృద్ధి జరిగేదే. ఐదేళ్ళ క్రితం శంఖుస్థాపన చేసిన అమరావతి, ఇప్పుడు కళావిహీనంగా తయారైంది. చంద్రబాబు మీద ‘గ్రాఫిక్స్’ నెపం నెట్టేస్తోన్న వైసీపీ, గడచిన ఏడాదిన్నర కాలంలో ఏం చేసింది? ఏం చేయబోతోంది.? సమాధానం చెప్పలేని స్థితిలో పాలకులు వుండడమంటే, అది చేతకానితనానికి నిదర్శనమే కదా!