అధికారంలో వున్నవారికి, తమ చుట్టూ పెరుగుతున్న నెగెటివిటీ అంత తేలిగ్గా అర్థం కాదు. అర్థమయ్యేసరికి పరిస్థితి చెయ్యిదాటిపోతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనమేమీ వుండదు. చరిత్ర చెబుతున్న సత్యమిది. అధికారంలో ఎవరున్నాసరే, నెగెటివిటీని అధిగమించడం అంత తేలిక కాదు. అధిగమించడం సంగతి తర్వాత, అసలు గుర్తించడం కూడా తేలిక కాదు. ఎందుకంటే, ఎప్పుడూ తమ చుట్టూ భజన పరులే వుంటారు అధికారంలో వున్నవారి చుట్టూ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయమై రాజకీయ పరిశీలకుల్లో జరుగుతున్న చర్చ చూస్తోంటే, చంద్రబాబు బాటలోనే వైఎస్ జగన్ కూడా పయనిస్తున్నారా.? అనే అనుమానం కలగకమానదు.
వైఎస్ జగన్ ఆశయాలకు తూట్లు..
తనపై అక్రమాస్తుల కేసు నడుస్తూనే వున్నా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అవినీతికి ఆస్కారం లేని పాలన ఇవ్వాలనుకుంటున్నారు. ఆ దిశగా ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ప్రాజెక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్ అనేది అందులో ఒకటి. ముఖ్యమంత్రి ఈ స్థాయిలో పాజిటివిటీ క్రియేట్ చేస్తూంటే, ఆయన చుట్టూ వున్నవారు ఏం చేయాలి.? చేతనైతే ముఖ్యమంత్రికి సహకరించాలి.. కానీ, ఇక్కడ జరుగుతున్నది వేరు. ఓ మంత్రిపై ‘బెంజి కారు’ ఆరోపణలు వచ్చాయి. మరో మంత్రిపై ‘ఇసుక కుంభకోణం’ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకో మంత్రిపై ఇంకో ఆరోపణలు.. ఎమ్మెల్యేలపైనా, ఎంపీలపైనా వస్తున్న ఆరోపణలకైతే ఆకాశమే హద్దు.
వున్నపళంగా మారిపోతున్న ఈక్వేషన్లు..
ఒక్కసారిగా ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ఆయా నేతల మీద ఆరోపణలు వస్తోంటే, తొలుత ఎదురుదాడి షురూ అయ్యింది. ప్రధాన ప్రతిపక్షం పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోందంటూ అధికార పార్టీ నేతలు ఎదురుదాడికి దిగారు. కానీ, సొంత పార్టీలోనే లుకలుకలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలపైనే కాదు, మంత్రులపైనే స్థానిక నాయకత్వం తిరుగుబాటుకి సమాయత్తమవుతోంది. ఆయా నేతల దోపిడీల్ని సొంత పార్టీ నేతలే నిలదీస్తున్న వైనం కనిపిస్తోంది.
కీలెరిగి వాత పెట్టకపోతే ప్రమాదమే.!
చేతికి వున్న అన్ని వేళ్ళూ ఒకేలా వుండవు కదా.! ఏ ప్రభుత్వంలోనైనా కొందరితో సమస్య వుండొచ్చు. కానీ, ఆ సమస్యను అధిగమించి, అటు ప్రభుత్వాన్నీ.. ఇటు పార్టీనీ నడిపించడం అధినేతకు కత్తి మీద సాము లాంటిదే. అయినా తప్పదు, పార్టీ పట్లగానీ.. ప్రభుత్వం పట్లగానీ నెగెటివిటీ పెరగకుండా చూసుకోవాలి. ఏడాదిన్నర గడిచింది.. సవాళ్ళు ఇంకా అలానే వున్నాయి.. కొత్త సవాళ్ళు తెరపైకొస్తున్నాయి.. పార్టీలో పెరుగుతున్న లుకలుకల్ని మొదటి ప్రమాద హెచ్చరికగా భావించి వైఎస్ జగన్ అప్రమత్తం కాకపోతే.. ప్రభుత్వానికే సంకటంగా మారే పరిస్థితి రావొచ్చు.