ఒక విజయ్ మాల్యా, ఒక నీరవ్ మోడీ, ఒక సుజనాచౌదరి, ఒక రాయపాటి సాంబశివరావు చౌదరి…ఆహా..జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మారోమోగుతున్న నామధేయాల్లో మన తెలుగువారు కూడా ఉన్నందుకు మనం గర్వించాలి. ఇంకా చెప్పాలంటే మల్యాలను, మోడీలను తలదన్నే బందిపోట్లు మనకు జాతీయస్థాయిలో ప్రజాప్రతినిధులుగా పంపబడుతున్నందుకు ఇంకా చంకలు పగిలేట్లు గుద్దుకోవాలి. “అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న” అన్నట్లు ఒకడు ఆరువేల కోట్లు అయితే మరొకడు ఏడువేల కోట్లు…ఒకడు తొమ్మిదివేలకోట్లు..ఒకడు పదివేల కోట్లు! వీరంతా ఘరానా పెద్దమనుషులు…చట్టసభల్లో మంత్రుల సరసన దర్జాగా కూర్చుని వైభోగాలు వెలగబెడుతూ చట్టాలు తయారుచేసే పారిశ్రామికవేత్తలు! విడ్డూరం ఏమిటంటే అధికారంలో ఉన్నన్నినాళ్ళు వీరి వెంట్రుక కూడా ఎవరూ పీకలేరు. అధికారం కోల్పోయాక క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా అధికారపార్టీల్లోకి దూరిపోతుంటే….అప్పటిదాకా వారిని తీవ్రాతితీవ్రంగా విమర్శించినా పార్టీలు వారికి రెడ్ కార్పెట్ పరిచి స్వాగతాలు పలుకుతాయి! అధికారపార్టీల అధ్యక్షులు వారిని సరసన కూర్చోబెట్టుకుని సన్మానాలు చేస్తాయి…
ఇక వారిపై కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా వారిని రక్షించే కులనాథులు వివిధ వ్యవస్థల్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు. ఒకవేళ వారిని అరెస్ట్ చెయ్యడానికి పోలీసులు ప్రయత్నించినా అడ్డుచక్రాలు వేస్తారు. వారిమీద కేసులు పెట్టడానికి కూడా వీలు లేదని హుకుం జారీ చేస్తారు. అరెస్ట్ చేసిన పోలీసులపై మండిపడతారు. అసలు నువ్వు చదువుకుని ఉద్యోగంలోకి వచ్చావా లేక సిఫార్స్ మీద వచ్చావా అని గద్దిస్తారు. నువ్వసలు ఉద్యోగానికే పనికిరావని కన్నెర్రజేసి వారి ఆత్మాభిమానాన్ని హత్య చేస్తారు. అందుకే దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నారు.
రాయపాటి సాంబశివరావు చౌదరి సుమారు తొమ్మిదివేలకోట్ల రూపాయలకు బ్యాంకులకు కన్నం వేసాడట. రాయపాటి చరిత్ర ఎంత హీనమైనదో ఆ బ్యాంకులకు తెలియదా? చైనాకు ఎగుమతి చేసే పుగాకులో అంతా నాసిరకమే ఉన్నదని ఎప్పుడో నలభై ఏళ్ళక్రితమే ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఆయన వ్యాపార జీవితం మొత్తం అవినీతిమయమే. బ్యాంకులను మోసం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అనేకసార్లు ఆయనకు ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేశారు. ఆ మోసగాడి చరిత్ర తెలిసి కూడా ఆయనకు పోలవరం నిర్మాణ కాంట్రాక్టు కట్టబెట్టారంటే అధికారంలో ఉండేవారికి రాజకీయ ప్రయోజనాలు తప్ప దేశ ప్రయోజనాలు పట్టవని అర్ధం కావడం లేదూ? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయపాటిని దుమ్మెత్తిపోసిన చంద్రబాబు తాను అధికారంలోకి రాగానే సదరు కాంట్రాక్టును పువ్వుల్లో పెట్టి మళ్ళీ రాయపాటికి ఇచ్చారంటే చంద్రబాబుకు ఎన్ని వందలకోట్ల రూపాయల ఫలహారం దక్కి ఉంటుంది?
పోలవరం జాతీయప్రాజెక్టు అయినప్పటికీ, కేంద్రమే దాన్ని నిర్మించాల్సి ఉన్నప్పటికీ, చంద్రబాబు కేంద్రంతో యుద్ధం చేసి దాన్ని రాష్ట్రమే నిర్మిస్తుందని ఎందుకు తీసుకున్నాడో ఇప్పటికైనా అర్ధం కావడం లేదా? ప్రతి సోమవారం పోలవరం అంటూ డ్రామాలు ఆడిన చంద్రబాబు ప్రతి సోమవారం వెళ్లి అక్కడ ఎంత దోపిడీ జరిగిందో చూసి తన వాటాను తాను తీసుకోవడానికే పోలవరం నాటకాలు అని ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారు. రాయపాటి లాంటి ఘరానా బందిపోట్లతో లాలూచి పడుతూ ప్రజలకు ద్రోహం చేస్తూ చంద్రబాబు మరో పాతికేళ్ళు అధికారంలోకి ఉన్నా పోలవరం పూర్తికాదనేది నిర్వివాదాంశం. చంద్రబాబు నాయుడి ప్రోత్సాహం లేకపోతే రాయపాటికి ఇంత దోపిడీ సాధ్యం అయ్యేది కాదు.
ఇక మొన్న రమేష్ ఆసుపత్రి కేసులో హైకోర్టు ఏమని వ్యాఖ్యానించింది? రమేష్ ఆసుపత్రికి అనుమతులు ఇచ్చిన కలెక్టర్, ఆరోగ్యశాఖ అధికారులు, మునిసిపల్ అధికారుల మీద కేసులు నమోదు చెయ్యాలని గుడ్లెర్రజేసిందా లేదా? మరి ఇప్పుడు రాయపాటి లాంటి దోపిడీదొంగకు తొమ్మిదివేల కోట్ల రూపాయల ఋణం ఇచ్చారంటే దానిలో బ్యాంకు అధికారుల వాటా ఎంత? సంబంధిత మంత్రుల వాటా ఎంత? కేంద్రంలోని పెద్దల వాటా ఎంత? ఎవ్వరికీ ముడుపులు సమర్పించుకోకుండానే రాయపాటికి అంత ప్రజాధనాన్ని రుణంగా ఎలా మంజూరు చేశారు? రాయపాటితో పాటు ఇంకా ఏ ఏ అధికారులపై కేసులు పెట్టాలో, ఎవరెవరిని శ్రీకృష్ణజన్మస్థానానికి పంపాలో కోర్టులే నిర్ణయించాలి.
పోలవరం ప్రాజెక్టును ఏటీఎం లాగా చంద్రబాబు వాడుకున్నారని సాక్షాత్తూ ప్రధానమంత్రి ఆరోపించారు. అయినప్పటికీ వ్యవస్థలోని దొంగలంతా గప్ చిప్! ఒక్కడు కూడా దర్యాప్తు చెయ్యాలని కోరలేదు. పార్లమెంట్ దద్దరిల్లలేదు. కోర్టులు నోరెత్తలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఓడిపోకుండా ఉంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానట్లయితే రాయపాటి ఆగడాలు, దోపిడీ ఇంకా జరిగిపోతుండేది. దర్యాప్తు సంస్థల నివేదికలు తొక్కిపెట్టేవారు. ప్రజాధనం యథేచ్ఛగా దోపిడీకి గురయ్యేది.
ఇకనైనా దర్యాప్తు సంస్థలు, కోర్టులు నిజాయితీగా వ్యవహరించి గజదొంగలను బోనెక్కించి కఠిన శిక్షలు పడేట్లు చెయ్యకపోతే వ్యవస్థలమీద ప్రజలకు నమ్మకం నశిస్తుంది. రాయపాటికి కూడా సుజనాచౌదరి లాగే మహత్తర అవకాశం దక్కితే ఈ దేశాన్ని దేవుడు కూడా రక్షించలేడు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు