టిడిపి సీనియర్ నేత, మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాద్ చనిపోయి బుధవారం నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రధమ వర్థంతిని ఘనంగా నిర్వహించేందుకు కోడెల అభిమానులు సమాయత్తమయ్యారు. అయితే కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలుతున్న నేపథ్యంలో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు చేపట్టరాదని పేర్కొంటూ పోలీసులు కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామ్ కు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. వైసిపి నేతలు అనేక బహిరంగ కార్యక్రమాలు యధేచ్చగా నిర్వహిస్తుండగా వారికి లేని అడ్డంకులు మాకు ఎందుకు కల్పిస్తున్నారంటూ పోలీసుల తీరుపై కోడెల శివరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎట్టిపరిస్థితుల్లో ముందుగా అనుకున్న విధంగా నర్సరావుపేట, సత్తెనపల్లిలో కోడెల తొలి వర్థంతి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని స్పష్టంచేశారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఉద్రిక్తత నెలకొంది.
తొలి వర్థంతి నేడే
గత ఏడాది సెప్టెంబర్ 16 న మాజీ స్పీకర్ కోడె శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకొని మృతిచెందారు. ఆయన చనిపోయి ఏడాది పూర్తవగా బుధవారం ఆయన ప్రధమ వర్థంతిని ఆయన కంచుకోటయిన గుంటూరు జిల్లా నర్సరావుపేట, ఆయన చివరగా పోటీచేసిన సత్తెనపల్లిలో ఘనంగా నిర్వహించేందుకద్ కోడెల శివప్రసాద్ అభిమానులు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో కోవిడ్ 19 నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పోలీసులు ఈ సందర్భంగా కోడెల కుమారుడు శివరామ్ తో సహా పలువురికి నోటీసులు జారీ చేశారు. కరోనా విస్తృతి నేపథ్యంలో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే పోలీసుల తీరుపై కోడెల శివరామ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యథావిధిగా తాము కోడెల వర్థంతి వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు.
చంద్రబాబు,లోకేష్ ట్వీట్లు
ఇదే విషయమై టిడిపి అధినేత చంద్రబాబు ప్రతిస్పందించారు. వైసిపి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులతో ఆయనను బలితీసుకొని, ఇప్పుడు ఆయన ప్రథమ వర్ధంతి కార్యక్రమాలను కూడా అడ్డుకోవాలనుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నిచేసినా ప్రజల మనస్సులో కోడెల జ్ఞాపకాలను చెరిపేయలేరన్నారు. కోడెల వర్థంతి కార్యక్రమాలని టిడిపి శ్రేణులు జరపాలని పిలుపునిచ్చారు. అలాగే బుధవారం ఉదయం కోడెలను స్మరించుకొంటూ చంద్రబాబు,లోకేష్ ట్వీట్లు చేశారు. డాక్టరుగా పలనాటి ముద్దుబిడ్డ అయ్యారు. రాజకీయ నేతగా పల్నాటి పులి అనిపించుకున్నారు. 36ఏళ్ళ పాటు తెలుగుదేశం పార్టీతో ఉండి ప్రజల కష్టనష్టాలలో అండగా నిలిచిన నేత కోడెల శివప్రసాదరావుగారు. అటువంటి నేత ఈరోజు మనమధ్య లేకపోవడం రాష్ట్ర రాజకీయాలకే తీరనిలోటు అని చంద్రబాబు పేర్కొన్నారు.డాక్టరుగా పేదలకు సేవచేయడంతో పాటు, పల్నాటి రౌడీ రాజకీయాలకు చికిత్సచేసి శాంతిని, అభివృద్ధిని అందించి, ఆరోగ్యకర సమాజానికి బాటలు వేసిన పొలిటికల్ డాక్టర్ కీర్తిశేషులు కోడెల శివప్రసాదరావుగారు. అవినీతిపరుల కక్షలు, కుట్రల కారణంగా ఆయన మనకు దూరమై ఏడాది గడిచింది అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.