Elon Musk – Sam Altman: ఎలాన్ మస్క్ VS శామ్ ఆల్ట్మన్: AI కోసం రూ.8.5 లక్షల కోట్ల ఆఫర్

Elon Musk – Sam Altman: కృత్రిమ మేధ (AI) ప్రపంచంలో ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్మన్ మధ్య వైరం కొత్తది కాదు. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ (OpenAI) తీరుపై మస్క్ గతంలోనే తీవ్ర విమర్శలు చేసినప్పటికీ, ఇప్పుడు అదే సంస్థను కొనుగోలు చేయాలని యత్నించడం టెక్ ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతోంది. మస్క్ తన ఇన్వెస్టర్ గ్రూప్ తరఫున ఓపెన్ ఏఐను 97.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8.5 లక్షల కోట్లు)కి కొనుగోలు చేయాలని అధికారికంగా ప్రతిపాదించారు. ఈ డీల్ పూర్తయితే, ఓపెన్ ఏఐని లాభాపేక్ష గల సంస్థగా మార్చే ఉద్దేశం ఉందని ఆయన న్యాయవాది వెల్లడించారు.

అయితే, ఈ ప్రతిపాదనపై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ఘాటుగా స్పందించారు. మస్క్ ఆఫర్‌ను తేలికగా తీసిపారేస్తూ, దానికి బదులుగా “మీరు కోరుకుంటే మేము ‘ఎక్స్’ (మాజీ ట్విటర్)ను 9.74 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తాం” అంటూ ఆల్ట్మన్ తన ‘ఎక్స్’ ఖాతాలో సెటైర్ వేశారు. దీనిపై మస్క్ కూడా ఘాటుగా స్పందిస్తూ, ఆల్ట్మన్‌ను “మోసగాడు” అంటూ నేరుగా విమర్శలు చేశారు.

2015లో మస్క్ సహకారంతో స్థాపితమైన ఓపెన్ ఏఐ, 2018లో ఆయన సంస్థను వీడిన తర్వాత దారులు మార్చుకుంది. మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులతో ముందుకొచ్చి, 2019 నుంచి 14 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. అయితే, మస్క్ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఓపెన్ ఏఐ అసలు లక్ష్యాలను వదిలి వాణిజ్య ప్రయోజనాల కోసం మైక్రోసాఫ్ట్‌కి వత్తాసు పలుకుతోందని ఆరోపిస్తూ 2023లో కోర్టును ఆశ్రయించారు.

ఇప్పటివరకు మాటల తూటాలు మాత్రమే పేలుతుంటే, ఇప్పుడు మస్క్ తాను నిజంగా ఓపెన్ ఏఐని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? లేదా ఆల్ట్మన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా ఆఫర్ చేశారా? అనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ ప్రతిష్టంభన రానున్న రోజుల్లో టెక్ ఇండస్ట్రీపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

నోటిదూల || Senior Journalist Bharadwaj About Boycott Laila Controversy | Viswaksen | PrudhviRaj | TR