అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్… తాజాగా వెనక్కి తగ్గారు. సోషల్ మీడియా వేదికగా ట్రంప్‌పై తన వ్యాఖ్యలు హద్దులు దాటినట్టు గుర్తించిన మస్క్, వాటిపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. డొనాల్డ్ ట్రంప్ గురించి గత వారం రోజులుగా చేసిన కొన్ని పోస్టులు చాలా దూరం వెళ్లాయి. ఇప్పుడు వాటిపై విచారం వ్యక్తం చేస్తున్నాను.. అని మస్క్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దీంతో ఇద్దరి మధ్య సయోధ్య నెలకొందా లేక.. వ్యాపారపరమైన కారణాలతోనే మస్క్ వెనక్కి తగ్గారా అన్న చర్చ నడుస్తోంది.
గత కొన్ని వారాలుగా ట్రంప్, మస్క్ మధ్య వివాదం తీవ్రమైంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’ పై మస్క్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ బిల్లుతో అమెరికా ఫెడరల్ లోటు పెరిగే అవకాశముందని హెచ్చరించారు. ఎన్నికల్లో తన మద్దతు లేకుండా రిపబ్లికన్లు గెలవలేరని ఘాటుగా వ్యాఖ్యానించారు. మరోవైపు ట్రంప్ కూడా స్పందిస్తూ.. మస్క్ మద్దతు తనకి ఎప్పుడూ అవసరం లేదని వ్యాఖ్యానించారు.
ఈ వివాదం మరింత ముదిరిన సమయంలో.. ట్రంప్ ఎపిస్టీన్ కేసును మస్క్ ప్రస్తావించడమే సంచలనంగా మారింది. జెఫ్రీ ఎపిస్టీన్ కుంభకోణంలో ట్రంప్ పేరు ఉందని ఆరోపించారు. అయితే అందుకు మస్క్ ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో.. తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. తరువాత ఆయన ఆ పోస్టులను డిలీట్ చేశారు.
ఇక మస్క్ పశ్చాత్తాపం వ్యక్తం చేయడం వెనుక వ్యాపారపరమైన అంశాలే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల ట్రంప్ ప్రభుత్వం మస్క్ కంపెనీలపై అనుకూలంగా వ్యవహరించకపోవచ్చన్న ఉద్దేశంతోనే మస్క్ పంథా మార్చారని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, గతంలో ట్రంప్ ఇచ్చిన కీలక పదవికి మస్క్ రాజీనామా చేయడం, తదనంతరం ఆయనపై విమర్శలు చేయడం కూడా ఈ పరిణామాలకు దారితీసింది. ఈ పరిణామాలతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ట్రంప్‌తో మస్క్ కాంప్రమైజ్ అయ్యారా.. లేక ఎక్స్ వేదికగా చేసిన వాఖ్యలు కేవలం రాజకీయ ఒత్తిడిని తప్పించుకోవడానికేనా.. అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.