Heart Stroke: గుండెపోటు వచ్చే నెల ముందు.. శరీరం నుంచి వచ్చే సంకేతాలు ఇవే..!

ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు మానవజాతిని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2019లోనే సుమారు 17.9 మిలియన్ల మంది గుండె సంబంధిత వ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 85 శాతం మంది గుండెపోటు, హార్ట్ స్ట్రోక్‌ల కారణంగా కన్నుమూసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సంఖ్యలు ఎంత భయానకమో తెలుస్తోంది. కానీ మంచి విషయం ఏమిటంటే గుండెపోటు ఒక్కసారిగా రాకుండా, ముందుగానే కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. వాటిని గమనించడం ద్వారా మనం ప్రాణాలను కాపాడుకోవచ్చు.

మొదటిగా ఛాతీ నొప్పి. ఇది గుండెపోటుకు అత్యంత కీలకమైన సంకేతంగా పరిగణిస్తారు. కొన్నిసార్లు ఛాతిపై ఎవరో బరువుగా కూర్చున్నట్టుగా అనిపించవచ్చు. ఆ నొప్పి చేతులు, దవడ, మెడ లేదా వీపువైపు లాగుతూ ఉంటే అది మరింత ప్రమాదకర సూచన. చిన్న నొప్పిగా తీసుకోవడం పొరపాటు. వెంటనే వైద్యులను సంప్రదించాలి.
తరువాత అలసట. రోజువారీ పనులు మెట్లు ఎక్కడం, షాపింగ్ బరువులు మోసుకోవడం, సాదారణ పనులు చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ లేని అలసట అనిపిస్తే అది గుండె సమస్యల సంకేతం కావచ్చు. ముఖ్యంగా మహిళల్లో ఇది సాధారణంగా నిర్లక్ష్యం చేస్తుంటారు. సరైన విశ్రాంతి తీసుకున్నా అలసట తగ్గకపోతే, గుండెపోటు రిస్క్‌గా భావించాలి.

శ్వాస సమస్య కూడా కీలకం. విశ్రాంతి తీసుకునేటప్పుడే శ్వాస సరిగా ఆడకపోవడం గుండెకు సంబంధించిన సమస్య కావచ్చు. రక్తాన్ని పంపించే సామర్థ్యం తగ్గిపోవడంతో ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోవచ్చు. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఇది గుండెపోటుకు కొన్ని వారాల ముందే కనిపించే హెచ్చరికలలో ఒకటి. అదేవిధంగా దడ. సాధారణ నడక తర్వాత కూడా గుండె వేగంగా కొట్టుకోవడం, క్రమరహిత హృదయ స్పందనలు, ఛాతీలో బలమైన దడ అనిపించడం ఇలా అన్నీ గుండెపోటుకు దారితీసే సూచనలుగా వైద్యులు చెబుతున్నారు. దడతో పాటు తల తిరగడం, చెమటలు పట్టడం, ఊపిరి ఆడకపోవడం ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలి.

మరొకటి నిద్రలేమి. రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడం, సడెన్‌గా చెమటలు పట్టడం, గట్టిగా ఊపిరి పీల్చుకోవడం, అలసటతో లేవడం కూడా గుండె సమస్యలకు సంబంధించిన సంకేతాలుగా గుర్తించాలి. చాలా మంది వీటిని నిర్లక్ష్యం చేస్తారు కానీ ఇవి శరీరం ఇస్తున్న ముఖ్యమైన అలర్ట్‌లు. వైద్యులు చెబుతున్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే..ఆరోగ్యం విషయంలో ‘వేచి చూద్దాం’ అనే ఆలోచన వద్దు. మీ శరీరంలో చిన్నగా అనిపించిన అసౌకర్యం కూడా ప్రాణాపాయం కావచ్చు. కాబట్టి ఛాతీ నొప్పి, అలసట, శ్వాస ఇబ్బంది, దడ, నిద్రలేమి వంటి లక్షణాలు గమనించిన వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం అత్యంత అవసరం.

అదనంగా గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకోవాలి. మితంగా ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యపానం దూరంగా ఉంచుకోవడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తపోటు, డయాబెటిస్, కొలెస్ట్రాల్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడం కూడా తప్పనిసరి. గుండె మన శరీరానికి ఇంజిన్. అది ఇచ్చే చిన్న హెచ్చరికలను గమనించకపోతే పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది. కాబట్టి ఆ లక్షణాలను సీరియస్‌గా తీసుకుని, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ద్వారానే ప్రాణాలను రక్షించుకోవచ్చు.