కేసీఆర్‌కు గట్టి షాకిచ్చేందుకు దుబ్బాక ఓటర్లు సిద్ధంగా ఉన్నారా, కారణం అదే!

Dubbaka Voters Are Ready to give shock to KCR

వివిధ కారణాలతో మరో ఆరేడు నెలల పాటు గడువు ఉన్నప్పటికీ ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి 2018 చివరలో ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ 80కి పైగా ఎమ్మెల్యేలను గెలిపించుకొని భారీ విజయం దక్కించుకున్నారు. కానీ ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో సారు.. పదహారు నినాదంతో ముందుకెళ్లిన గులాబీ నేతకు కమలం పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. 2018లో ఒకే ఒక్క అసెంబ్లీ సీటు గెలిచిన బీజేపీ 2019 లోకసభ ఎన్నికల్లో ఏకంగా 4 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది. అంటే 30కి పైగా అసెంబ్లీ స్థానాల్లో కమలం ప్రభావం కనిపించింది. లోకసభ ఎన్నికల నుండి తెరాసకు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వరకు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా కనిపిస్తోంది.

Dubbaka Voters Are Ready to give shock to KCR
Dubbaka Voters Are Ready to give shock to KCR

ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ బీజేపీ నాయకత్వంలో మార్పు, దూకుడు స్వభావమున్న నేతల చేతుల్లో బాధ్యతలు ఉండటం వంటి పలు కారణాలు ఉన్నాయి. అన్నింటి కంటే ముందుగా తెలంగాణలో హిందువులు, హిందూ పండుగల పట్ల కేసీఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆరోపిస్తూ, ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే రాజాసింగ్, దుబ్బాక నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న రఘునందన రావు వంటి నేతలు. సోషల్ మీడియా ద్వారా కూడా ఎక్కడికి అక్కడ స్థానిక కేడర్ జనాల్లోకి తీసుకు వెళ్తోంది. ఓటు బ్యాంకుగా మారిన ఇతర వర్గాలకు ధీటుగా హిందూ ఓటు బ్యాంకును తెలంగాణలో సంఘటితం చేయాలనే ఉద్దేశ్యం ఈ నేతల్లో కనిపిస్తోంది.

అందుకే దుబ్బాకలో బీజేపీకి గెలుపు అవసరం

2023లో తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ.. దుబ్బాక ఉప ఎన్నిక ద్వారా ఓ బలమైన పరీక్షను ఎదుర్కొంటోంది. 4గురు ఎంపీలు బీజేపీ నుండి గెలిచినప్పటికీ ఈ విజయానికి వైరిపార్టీలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఏదో గాలిలో అలా గెలిచారని చెబుతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల విమర్శలు తిప్పికొట్టేందుకు బీజేపీకి దుబ్బాక గెలుపు ఎంతో అవసరం. అయితే ఇక్కడ బీజేపీ గెలుపు ఖాయంగా కనిపిస్తోందని కమలం అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 లోకసభ ఎన్నికల్లో తమ గెలుపు ఆషామాషీ కాదని, కాంగ్రెస్ రేసులో లేదని, 2023లో తెరాసకు తామే ప్రత్యామ్నాయమని చెప్పేందుకు, నాయకత్వ మార్పు ప్రభావం చూపించడానికి ఈ ఎన్నికల్లో గెలుపు అవసరమని అంటున్నారు.

అందుకే కేసీఆర్‌కు షాక్ తప్పదు

Dubbaka Voters Are Ready to give shock to KCR
Dubbaka Voters Are Ready to give shock to KCR

ప్రధానంగా కరోనా విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. విపక్షాలు ఏపీని ఉదాహరణగా చూపిస్తూ కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరుగుతున్నాయి. ఫార్మా హబ్ హైదరాబాద్ ఉన్నప్పటికీ తెలంగాణలో కేసులు అంతకంతకూ పెరగడానికి కారణం కేసీఆర్ పాలనా వైఫల్యమేనని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది తెలంగాణలో కీలకవైఫల్యంగా భావిస్తుంటే, దుబ్బాకలో స్థానిక సమస్యలు తమను గెలిపిస్తాయని బీజేపీ చెబుతోంది. ప్రాజెక్టు కోసం సేకరించిన భూములకు సంబంధించి దుబ్బాక నియోజకవర్గ రైతులకు తక్కువ పరిహారం ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. పక్కనే ఉన్న సిద్దిపేట, గజ్వెల్ నియోజకవర్గం వారికి రూ.30 లక్షల నుండి రూ.50 లక్షలు ఇస్తే, దుబ్బాకకు మాత్రం రూ.15 లక్షల లోపు వచ్చాయని, దీంతో ఇక్కడి వారిలో తీవ్ర అసంతృప్తి ఉందని చెబుతున్నారు.

సానుభూతి కలిసి వస్తుందా?

గత ఎన్నికల్లో ఇక్కడి నుండి గెలిచిన సోలిపేట రామలింగారెడ్డి అకాల మృతి చెందడంతో ఈ ఎన్నికలు వస్తున్నాయి. అధికారంతో పాటు సానుభూతి తెరాస వైపు ఉందని చెబుతున్నారు. కానీ పాలేరు వంటి ఉప ఎన్నికల్లో సానుభూతి పని చేయలేదని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ అదే అంశం మాట్లాడాలనుకుంటే రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన రఘునందన రావు బీజేపీ తరఫున బరిలో ఉంటే ఆయనకు కూడా వర్తిస్తుందని లాజిక్ లాగుతున్నారు. సానుభూతి అంశానికి కాలం చెల్లిందని, ప్రజలు చైతన్యవంతులు అయ్యారని, కరోనా ఫెయిల్యూర్, దుబ్బాక ప్రజలకు ఇన్నాళ్లు పింఛన్లు ఇవ్వకుండా ఇప్పుడు హడావుడిగా ఇవ్వడం, భూపరిహారం వంటి అంశాలతో పాటు రఘునందన రావు బరిలో ఉంటే బీజేపీ సునాయాసంగా గెలుస్తుందని కమలం నేతలు భావిస్తున్నారు. బీజేపీ బలానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం కలిసి వస్తుందంటున్నారు.