Donald Trump: అమెరికా vs చైనా.. ఆ కాలువ కోసం ట్రంప్ హెచ్చరికలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. పనామా కాలువపై చైనా పెత్తనం పెరిగిపోతుందన్న కారణంతో, అమెరికా దీన్ని తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశముందని పేర్కొన్నారు. గతంలో కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో పనామా కాలువను తిరిగి తీసుకునే విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలను మరింత బలపరుస్తూ, త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని హెచ్చరించారు.

అయితే, దీని కోసం బలగాలను ఉపయోగించాల్సిన అవసరం లేకపోవచ్చని, చర్చల ద్వారానే పరిష్కారం కనిపెట్టగలమని అన్నారు. పనామా కాలువ వాణిజ్య నౌకా రాకపోకలకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకమైన మార్గం. 1914లో అమెరికా దీనిని నిర్మించి, దశాబ్దాల పాటు నిర్వహించింది. 1999లో పనామా దేశానికి ఈ కాలువను అప్పగించినప్పటి నుంచి అక్కడ చైనా జోక్యం పెరుగుతోందని అమెరికా ఆరోపిస్తోంది.

ముఖ్యంగా, అమెరికా నౌకల నుంచి అధిక రుసుములు వసూలు చేయడం, చైనా వ్యాపార ప్రయోజనాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వెనుక చైనా హస్తం ఉందని ట్రంప్ ఆరోపించారు. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పనామా ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురి చేశాయి. ఈ వివాదంపై స్పందించిన పనామా ప్రెసిడెంట్ జోస్ రౌల్ ములినో, తమ దేశం అమెరికా ఒప్పందాలను గౌరవిస్తుందని, అయితే అమెరికా దురాక్రమణకు తాము భయపడబోమని స్పష్టం చేశారు.

అవసరమైతే చర్చలకు సిద్ధంగా ఉన్నామని, కానీ కాలువపై తమ హక్కును అగ్రరాజ్యం ప్రశ్నించలేదని తేల్చిచెప్పారు.. ఈ పరిణామాల నేపథ్యంలో, అమెరికా పనామా కాలువను స్వాధీనం చేసుకునే చర్యలు చేపడుతుందా లేక కేవలం రాజకీయ ఒత్తిడికి మాత్రమే పరిమితం అవుతుందా.. అనే ప్రశ్నలు మారుమోగుతున్నాయి. చైనా జోక్యాన్ని అడ్డుకోవడం కోసం అమెరికా ఏదైనా దౌత్యపరమైన చర్యలు తీసుకుంటుందా? అన్నది చూడాల్సి ఉంది.

పుష్ప రేట్లు || Prof. Kancha Ilaiah Shocking Comments On Pushpa2 Movie || Allu Arjun || TeluguRajyam