అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సైన్యంలో ట్రాన్స్‌జెండర్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉన్న విధానం ప్రకారం, కొన్ని నియమిత ప్రమాణాలను పాటిస్తూ ట్రాన్స్‌జెండర్లకు సైన్యంలో చోటు ఇచ్చేవారు. కానీ, ట్రంప్ తాజా నిర్ణయంతో ఈ అవకాశాన్ని పూర్తిగా రద్దు చేశారు.
ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని అమెరికా ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం సైన్యంలో ఉన్న ట్రాన్స్‌జెండర్ సైనికులు మాత్రం తమ పూర్తి సేవా కాలం ముగిసే వరకు విధులు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. అయితే, కొత్తగా చేరదలచిన ట్రాన్స్‌జెండర్లకు ఇక అవకాశం ఉండదని, లింగ మార్పిడి ఆపరేషన్లు పొందినవారు సైన్యంలో సేవలు అందించలేరని స్పష్టం చేశారు.
ఇదే విషయాన్ని ప్రభుత్వ పథకాలకూ విస్తరించిన ట్రంప్, అధికారిక దరఖాస్తులలో లింగ విభజనలో మగ, ఆడ మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. థర్డ్ జెండర్ కోసం ఎలాంటి ప్రత్యేక గుర్తింపు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. అంతేకాదు, మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లను నిషేధిస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు.
ట్రంప్ నిర్ణయంపై భిన్నమైన స్పందన వ్యక్తమవుతోంది. ట్రాన్స్‌జెండర్ హక్కుల సంఘాలు దీన్ని తీవ్రంగా తప్పుబడుతున్నప్పటికీ, కొన్ని వర్గాలు మాత్రం ట్రంప్ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నాయి. ఈ నిబంధనలు భవిష్యత్తులో మరిన్ని చర్చలకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.