Donald Trump: ట్రంప్ ఉక్కుపాదం.. 50 లక్షల భారతీయ వీసాలపై వేటుకు రంగం సిద్ధం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ వలసదారులకు, విదేశీ పౌరులకు మరో భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కఠినమైన వలస విధానాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ట్రంప్ యంత్రాంగం, తాజాగా ప్రపంచవ్యాప్తంగా జారీ చేసిన 5.5 కోట్ల (55 మిలియన్ల) వీసాలను సమీక్షించాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం భారతీయ పౌరులపై తీవ్ర ప్రభావం చూపనుంది, ఎందుకంటే ఇందులో సుమారు 50 లక్షల (5 మిలియన్ల) వీసాలు భారతీయులకు జారీ చేసినవే ఉన్నాయి. అమెరికా జాతీయ భద్రత, ప్రజా శ్రేయస్సును కాపాడటంలో భాగంగానే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సమీక్షలో భాగంగా వీసాదారుల పూర్తి నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.

ఎవరెవరిపై ప్రభావం?
ఈ సమీక్ష పరిధిలోకి పర్యాటకులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారవేత్తలు సహా దాదాపు అన్ని రకాల వీసా హోల్డర్లు వస్తారు. వీరిలో ఎవరైనా వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

పరిశీలించే ప్రధాన అంశాలు:
వీసా పొందేందుకు వారు నిజంగా అర్హులేనా?
వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలోనే అక్రమంగా నివసిస్తున్నారా?
వారికి ఏమైనా నేర చరిత్ర ఉందా?
తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా?
వారి వల్ల అమెరికా పౌరులకు ఏదైనా ముప్పు ఉందా?

తనిఖీలు ఎలా ఉంటాయి?
ఈ తనిఖీల కోసం అధికారులు వీసాదారుల సోషల్ మీడియా ఖాతాలు, బ్యాంకు లావాదేవీలు, ఇమ్మిగ్రేషన్ రికార్డులను కూడా పరిశీలించనున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం వీసా ఇంటర్వ్యూ సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల తనిఖీకి సహకరించారా లేదా అనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సమీక్షలో చిన్న పొరపాటు దొరికినా, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలినా తక్షణమే వారి వీసాలను రద్దు చేసి, దేశం నుంచి బహిష్కరించడం ఖాయమని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల్లో ఆందోళన నెలకొంది.

జగన్ బాంబు || CA Nagarjuna Reddy About YS Jagan Shocking Decision On Vice President Election || TR