పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన తాజా అంచనాలు 55 వేల కోట్లని వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతోంది. ఈ లెక్కల్ని చంద్రబాబు హయాంలోనే వేశారు. అంటే, ఇప్పుడు ఆ మొత్తం ఇంకాస్త పెరిగే అవకాశం వుంది తప్ప, తగ్గే అవకాశమే లేదు. అయితే, రివర్స్ టెండరింగ్ ద్వారా ఖర్చు తగ్గించేశామని చెబుతున్న వైఎస్ జగన్ సర్కార్, చంద్రబాబు ప్రతిపాదించిన 55 వేల కోట్ల అంచనాల్ని ఆమోదించాలని కేంద్రానికి విన్నవించుకోవడమే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమువోతంది. ‘అంటే, మీరు చంద్రబాబు హయాంలో తప్పులు జరగడంలేదని ఒప్పుకుంటున్నట్లే కదా.?’ అంటూ ఏపీ మాజీ చీఫ్ సెక్రెటరీ ఐవైఆర్ కృష్ణారావు సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
కేంద్రం, వైఎస్ జగన్‌కి తీపి కబురు చెప్పేనా!
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కోరుతున్న స్థాయిలో పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించే పరిస్థితి లేదు. కానీ, జాతీయ ప్రాజెక్టు గనుక.. ఆ స్థాయిలోనే నిధులు కేంద్రం ఇవ్వాలన్నది వైఎస్ జగన్ సర్కార్ ‘విజ్ఞప్తి’. ఈ పంచాయితీ తెగేదెలా.? ‘కేంద్రం నుంచి తీపి కబురు వస్తుందని ఆశిస్తున్నాం..’ అని ఇప్పటికే పలువురు మంత్రులు సెలవిచ్చారు. కానీ, అందులో సగం కూడా ఇచ్చే అవకాశం లేదని ఇప్పటికే కేంద్రం తేల్చి చెప్పేసింది.
నిధుల సమస్య కాదు.. ‘ఘనత’ సమస్య.!
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అధికారికంగా మొదలైంది. అంతకన్నా ముందే బ్రిటిష్ హయాంలో పోలవరం ప్రాజెక్టు గురించిన ఆలోచన జరిగింది. అయితే, పనులు జోరందుకున్నది మాత్రం చంద్రబాబు హయాంలోనే. ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో ఆ పనులు మరింత వేగంగా జరుగుతున్నాయన్నది వైసీపీ ప్రభుత్వం చెబుతున్న మాట. ఎవరి వాదనలు ఎలా వున్నా, ఈ ఘనత ఎవరిది.? అన్న చోటనే ప్రాజెక్టు అయోమయంలో పడేలా వుంది.
వైఎస్ విగ్రహం పెడితే.. కేంద్రం ఒప్పుకుంటుందా.?
100 అడుగులు వైఎస్సార్ విగ్రహాన్ని పోలవరం దగ్గర ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ సర్కార్ చెబుతోంది. కేంద్రం నిధులతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ దగ్గర.. వైఎస్సార్ విగ్రహం అంటే, మోడీ సర్కార్ ఒప్పుకుంటుందా.? అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. అసలు ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేయాల్సింది కూడా ప్రధాన మంత్రే.! అలాంటప్పుడు, ఆ ప్రాజెక్ట్ దగ్గర వైఎస్సార్ విగ్రహం అనేది వైసీపీ అత్యుత్సాహం తప్ప.. బీజేపీ మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకపోవచ్చన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.