(యనమల నాగిరెడ్డి)
రాజకీయాలలో అవకాశవాదం ప్రస్తుతం నడుస్తున్న పొలిటికల్ ట్రెండ్. అందులో భాగంగా ప్రతి నాయకుడు కూడా అందలం ఎక్కడానికి ఎక్కడ తనకు ఎక్కువ అవకాశం ఉంటుందో ఆ పార్టీని ఎంచుకోవడం ఆనవాయితీ. అవకాశాలు ఎక్కడ ఎక్కువ ఉంటాయన్న అంచనాలపై అనుచరుల మధ్య, కుటుంభసభ్యుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడటం, అవి పెరిగి పెద్దవైతే ఎవరి దారి వారు చూసుకోవడం ఆనవాయితీ.
ప్రస్తుతం కడప జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబంగా గుర్తింపు పొందిన కందుల ఓబుళరెడ్డి కుటుంబంలో ఈ పార్టీలో చేరాలన్న అంశంపై విభేదాలు పుట్టాయని తెలుస్తున్నది. కందుల సోదరులుగా గుర్తింపు పొందిన శివానంద రెడ్డి, రాజమోహన్ రెడ్డి కుటుంబీకులు “ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏ పార్టీలో చేరాలన్న అంశంపై” విభేదిస్తున్నారని వారి సన్నిహితులు తెలిపారు. అందుతున్న సమాచారం మేరకు వివరాలిలాఉన్నాయి.
కందుల కుటుంబంలో పెద్దవాడైన శివానందరెడ్డి గతంలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా శాసనభ్యుడిగా గెలిచారు. ఆయన సోదరుడు కందుల రాజమోహన్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా కడప పార్లమెంట్ స్థానానికి 1996లో వై. ఎస్. రాజశేఖర రెడ్డి పై పోటీ చేసి అతి తక్కువ తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినా , గత కొన్ని సంవత్సరాలుగా సోదరులు ఇరువురూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
కాగా రాజమోహన్ రెడ్డి ఇటీవల బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొంటూ రాజకీయ, వ్యాపార అవకాశాలను అంది పుచ్చుకుంటున్నారు.
త్వరలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏ పార్టీలో చేరాలన్న అంశంపై వారి కుటుంబంలో తీవ్రస్థాయిలో చర్చలు సాగాయని, శివానందరెడ్డి టీడీపీ వైపు మొగ్గు చూపుతుండగా రాజమోహనరెడ్డి బీజేపీలో కొనసాగాలని, అలాకాని పక్షంలో వైస్సార్ కాంగ్రెస్ కు వెళ్లాలని భావిస్తున్నారని ఆ కుటుంబ సన్నిహితులు తెలియచేసారు. రాజమోహనరెడ్డి కుమారులు మాత్రం టీడీపీ, బీజేపీ లను వద్దని వైస్సార్ కాంగ్రెస్ లో చేరాలని గట్టిగా పట్టు పడుతున్నారని ఆ వర్గాలు తెలిపాయి.
టీడీపీనే మేలు
కడప శాసనసభ స్థానంలో వైసీపీని ఢీ కొట్టగల అభ్యర్థి లేడని, అందువల్ల టీడీపీలో చేరితే తమకు పార్టీ టికెట్ లభించడంతో పాటు, ప్రభుత్వ అండదండలు ఉంటాయని, పార్టీలో ప్రస్తుతం ఉన్న నాయకులు, నియోజకవర్గ వ్యాప్తంగా తమకున్న పూర్వ అనుచరుల అండదండలు, తమ ఆర్థిక బలం తో ఎన్నికలలో గట్టెక్కగలమని శివానంద రెడ్డి భావిస్తున్నారట. అలాగే వైసీపీలో ప్రస్తుతం మైనారిటీకి చెందిన వ్యక్తి ఎంఎల్ఏ గా ఉన్నారని, సిట్టింగ్ ఎంఎల్ఏ ని కాదని తమకు ఆ పార్టీలో టికెట్ దొరకదని, అందువల్ల వైసీపీలో చేరడం ఉపయోగముండదని ఆయన అభిప్రాయపడుతున్నారు. అలాగే రాష్ట్రంలో బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నదని, ఆ పార్టీలో కొనసాగడం వల్ల తమకు ప్రయోజనం ఉండదని శివానంద రెడ్డి బలంగా అభిప్రాయపడుతున్నారని కుటుంబ సన్నిహిత వర్గాలు తెలియచేశాయి.
బీజేపీనా? — వైసీపీనా?
బీజేపీకి రాష్ట్రంలో గడ్డు స్తితి ఉన్నా కేంద్రంలో తప్పకుండా అధికారం నిలుపు కుంటుందని, అందువల్ల బీజేపీలో కొనసాగడమే మేలని, అలాకాక పోతే రాష్ట్రంలో టీడీపీ అధికారం నిలుపుకోవడం దాదాపు అసాధ్యమని, అందువల్ల వైసీపీలో చేరడమే మంచిదని రాజమోహనరెడ్డి అభిప్రాయపడుతున్నారని ఆ వర్గాలు తెలిపాయి.
కాగా ఆయన కుమారులు మాత్రం వైసీపీలో చేరి, పార్టీకి భారీగా నిధులు సమకూర్చిపార్టీ టికెట్ పొందటమే మేలని, తద్వారా పదవి, అధికారం పొందవచ్చునని వాదిస్తున్నారని తెలుస్తున్నది.
ఏ పార్టీలో చేరాలన్న అంశంపై కందుల సోదరులు, వారి కుటుంభం సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలు సమసిపోయి అందరు సమిష్టి నిర్ణయం తీసుకుంటారా? లేక వారి మధ్య ఉన్న రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరి కుటుంబంలో తుఫాన్ గా మారుతుందా? త్వరలో తేలుతుంది.