మాజీ మంత్రి డీఎల్ రవీంద్రరెడ్డి రాజకీయాలు అంత వేగంగా ముందుకు సాగడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత తెరమరుగయన రాజకీయ నాయకుల్లో డిఎల్ ఒకరు. ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి లాగే డిఎల్ కూడా తెరమరుగయ్యారు. ఇపుడు ఇద్దరు రాజకీయ పున: ప్రవేశానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మధ్య కిరణ్ కు మార్ రెడ్డి మెరుపులాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో ప్రత్యక్షమయ్యారు. మెరుపు లాగే మాయమయ్యారు. అయితే, డిఎల్ రవీంద్రరెడ్డి మాత్రం ఆచి తూచి అడుగేస్తున్నారు. అందుకే ఆలస్యం.
ఇపుడాయన టిడిపి లో చేరయడం ఖాయమంటున్నారు. వైసిపిలో రెండు కారణాలతో చేరడం లేదు. ఒకటి. కాస్ట్లీ వ్యవహారం, జగన్ భారీగా ప్రవేశం రుసుం వసూలు చేస్తాడని చెబుతున్నారు. రెండు, అక్కడంత గుర్తింపు కూడా ఉండకపోవచ్చు. దీనికి భిన్నంగా టిడిపి రెడ్లకు పెద్ద పీట వేస్తున్నందున ఈ పార్టీలో గుర్తింపు ఉంటుందని ఆయన భావిస్తున్నారు.
దీనికి తోడు టిడిపి తరఫున పోటీ చేస్తే ఖర్చు మీద పెద్దగా పడదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత భరిస్తారు. అందువల్ల ఆయన టిడిపి యోగ్యమయినదిగా భావిస్తున్నారు. అందుకే తెదేపాలో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ నెల 10వ తేదీన అనుచరులతో సమావేశం నిర్వహించి నిర్ణయం ప్రకటించ బోతున్నారుని తెలిసింది.
అయితే, మరి మైదుకూరు అసెంబ్లీ టికెట్ లభిస్తుందా? ఆయన టిడిపిలో చేరేదే ఈ సీటు కోసం. మరి అది సాధ్యమా? ఎందుకంటే ఈ సీటు కోసం ఆయనకు మాంచి పోటీ ఉంది. తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ ఆయనకు ఇక్కడ పోటీ. సీటు తనదే నని పుట్టా అంటున్నారు. దీనికి తోడు ఆయన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి వియ్యంకుడు కూడా. డిఎల్ , పుట్టా మధ్య పోటీతో కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ రాజకీయాలు రంజుగా మారాయి.
డిఎల్ విభజన తర్వాత వీకయ్యారు గాని, ఆయనను అంతగా తీసేయడానికి వీల్లేదు. ఆరుసార్లు శాసనసభ్యుడిగా గెలుపొంది పలుమార్లు మంత్రిగా పనిచేసిన డీఎల్ రవీంద్రారెడ్డి ఇప్పుడు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారంటే మారిన పరిస్థితులే కారణం.
2014 నుంచి రాజకీయాలకు కొంతదూరంగా ఉంటున్న డిఎల్ ఈ సారి ఎన్నికల బరిలో నిలవాలని పట్టుదలతో ఉన్నారు. దీనికి తెలుగుదేశం, వైకాపాల్లో ఏదో ఒక పార్టీలో చే రాలి. బిజెపి లాభం లేదు. జనవరి 12న ఇడుపులపాయలో వైకాపా అధ్యక్షుడు జగన్‌ను డీఎల్ అనుచరులు కొందరు కలసి తమ నేతకు సీటు ఇవ్వాలని అడిగారని, ఎమ్మెల్యే కాదు గాని, ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ అన్నారని ఒక వార్త ప్రచారంలో ఉంది. దీనిని జగన్ అయిష్టంగా భావించిన డీఎల్ ఆ వెంటనే తెలుగుదేశం నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చర్చలు జరిపారని చెబుతున్నారు మైదుకూరులో.
ఎలాగయినా సరే కడప ను కైవసం చేసుకోవాలనుకుంటున్న చంద్రబాబుకు బలమయిన ఒక రెడ్డి నాయకుడు తన దగ్గరకు రావడం శుభసూచకంగా కనిపించింది. వెంటనే గ్రీన్ సిగ్నిల్ ఇచ్చారు. దీనితో ఈ నెల 10న అనుచరులతో డిఎల్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అదేరోజు డీఎల్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే వీలుంది.
డిఎల్ హడావిడితో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ ఇరుకున పడ్డారు. జిల్లాలో నియోజకవర్గాలన్నీ రెడ్ల డామినేషన్ తో ఉంటాయి. ఇలాంటపుడు పుట్టా మైదుకూరు యాదవులది, బిసిలదని భావిస్తున్నారు. అయితే, ఇపుడు డిఎల్ పేరు వినిపించడం అది కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ గా వినిపించడం పుట్టాకు ఇబ్బంది కలిగిస్తున్నది.
వెంటనే ఆయన డిఎల్ వ్యతిరేక రెడ్ల సపోర్టు తీసుకున్నారు. జిల్లా మంత్రిఆదినారాయణరెడ్డి మద్దతు కూడగట్టారు. ఈనెల 1న మైదుకూరు వచ్చిన మంత్రి ఒక ప్రకటన చేస్తూ తెలుగుదేశం అభ్యర్థిగా పుట్టానే బరిలో ఉంటారని ప్రకటించారు. అప్పటి నుంచి పుట్టా మరింత ఉత్సాహంగా ఉన్నారు. డీఎల్ వచ్చినా తన సీటుకు ఇబ్బంది ఉండదని నమ్ముతున్నారు.
అయితే,బాస్ మదిలో ఏముందో…
అయితే, బాస్ చంద్రబాబు ఏమనుకుంటున్నారో ఎవరికీ తెలియదు. చంద్రబాబు హామీ మేరకే ఆయన టిడిపిలో చేరుతున్నారని, ఆయన మైదుకూరు అసెంబ్లీ టికెట్ గ్యారంటీ అని డిఎస్ వర్గీయులు అంటున్నారు. టికెట్ ఇస్తామన్న హామీ రావడంవల్లే తెదేపాలో చేరేందుకు డీఎల్ సిద్ధపడ్డారని వారంటున్నారు.
మరి పుట్టా పరిస్థితి ఏమిటి? టిటిడి ఛెయిర్మన్ పదవి వచ్చిందంటేనే బాబు మీద పుట్టా పట్టు ఏమిటో వూహించవచ్చు. దానికి తోడు ఆయన ఆర్థిక మంత్రి యనమలకు వియ్యంకుడు. అందువల్ల పుట్టాను కాదని మైదుకూరు టికెట్ డిఎల్ కు రాదని ఆయన వర్గీయులంటున్నారు.
కడప జిల్లాను జగన్నుంచి లాక్కునేందుకు చంద్రబాబు అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవూహానికి ఒక బలయమయిన రెడ్డి అవసరం. అందువల్ల పేరున్న రెడ్లనందరిని ఆయన టిడిపిలోకి లాక్కోవాలనుకుంటున్నారు. అందువల్ల టిటిడి ఛెయిర్మన్ పదవి లో ఉన్న పుట్టాకు నచ్చచెప్పి డీఎల్‌కు సీటు కేటాయిస్తారని బలంగా వినబడుతూ ఉంది. డిఎల్ కు ఏదో హామీ ఇచ్చి పార్టీ కి ఆర్థికంగా అండగా ఉన్న పుట్టాకు మైదుకూర్ ను అప్పగిస్తారా? తెలుగు దేశం అంటేనే సస్పెన్స్. ఇదెంతవరకు నడుస్తుందో చూడాలి.