(యనమల నాగిరెడ్డి)
త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలలో అమితుమీ తేల్చుకోడానికి సిద్ధపడుతున్న టీడీపీ వైసీపీ లకు కీలకమైన కడప జిల్లాలో వైస్సార్ కాంగ్రెస్ తన సైన్యాధిపతులతో ఎన్నికల రణానికి సంసిద్ధంగా ఉండగా పాలక టీడీపీ మాత్రం సరైన అభ్యర్థుల కోసం వెంపర్లాడుతున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రమంతా ఒక ఎత్తుగానూ, ప్రత్యేకించి వైసీపీ అధినేత జగన్ స్వంత జిల్లా ఒక ఎత్తుగాను చూస్తున్నారు. ఎలాగైనా సరే కడపలో పాగా వేసి జగన్ బలం తగ్గించాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే (హక్కులేని) కృష్ణా నది నీటిని ఆగమేఘాల మీద గండికోటకు తెచ్చి, అక్కడ నుండి పులివెందులకు తరలించారు. అలాగే రాష్ట్రం ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని పటాటోపంగా శంఖుస్థాపన కూడా చేశారు. ఇన్ని చేసినా ఆయనకు జిల్లాలో వైసీపీని ధీటుగా ఎదుర్కోవడానికి సరైన అభ్యర్థులు దొరకడం లేదు.
ఎన్నికల రణంలో జగన్ సైన్యాధిపతులు వీరే!
వైస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్ని నియోజకవర్గాల నుండి పోటీలో దించడానికి తన సైన్యాధిపతులను ఎంపిక చేసి కడప జిల్లాలో ఎన్నికల రణానికి సాయి అంటున్నారు. కడప పార్లమెంట్ స్థానానికి మాజీ ఎంపీ, జగన్ సోదరుడు వై ఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ స్తానానికి జగన్ సన్నిహితుడు,మాజీ ఎంపీ పివి మిథున్దు రెడ్డి పోటీలో ఉంటారు. వీరిరువురికి ఈ ఎన్నికలు నల్లేరు మీద నడక గానే ఉంటాయి.
వైసీపీ నుండి ఒక్క జమ్ములమడుగు స్థానం మినహా అన్ని శాసనసభ స్థానాలలో అభ్యర్థులు దాదాపు ఖారారై నట్లే. పులివెందుల స్థానం నుంచి వై ఎస్ జగన్ స్వయంగా పోటీ చేయనున్నారు. కమలాపురం నుండి జగన్ మేనమామ రవీంద్రనాథ్రెడ్డి, కడప నుండి అంజాద్ బాషా, ప్రొద్దటూరు నుండి రాచమల్లు, మైదుకూరు నుండి రఘురామిరెడ్డి, కోడూరు నుండి కొరముట్ల శ్రీనివాసులు, రాయచోటి నుండి శ్రీకాంత్ రెడ్డి రంగంలో ఉంటారు. వీరంతా ప్రస్తుత శాసనసభ్యులు. ఇకపోతే రాజంపేట నుండి మాజీ ఎంఎల్ ఏ అమరనాథ రెడ్డి, బద్వేల్ నుండి వెంకటసుబ్బయ్య పేర్లు ఖాయమే నని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇకపోతే ప్రతిష్టాత్మకమైన జమ్ములమడుగు స్థానానికి ప్రస్తుత నియోజకవర్గ భాద్యుడు సుధీర్ రెడ్డి రంగంలో ఉంటారని పార్టీ వర్గాలు అంటున్నా, ఈ నియోజకవర్గం అభ్యర్థి ఎంపిక ఆఖరు క్షణంలో జరగడానికి అవకాశం ఉంది. అనుకోని ఊహకందని అవాంతరాలు ఎదురైతే తప్ప ఈ అభ్యర్థులలో మార్పు ఉండదని చెప్పవచ్చు .
టీడీపీ దళపతుల ఎంపికలో ఎడతెగని గందరగోళం
ప్రస్తుతానికి మాత్రం వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే ధీటైన దళపతుల ఎంపిక కోసం టీడీపీ అధినాయకత్వం మల్లగుల్లాలు పడుతున్నది. కడప పార్లమెంటే స్థానం నుండి పోటీకి ఎవరు ముందుకు రావడం లేదు. “పార్టీని గత నాలు దశాబ్దాలుగా నమ్ముకొని ఉన్నజమ్ములమడుగు టీడీపీ నాయకుడు రామసుబ్బారెడ్డిని ఒప్పించి వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి సమున్నత స్థానం కల్పించామని అందువల్ల జమ్ములమడుగు ఎంఎల్ ఏ స్థానాన్ని రామసుబ్బారెడీకి వదలి, పార్టీ కోసం కడప ఎంపీకి పోటీ చేయాలని” మంత్రి ఆదినారాయణ రెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు వత్తిడి చేస్తున్నారు. కానీ ఆదినారాయణ రెడ్డి ఎంఎల్ఏ కి పోటీ చేసి మరో సారి మంత్రి కావాలని కోరుకుంటున్నారు. అయితే టీడీపీ పాతకాపు రామసుబ్బారెడ్డి మాత్రం జమ్మలమడుగు ఎంఎల్ఏ స్థానానికే పోటీ చేస్తానని గట్టిగా పట్టుపడుతున్నారు. అందువల్ల జమ్ములమడుగు ఎంఎల్ఏ పంచాయతీ తెగితే తప్పా కడప ఎంపీ పోటీ పంచాయతీ తెగదు.
వైసీపీ అధినేత జగన్ పై పోటీకిశాసన మండలి మాజీ డిప్యూటీ స్పీకర్ సతీశ్ రెడ్డి(సింగారెడ్డి వెంకట సతీష్ కుమార్ రెడ్డి) ఎంపిక జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఆదినారాయణ రెడ్డి పార్టీలో చేరిన తర్వాత చంద్రబాబు తనను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని సతీశ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తున్నది. పులివెందులలో ఎంఎల్.సి రవి ఉన్నా సీఎం సతీష్ వైపు మొగ్గు చూపుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
కడప నియోజకవర్గం నుండి 10 మంది ఆశావహులు రంగంలో ఉన్నా ధీటైన వ్యక్తి దొరకడం లేదు. కందుల కుటుంబీకులు ఎవరైనా వస్తే వారికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఈ సీటు ఖాలీనే. ఇక వర్గ పోరాటాలతో కునారిల్లుతున్న ప్రొద్దటూరులో వరదరాజులు రెడ్డి, లింగారెడ్డి టికెట్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సోదరుడు కూడా రంగంలో ఉన్నారట.
మైదుకూరులో ప్రస్తుతానికి టిటిడి చైర్మన్, ఆర్థికమంత్రి రామకృష్ణుడి వియ్యంకుడు పుట్టా సుధాకర యాదవ్ రంగంలో ఉన్నారు. డిఎల్ రవీంద్ర రెడ్డి ఎదో ఒక పార్టీ టికెట్ పై పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయనా రంగంలో ఉన్నట్లే. రాయచోటినియోజకవర్గంలో పార్టీ ఇంచార్జ్ రమేష్ రెడ్డి, పార్టీ పాతకాపు పాలకొండ్రాయుడు కుమారుడు ప్రసాదబాబు టికెట్ కు పోటీ పడుతుండగా, మాజీ ఎంఎల్ ఏ ద్వారకనాధరెడ్డి తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రాజంపేట నుండి టీడీపీ తరపున గెలిచిన ఏకైక ఎంఎల్ ఏ మేడా మల్లికార్జున రెడ్డి రంగంలో ఉన్నా, ఆయన కుటుంబంలోనూ, పార్టీలోను ఉన్న విభేదాలు టీడీపీ అభ్యర్థి ఎంపిక విషయంలో సందిగ్దత నెలకొన్నది. కాగా కమాలాపురంలో పుత్తా నరసింహారెడ్డి ముందు వరుసలో ఉన్నా, మాజీ ఎంఎల్ఏ వీరశివారెడ్డి నుండి ఆయనకు గట్టిపోటీ ఎదురౌతున్నది.
ఇకపోతే రిజర్వదు నియోజకవర్గాలైన బద్వేల్, కోడూరులలో బడానాయకుల కరుణ ఎవరిపై ఉంటుందో తెలియడంలేదు. బద్వేల్ లో మాజీ ఎంఎల్ ఏ విజయమ్మ, గత ఎన్నికలలో ఓడిపోయిన జ్యోతి, పార్టీ మారి టీడీపీ లో చేరిన జయరాములు వర్గాల మధ్య పోటీ రసవత్తరంగా ఉంది. అలాగే కోడూరులో ఎమ్మెల్సీచెంగల్రాయలు, కట్టా బాలాజీ, జిఎన్ నాయుడు,మరికొంత మంది ఘనాపాఠీల మధ్య ఆధిపత్యపోరు సాగుతున్నది.
ఇక రాజంపేట ఎంపీ నియిజకవర్గం నుండి పోటీ చేయడానికి కనుచూపు మేరలో సరైన టీడీపీ నాయకుడు కనిపించడం లేదు.
జిల్లా టీడీపీ పార్టీలో ఉన్న వర్గాలు, ఆధిపత్య పోరు, టికెట్ ల కోసం పోటీ ఇవన్నీ కలసి ప్రస్తుతానికి టీడీపీ అభ్యర్థుల ఎంపిక అయోమయంలో ఉన్నది. ఎన్నికల ఎత్తులకు, జిత్తులకు పేరు పొందిన చంద్రబాబు కడప ఎన్నికలలో ఏమి మాయాజాలం ప్రదర్శిస్తాడో? పార్టీలో ఉన్న వర్గ పోరుకు ఎలా పాతర వేసి జగన్ కు జిల్లాలో ఎలా చెక్ పెడతాడో? వేచి చూడాల్సిందే