మంత్రి ఆది కుటుంబంలో జంట హత్యల కేసు ప్రకంపనలు?

(యనమల నాగిరెడ్డి)

కుటుంబ విభేదాలా? మంత్రి ఎత్తుగడా? రామసుబ్బా రెడ్డి వర్గీయుల అనుమానం. 

రాజకీయ ఆధిపత్యం కోసం కడప జిల్లా జమ్ములమడుగులో జరిగిన  వర్గపోరాటం అంత్యదశకు చేరుకున్నట్లు కనిపిస్తున్నది. అయితే ఇందులో భాగంగా మంత్రి ఆదినారాయణరెడ్డి తన రాజకీయ అస్తిత్వం నిలబెట్టుకోడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నరు. దీని కోసం వైరి వర్గాలను దగ్గరకు  చేర్చడమనేది ఆయన ప్రధాన వ్యూహం. అయితే, ఈ ప్రయత్నాలు వికటించి  కుటుంబ కలహానికి దారి తీసే ప్రమాదం ఉందని మంత్రి సన్నిహిత వర్గాలు వాపోతున్నాయి. కాని,  కుటుంబ కలహం అనేది  మంత్రి రాజకీయ ఎత్తుగడల్లో భాగమని,  అది నిజమైన  కలహం కాదని   ప్రత్యర్థి రామసుబ్బారెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. వీటిలో ఏది నిజమో కాలమే నిర్ణయించాలి.   

  
గుండ్లకుంట, దేవగుడి వర్గాల పోట్లాటలో భాగంగా 1990లో జరిగిన షాద్ నగర్ జంట హత్యల కేసు ప్రస్తుతం జమ్ములమడుగు శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డి కుటుంబంలో కల్లోలం సృష్టిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రి  ఆదినారాయణ రెడ్డి ఈ కేసులో ప్రత్యర్థులకు శిక్షలు వేయించడానికి గతంలోలక్షలాది రూపాయలను ఖర్చు చేసి తీవ్రంగా కృషి చేసారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు, తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా  (కుటుంబ సభ్యులను సంప్రదించకుండానే) ఈ కేసులో రాజీ కావాలని నిర్ణయించారని తెలుస్తున్నది.  ఆదినారాయణ రెడ్డి ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం  మంత్రి కుటుంబంలో విభేదాలు సృష్టిస్తున్నాయని వారి సన్నిహిత వర్గాలు వివరిస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా మంత్రి  సూచనల మేరకు వీరి న్యాయవాది బసంత్ “ సంఘటన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తన క్లయింట్, ఈ కేసులో ప్రత్యర్థులపై విచారణ అవసరం లేదని పేర్కొంటున్నట్లు ” సెప్టెంబర్ 25న కేసు విచారణ సందర్భంగా  సుప్రీం కోర్టుకు వివరించారు. ఫిర్యాది అలా చెప్పినా “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పీల్ అలాగే ఉన్నందున” తాము ఈ కేసులో ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోడం లేదని, అక్టోబర్ 24న పూర్తిస్తాయి విచారణ చేస్తామని సుప్రీం కోర్టు తన ఉత్తర్వులలో పేర్కొంది.  

అయితే  ఈ కేసులో ఫిర్యాది, మంత్రి సోదరుడు అయిన శివనారాయణరెడ్డి “ఈ కేసును తాను కొనసాగించాలనుకుంటున్నానని, తదుపరి విచారణ సమయంలో తాను  వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు అవుతానని” అక్టోబర్ 5 వ తేదీన సుప్రీం కోర్టులో ఒక అఫిడవిట్ వేయడంతో తమకు “మంత్రి వ్యహారశైలిపై అనుమానాలు” కలుగుతున్నాయని రామసుబ్బారెడ్డి వర్గీయులు అంటున్నారు.      

వర్గకలహాల నేపధ్యం

మంత్రి ఆదినారాయణ రెడ్డి తండ్రి దేవగుడి సుబ్బరామిరెడ్డి, ఆయన చిన్నాన్న దేవగుడి శంకరరెడ్డి సోదరులు. ఉమ్మడికుటుంబంగా ఉండేవారు. 1970లో ఆదినారాయణరెడ్డి తండ్రి సుబ్బరామిరెడ్డి గ్రామ కక్ష్యల కారణంగా హత్యకు గురయ్యారు.   సుబ్బరామిరెడ్డికి మంత్రితో సహా నలుగురు పుత్రులుకాగా, శంకరరెడ్డికి ముగ్గురు కుమారులు.
సుబ్బరామిరెడ్డి హత్యజరిగినప్పటి నుండి 1990లో హత్యకు గురైనంతవరకు  శంకరరెడ్డి కుటుంబ పెద్దగా ఉంటూ,రాజకీయాయపోరాటాన్ని నడిపారు.

శివారెడ్డి కుటుంబం సుబ్బరామిరెడ్డి ప్రత్యర్థుల వైపు నిలవటంతో 1970 వరకు ఒకే వర్గంగా ఉన్నఈ రెండు కుటుంబాలు వైరి వర్గాలుగా మారి, తమ అస్తిత్వాన్ని కాపాడు కోవడం కోసం కాంగ్రెస్ లో ఉంటూ ఎదో ఒక నాయకుడికి అనుకూలంగా రాజకీయాలు  చేసాయి.

తెలుగుదేశం  ఆవిర్భావంతో గుండ్లకుంట శివారెడ్డి టీడీపీలో చేరి మంత్రి కాగా దేవగుడి వర్గం వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్గీయులుగా కాంగ్రెస్ ను అంటి పెట్టుకుని తమ పోరాటాన్ని కొనసాగించారు.

1987 మండల ఎన్నికలలో దేవగుడి వర్గానికి చెందిన భీమగుండం గోపాల్ రెడ్డి భార్య సుభద్రమ్మ, శివారెడ్డి భార్య లక్ష్మీదేవిని ఓడించారు.  శంకరరెడ్డి  తన కుటుంబాన్నికాపాడుకుంటూ, తమను రాజకీయంగా దెబ్బ తీస్తున్నారనే ఆక్రోశంతో,  ఆగ్రహించిన శివారెడ్డి వర్గీయులు 1990 డిసెంబర్ లో  హైదరాబాద్ నుండి వస్తున్న దేవగుడి శంకరరెడ్డితో పాటు  భీమగుండం గోపాలరెడ్డిపై  షాద్ నగర్ వద్ద దాడి చేసి హత్య చేసిన విషయం విదితమే. జంటహత్యల కేసుగా ప్రసిద్ధి చెందిన  ఈ కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టు ముంగిట ఉంది.

ఆదినారాయణ రెడ్డి రాజకీయ ప్రవేశం

ఆదినారాయణ రెడ్డి అగ్రజుడు నారాయణ రెడ్డి ఈ వర్గానికి చాలా కాలం నాయకత్వం వహించినా శివా రెడ్డిని కానీ, ఆయన సోదరుడి కుమారుడు రామసుబ్బా రెడ్డిని కానీ ఎన్నికలలో ఓడించలేకపోయారు.  రాజకీయంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2004 ఎన్నికల సమయంలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వీరి కుటుంబ సభ్యులను
ఒప్పించి ఆదినారాయణ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల రంగంలో దించడం, ఆయన తమ ప్రత్యర్థి రాసుబ్బా రెడ్డిని ఓడించారు.  ఆయన మరోసారి 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో వైస్సార్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి  రామసుబ్బా రెడ్డిపై  గెలిచారు.

అయితే వైస్సార్ పార్టీ అధినేత జగన్ తో విభేదించిన ఆయన 2016లో వైస్సార్ పార్టీని వీడి తెలుగుదేశం పంచన చేరారు. జగన్ పై తీవ్ర విమర్శలు చేయడం, కడప జిల్లాలో జరిగిన ఎం.ఎల్.సి ఎన్నికలలో చక్రం తిప్పి వైస్సార్ అధినేత జగన్ చిన్నాన్న వై.ఎస్. వివేకానంద రెడ్డిని ఓడించడంలో తీవ్రంగా కృషిచేసి టీడీపీ అధినేతకు దగ్గరయ్యారు.   అలాగే ఆ తర్వాత జరిగిన ‘ఆర్లగడ్డ ఉపఎన్నికలలో’ తనదైన  శైలిలో పనిచేసి, పోలింగ్ నిర్వహించడంలో తన ప్రతిభ చూపి “ముఖ్యమంత్రి విశేషాభిమానాన్ని” పొందగలిగారు. అచిరకాలంలోనే కడప జిల్లాలో జగన్ ను ఎదిరించగల మొనగాడుగా గుర్తింపు పొంది, తన చిరకాల స్వప్నమైన “మంత్రి పదవిని” అలంకరించారు.

కుటుంబ విభేదాలు

ఆదినారాయణ రెడ్డి వైస్సార్ పార్టీ ని వీడి టీడీపీలో చేరాలనే ప్రయత్నం చేసినప్పటి నుండికుటుంబంలో అభిప్రాయభేదాలు పొడచూపాయట.   “తమ కుటుంబాన్ని ఆదుకుని, తమకు అన్ని రకాలుగా అండగా నిలచిన వై.ఎస్. కుటుంబాన్ని వదలడం మంచిది కాదన్న” కుటుంబసభ్యుల అభిప్రాయాలను పట్టించుకోకపోవడం, ఆయన మంత్రి అయ్యాక “రాజశేఖర్ రెడ్డిని విమర్శించడం”  లాంటి అంశాలు కుటుంబం మధ్య విభేదాలు సృష్టించాయని  తెలుస్తున్నది.
మంత్రి అయిన వెంటనే ఆదినారాయణరెడ్డి  తన  కుమారుడు సుధీర్ రెడ్డికి, తన షడ్డకుడు రాజగోపాల్ రెడ్డి (రిటైర్డ్ ఎం.ఐ.ఓ.) కి అధిక ప్రాధాన్యమిచ్చి, అన్ని అంశాలలో కుటుంభ సభ్యులను పక్కన పెట్టారనే ఆరోపణలు కూడా ఈ విభేదాలు పెరగడానికి మరో కారణంగా తెలుస్తున్నది.  

ముఖ్యమంత్రి చంద్ర బాబు సూచన మేరకు తమ చిరకాల ప్రత్యర్థి రామసుబ్బారెడ్డితో కలసి పోయి, “జంట హత్యల కేసులో ఏకపక్షంగా రాజీ కావడానికి సిద్దపడటం” వల్ల ఈ విభేదాలు తీవ్రమై కుటుంబ కలహంగా మారుతున్నాయని  వారి  సన్నిహితులు అంటున్నారు.

ఆదినారాయణ రెడ్డి –రామసుబ్బారెడ్డి రాజీ

కడప జిల్లా టీడీపీలో ఉన్న వర్గ పోరాటాలను  అంతంచేసి  పార్టీని బలోపేతం చేయడం, వైస్సార్ అధినేత జగన్ స్వంత జిల్లాలో ఆ పార్టీని ధీటుగా ఎదుర్కోవడం లక్ష్యాలుగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు.   అందులో భాగంగా     
“రాజకీయావసరాలకోసం మీరిరువురూ రాజీ  కావాలని” ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదికి, రామసుబ్బారెడ్డికి గతంలో అనేకసార్లు చెప్పినా ఫలితం లేకపోవడంతో ముఖ్యమంత్రి ఇటీవల మరోసారి అమరావతిలో ఇరువురితో తీవ్ర స్థాయిలో చర్చలు జరిపి రాజీ చేశారని  పార్టీ వర్గాలు తెలిపాయి.

“1983 నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న రామసుబ్బారెడ్డిని నొప్పించి నిన్ను పార్టీలో చేర్చుకోవడం, మంత్రి పదవి కట్టబెట్టడం జరిగిందని, వారి కుటుంభానికి న్యాయం చేయాల్సిఉందని, అందుకోసం ‘జంట హత్యలకేసులో రాజి కావాలని’ ముఖ్యమంత్రి ఆదినారాయణ రెడ్డికి గట్టిగా చెప్పారని” పార్టీ వర్గాల భోగట్టా. అలాగే జమ్ములమడుగు ఎం.ఎల్.ఏ స్థానానికి రామసుబ్బారెడ్డి పోటీ చేస్తారని, కడప ఎం. పి స్థానానికి ఆదినారాయణ రెడ్డి మాత్రమే ధీటైన అభ్యర్థి కాగలడని, ఎన్నికల ఫలితాలతో సంభందం లేకుండా “తగిన గుర్తింపు” కల్పిస్తానని  ముఖ్యమంత్రి ఆదికి హామీ ఇచ్చారని, ఆ మేరకు ఇరువురు అంగీకరించారని  పార్టీ వర్గాలు తెలిపాయి.

అందులో భాగంగా ఇటీవల మంత్రి ఆదినారాయణ రెడ్డి సుప్రీం కోర్టులో ఉన్న “జంట హత్యల కేసులో” రాజీ పిటీషన్ వేయాలని తమ న్యాయవాదికి మౌఖికంగా సూచించారని, ఇందుకు విభేదించిన దేవగుడి శంకరరెడ్డి కుమారుడు శివనారాయణ రెడ్డి అక్టోబర్ 5 న అఫిడవిట్ దాఖలు చేశారని తెలిసింది. “హత్యకు గురైంది మా నాయన. ఎవరు ఏమి చెప్పినా మేము కేసును నడుపుతామని” శివనారాయణ రెడ్డి పట్టుదలతో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు
తెలిపాయి.

 

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ అప్పీల్

ఇదిలా ఉండగా “జంట హత్యల కేసులో” హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ అప్పట్లో ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వము కూడా సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది.  ఈ కేసులో తమకు న్యాయం జరిగేలా సహకరించాలని శంకరరెడ్డి మరో కుమారుడు శివనాధరెడ్డి ప్రభుత్వ న్యాయవాదిని కలిసి విజ్ఞప్తి చేశారని ఆ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఈ  కేసులో ఎ. పి ముఖ్యమంత్రి ఎత్తుగడ పారి తమకు అన్యాయం జరిగే పరిస్థితి వస్తే తమంతకు తాము పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి దాయాదులు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు.

రామసుబ్బారెడ్డి వర్గీయుల అనుమానాలు అనేకం

కాగా ఈ కేసు విషయంలో మంత్రి వ్యవహార శైలిపై రామసుబ్బారెడ్డి వర్గీయులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆదినారాయణ రెడ్డి “నోటితో నవ్వి నొసటితో వెక్కిరిస్తారని”  ఆయన చెప్పేదానికి, చేసేదానికి సంభందం ఉండదని వారు వాపోతున్నారు. ఇటీవల పెద్ద దండ్లూరు వద్ద జరిగిన ఘటనలో మంత్రి  అనుచరగణం వైస్సార్ పార్టీ అభిమానులతో పాటు, తమ వర్గీయులను కూడా చితకబాదారని వారు గుర్తుచేస్తున్నారు.

“35 సంవత్సరాలుగా టీడీపీకి నమ్మకంగా సేవ చేసినందుకు తమకు ప్రస్తుతం టీడీపీ ప్రభ్యుత్వంలో నిలువ నీడ కూడా లేకుండా పోయిందని, తాము రాజశేఖర్ రెడ్డి ప్రభుత్యంలో కూడా ఇన్ని ఇబ్బందులు పడలేదని” వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు ఒక ట్రాక్టర్ ఇసుక తెచ్చుకున్నా పోలీసులు కేసులు పెడుతున్నారని వారు గుర్తు చేస్తున్నారు.
2009లో రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆదినారాయణరెడ్డి రాజకీయాలలో తన విశ్వరూపం చూపారని, వర్గపోరును సాకుగా చూపి జగన్ ను నమ్మించి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితంగా మెలిగి తన పనులు చక్కపెట్టుకున్నారని,
ఆ తర్వాత వైస్సార్ పార్టీ టికెట్ పై గెలిచి, తన పదవీ దాహం తీర్చుకోడానికి టీడీపీలో చేరకుండానే   చంద్రన్న పంచన చేరి తమను వేధిస్తున్నారని వారు వివరించారు. అలాగే వీరి కుటుంబంలో విభేదాలు నిజమైతే “సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత” ప్రొద్దటూరులో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశానికి ఆయన సోదరులంతా ఎలా హాజరయ్యారని వారు ప్రశ్నిస్తున్నారు.  

ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన “రాజీ”కి ఆయన కట్టుబడి ఉంటె ఆయన సోదరుడు శివనారాయణ రెడ్డి సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాకలు చేసి ఉండరని, మంత్రి ఎత్తుగడలో భాగంగానే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

స్వతహాగా సాత్వికుడైన రామసుబ్బారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట నోరు తెరవలేకున్నారని, బాబు  హామీని, మంత్రి  మాటలు నమ్మి తన అనుయాయుల కొంప ముంచుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. “రాజకీయ ప్రయోజనాలతో పాటు, నమ్మకస్తులను కాపాడు కోవడం కూడా రాజకీయాలలో భాగమని  చంద్రబాబు గుర్తించాలని”, స్వయంగా జోక్యం చేసుకొని మంత్రి బారి నుండి తమను కాపాడాలని టీడీపీ పాత కాపులు కోరుతున్నారు.

సుప్రీం కోర్టు తీర్పు ఎలాఉన్నా, మంత్రి వ్యవహారశైలి వల్ల గతంలో వైరి వర్గాలమధ్య ఉన్న పోరు, మంత్రి  కుటుంబంలో  కలహాలు సృష్టిస్తున్నదని (కుటుంబ పోరుగా మారుతున్నదని), మంత్రి ఆదినారాయణ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని ఈ విభేదాలను సర్దుకోని, కుటుంబాన్ని ఏకతాటిపైకి తేవాల్సిఉందని, ఆలా కాకపోతే ఈ కలహం కుటుంబ పోరుగా మారుతుందని  దేవగుడి వారి సన్నిహిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇది నిజమైన కుటుంబ పోరు కాకుండా మంత్రి గారు తన ప్రత్యర్థులపై రాజకీయ ఎత్తులు ప్రయోగిస్తే అవి “బూమరాంగ్” కాక తప్పవని రామసుబ్బారెడ్డి వర్గీయులు అంటున్నారు.   

  “దీనిలో ఏది  జరిగినా  మంత్రి   కలలు,  టీడీపీ ఆశలు కల్లలుగానే” మిగిలిపోతాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.
మంత్రి గారు తన రాజకీయ చాణుక్య నీతిని ఎలా ప్రయోగిస్తారో వేచి చూడాల్సిందే!