మహారాష్ట్రలోని పూణెలో రాత్రి పూట కర‌్ఫ్యూ విధించింది అక్కడి ప్రభుత్వం. విద్యా సంస్థలకు కూడా ఈ నెలాఖరు వరకు సెలవులు ప్రకటించేసింది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్‌డౌన్ దిశగా సమాలోచనలు చేస్తున్నాయి. కారణం అందరికీ తెలిసిందే.. దేశంలో మళ్ళీ కరోనా విజృంభించే అవకాశాలుండడం. ఆ దిశగా ఇప్పటికే కేసుల పెరుగుదల కనిపిస్తోంది. కొన్ని రోజుల పాటు రోజుకి 10 వేల లోపు కేసులు నమోదవగా, ఇప్పుడు ఆ లెక్క 14 వేలు దాటేసింది. మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లో అనూహ్యంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రాల మధ్య రాకపోకలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలూ లేవు. దాంతో, పరిస్థితులు ఏ క్షణాన అయినా అదుపు తప్పొచ్చు. తెలంగాణలో ఇటీవల ఓ గ్రామంలో ఏకంగా 33 మందికి ఒకేసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
అంటే, జరుగుతున్న పరీక్షలు, వెలువడుతున్న ఫలితాలతో సంబంధం లేకుండా కరోనా విస్తరించేసిందని అనుకోవాలేమో. గతంలోలా టెస్టులు జరగడంలేదు దేశంలో. ఆంధ్రపదేశ్ విషయానికొస్తే, సగటున రోజూ 60 వేలు ఆ పైన టెస్టులు జరిగేవి గతంలో. తెలంగాణలోనూ 40 నుంచి 50 వేల టెస్టులు రోజువారీ జరిగిన సందర్భాలున్నాయి. కానీ, ఇప్పుడు ఆ పరీక్షల సంఖ్యలో సగం మాత్రమే జరుగుతున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థతి. అధికారిక టెస్టులకి, అనధికారిక కేసులకీ మళ్ళీ పొంతన వుండదు. సినిమా థియేటర్లు కూడా తెరిచేశాక, రాజకీయ కార్యక్రమాలు వేలాది మందితో జరుగుతున్నాక.. కరోనా విజృంభించడం అనేది సర్వసాధారణమే. కానీ, కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా లేకపోతే, అదుపు చేయలేని స్థాయికి కేసులు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు. మళ్ళీ లాక్‌డౌన్ అంటే.. దేశం తట్టుకోగలదా.? అన్నదే అసలు సిసలు ప్రశ్న ఇక్కడ. కరోనా దెబ్బకి దేశం దారుణంగా దెబ్బతినేసింది. పైకి మేకప్ వేసేసి, ఆల్ ఈజ్ వెల్.. అని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఇప్పట్లో పూడ్చుకోలేని నష్టమైతే జరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో కరోనా సెకెండ్ వేవ్ అంటే.. అది అత్యంత భయానకం.