రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల సంగతేమో కానీ, చంద్రబాబు కలలు కన్న తమ కులరాజధాని అమరావతిలో మాత్రం పంచాయితీ ఎన్నికల ఫలితాలు అతి పెద్ద షాక్ ను ఇచ్చాయని చెప్పుకోవాలి. పంచారామాల్లో ఒకటైన ప్రసిద్ధ అమరావతి పుణ్యక్షేత్రం పక్కనే ఉండగా ప్రజలను ఆకర్షించడానికి మరొక అమరావతిని సృష్టిస్తానని, ఒకప్పుడు రాజులు, చక్రవర్తులు పరిపాలించిన భూమి అంటూ తప్పుడు ప్రచారాలు చేసి, ఆ రాజధానికోసం ఏడాదికి మూడు పంటలు పండే సుక్షేత్రాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలు ఎత్తి, అస్మదీయులకు ఎకరాలకు ఎకరాలను కట్టబెట్టి లక్షల కోట్లు గడించాలని పన్నిన కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి అప్రతిహత విజయంతో గండిపడ్డాయి. కళ్ళముందే కులరాజధాని కూలిపోవడంతో మతిభ్రమించి జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కృత్రిమ ఆందోళనలు, ధర్నాలు చేయిస్తూ, రాజధాని పరిధిలోగల ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలతో టెంట్లు వేయించి రభసలు సృష్టించి ఎలాగైనా తమ కోట్ల రూపాయల ఆస్తులను కాపాడుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు తెలుగుదేశం అధినేత.
నాలుగువందల రోజులుగా నడుస్తున్న దీక్షాడ్రామాలకు మొన్నటి పంచాయితీ ఎన్నికల ఫలితాలు కోలుకోలేని దెబ్బను ఇచ్చాయి. రాజధాని పరిధిలో గల గ్రామాల్లో కూడా మెజారిటీ పంచాయితీలు అధికార వైసిపి గెల్చుకోవడంతో చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. మండల కేంద్రం అమరావతిలోనూ వైసిపి అభ్యర్థి నూట ఎనిమిది ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించడంతో అసలు అమరావతి ఉద్యమమే ఒక బూటకం అని తేలిపోయింది.
రాజధాని పరిధిలో ఉన్న తాడికొండ, ఫిరంగిపురం, అమరావతి, అచ్చంపేట, ప్రత్తిపాడు, క్రోసూరు పంచాయితీల్లో కూడా వైసిపి బలపరచినవారు నాలుగు అంకెల ఆధిక్యతను సాధించారు. అంతేకాదు, హేమాహేమీలైన మాజీ మంత్రులు ప్రాతినిధ్యం వహించిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా డెబ్బై అయిదు శాతానికి పైగా వైసిపి బలపరచిన అభ్యర్థులు ఘనవిజయాన్ని సాధించడం చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి ఆ రెండు జిల్లాల్లో కూడా పట్టు జారిపోయిందని తేటతెల్లం అయింది. అమరావతి పేరుతో అయిదేళ్లపాటు కాలక్షేపం చేసి, భూకుంభకోణాలకు చంద్రబాబు తెగించారని ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని కనపరిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో సాక్షాత్తూ చంద్రబాబు కొడుకు, లోకేష్ నాయుడు మంత్రిహోదాలో పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలోనే పదిహేను వేల ఓట్ల తేడాతో ఓడిపోయినపుడే ప్రజాగ్రహాన్ని చంద్రబాబు గమనించి ఉండాల్సింది. కానీ, అక్రమంగా పోగేసుకోవాలనుకున్న ఆస్తులు కళ్ళముందే కరిగిపోవడంతో ఆయన ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేక రాజధాని ఉద్యమం అంటూ హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించారు.
ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెల్చుకున్నట్లయితే తప్పకుండా అమరావతి పట్ల ప్రజలకు ఆసక్తి ఉన్నదని భావించాల్సివచ్చేది. ఆ విధంగా జరగకపోవడంతో చంద్రబాబు ఆశలు కుప్పకూలాయి. అటు సొంత నియోజకవర్గం కుప్పంలో ఘోర పరాభవం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ పరాభవం కన్నా అమరావతిలో జరిగిన పరాభవం చంద్రబాబును, లోకేష్ నాయుడును, తెలుగుదేశం పార్టీని మరింతగా కృంగదీస్తుంది అనడంలో సందేహం లేదు.
అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీకి పూర్తి వ్యతిరేక ఫలితాలు వెల్లడయిన నేపథ్యంలో రాజధాని వికేంద్రీకరణను జగన్ సర్కార్ మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉన్నది. చంద్రబాబు భజనపరులు, పచ్చ మీడియా ఇక ఎంత రెచ్చగొట్టినా ఫలితం ఉండక పోవచ్చు. రాజధానిని వికేంద్రీకరించడానికి ప్రజలు ఈ ఎన్నికల ద్వారా జగన్ మోహన్ రెడ్డికి పచ్చజెండా ఊపారని విశ్వసించాలి. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాల ఫలాలు అందరికీ సమానంగా అందుతున్నాయని, సుపరిపాలనతో వైసిపి రోజురోజుకు బలోపేతం అవుతున్నట్లు ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఈ ఫలితాల తరువాత ఇకపై అమరావతి ఉద్యమం అనేది ఎక్కువకాలం కొనసాగుతుందా అనే అంశం సందేహాస్పదమే. ఏమైనప్పటికీ ఇరవై నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి తన ఆదరణను పెంచుకోగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు తమ ప్రభావాన్ని కోల్పోయారని చెప్పవచ్చు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు