మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్రను కాస్సేపటి క్రితం ఏపీ ఏసీబీ అరెస్ట్ చేసింది. సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఈ రోజు ఉదయం ఆయన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
కాగా, అమరావతి కుంభకోణమంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ ఆ మధ్య ధూళిపాళ్ళ నరేంద్ర తనదైన వాయిస్ చాలా బలంగా వినిపించారు. ఈ కారణంగానే ధూళిపాళ్ళ గొంతు నొక్కడానికి ఈ అరెస్ట్ జరిగిందనే విమర్శ టీడీపీ నుంచి వినిపిస్తోంది. కాగా, అమరావతి అక్రమాల్లో ధూళిపాళ్ళకూ వాటా వుందని వైసీపీ ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే.
నిజానికి, టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుని ఏపీ సీఐడీ అరెస్టు చేయనుందనే ప్రచారం జరిగింది. సీఐడీ నోటీసులకు సమాధానమివ్వకుండా అజ్నాతంలోకి వెళ్ళిన దేవినేని ఉమా మహేశ్వరరావు, కోర్టును ఆశ్రయించి అరెస్టు నుంచి కాస్త ఊరట పొందారు. ఇంతలోనే తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది ధూళిపాళ్ళ నరేంద్ర అరెస్టు వ్యవహారంతో. కాగా, దేవినేని ఉమామహేశ్వరరావు ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ ఫోర్జరీకి పాల్పడ్డారని అధికార వైసీపీ ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే.
వైఎస్ జగన్ ఓ సందర్భంలో మాట్లాడిన మాటల్ని మార్ఫింగ్ చేసి, తమక్కావాల్సిన విధంగా ఎడిట్ చేసి, ప్రజల్ని తప్పుదోవ పట్టించారన్నది దేవినేని ఉమపై అభియోగం. ఇక, ధూళిపాళ్ళ విషయానికొస్తే, సంగం డెయిరీ విషయమై గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే, ధూళిపాళ్ళ మాత్రం ఆ ఆరోపణల్ని కొట్టిపారేస్తూ వచ్చారు. కానీ, ఈ రోజు అరెస్టును తప్పించుకోలేకపోయారు. సంగం డెయిరీలో ఏం అక్రమాలు జరిగాయి.? ధూళిపాళ్ళ వాదనల్లో నిజమెంత.? వేచి చూడాల్సిందే.