జగన్ నిర్ణయాలు చంద్రబాబును బలవంతుడిని చేస్తున్నాయా..?

వైఎస్ చనిపోయిన తర్వాత పరిణామాల్లో జగన్ 16 నెలలు జైలు జీవితం గడిపారు. కేంద్రంలోని కాంగ్రెస్ తో చంద్రబాబే చేతులు కలిపి ఈ కుట్రపన్నారని అంటారు. వైఎస్ మరణం, జగన్ జైలు జీవితం ఇవన్నీ జగన్ కి సానుభూతి తెచ్చిపెట్టాయి. 2017లో ప్రతిపక్ష నేతగా విశాఖ ఆర్కే బీచ్ లో జగన్ తలపెట్టిన క్యాండిల్ ర్యాలీని ఆనాటి టీడీపీ ప్రభుత్వం అడ్డుకోవడం.. రన్ వే పైనే జగన్ బైఠాయించడం.. టీడీపీ ప్రభుత్వం కక్షతోనే ఇలా వ్యవహరించిందని మళ్లీ జగన్ కే సింపతీ వచ్చింది. ఇక్కడ ప్రధాన అంశం ప్రతీకార రాజకీయాలు. అధికార పార్టీ రాజకీయాలకు నిస్సహాయ స్థితిలో ఉండిపోయే ప్రతిపక్షానికి సింపతీ అన్ని సందర్బాల్లో రాకపోయినా ప్రభుత్వ తీరు అందుకు కారణమవుతుంది.

po

ఆ సమయంలో ప్రతిపక్షం చేసే వ్యాఖ్యలు, వారిని అంతెత్తున చూపే మీడియా వల్లే ప్రజల మనసుల్లో కొత్త ఆలోచనలు రేకెత్తేలా చేస్తాయి. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై టీడీపీ నాయకులను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. అచ్చెన్నాయుడు అరెస్టు, చంద్రబాబు, లోకేశ్ పై కేసులు, అమరావతి భూముల విషయంలో ఎస్సీ, ఎస్టీ కేసు, రవీంద్ర అరెస్టు, దేవినేని ఉమకు నోటీసులు.. ఇప్పుడు ధూళిపాళ నరేంద్ర అరెస్టు. వీటన్నింటిలో ఆరోపణలే మిగిలాయి నోటీసులు, అరెస్టులు జరుగుతున్నా.. ఎందులోనూ స్పష్టత లేకపోవడం.. కేసులు నిలబడకపోవడం జరుగుతోంది. వీటిలో ఏ ఒక్కటైనా కోర్టు పరిధిలో నిలబడేలా ఉంటే.. ప్రభుత్వానికి ప్రశంసలు దక్కుతాయి. అచ్చెన్నాయుడు కేసులో పురోగతి కష్టమనే వార్తలూ వచ్చాయి. అమరావతి భూములపై చంద్రబాబు, నారాయణకు స్టే వచ్చింది.

ఇలా ప్రతి అంశంలో.. ఇది జగన్ ప్రభుత్వ ప్రతీకార చర్య అని ప్రజలకు తామే చెప్పుకునట్టు అవుతోంది. పైగా.. టీడీపీకి బాకా ఊదే మీడియా రిపీటెడ్ మోడ్ లో మరింత హైలైట్ చేస్తాయి. చంద్రాబాబుకు కావాల్సింది కూడా ఇదే. 2019 ఎన్నికల్లో భారీ విజయం, రెండేళ్ల తర్వాత జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అదే హవా, టీడీపీలో నాయకత్వ లోపం అంశాలు, పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్న నాయకులు.. ఇవన్నీ వైసీపీకి కలిసొచ్చే అంశాలు. వీటన్నింటితో ప్రజల్లో మరింత బలపడాల్సిన వైసీపీ టీడీపీ నాయకుల అరెస్టులతో స్వయంగా సానుభూతిని చంద్రబాబు, టీడీపీకి దక్కేలా చేస్తోంది. ప్రజల మనసులు మారిపోవడానికి ఒక్క ఇన్సిడెంట్ చాలు. ఎన్నేళ్ల తర్వాతైనా ఓటుతో చెప్పాల్సింది చెప్పేస్తారు. మరి.. జగన్ ఈ విషయాన్ని గుర్తెరుగుతారనే భావించాలి..!