టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర, ఈ రోజు మీడియా ముందుకొచ్చి నానా హంగామా చేశారు రాజధాని అమరావతి విషయంలో అధికార వైసీపీ మీద విమర్శలు చేసేస్తూ. అమరావతి కోసం అసైన్డ్ భూముల్ని కూడా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా లాక్కున్న విషయం విదితమే. ‘మీరు స్వచ్ఛందంగా భూములు ఇవ్వకపోతే, వాటిని మేం ఇంకో మార్గంలో లాక్కుంటాం..’ అంటూ ‘భూ సేకరణ – భూ సమీకరణ’ వ్యవహారాలతో రాజధాని ప్రాంత రైతుల్ని భయపెట్టింది చంద్రబాబు సర్కార్. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ‘రైతులు ఎవరైనా స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోండి.. మా భూముల జోలికి రావొద్దు..’ అని కొందరు రైతులు ఆందోళనలు కూడా చేశారు.
అలాంటి రైతుల పొలాల్లో పంటలు రాత్రికి రాత్రి ధ్వంసమయ్యాయి కూడా. కానీ, అమరావతిలో అక్రమాలు జరగలేదని ధూళిపాళ్ళ అంటున్నారు. అంతేనా, దళిత రైతుల పక్షాన నిలబడి, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇటీవల పోలీసులు ఫిర్యాదు చేస్తే, ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి నోటీసులు ఇవ్వడాన్ని తప్పు పట్టిన ధూళిపాళ్ళ, ఆ రైతులెవరూ స్వచ్ఛందంగా ఫిర్యాదు చేయడానికి రాలేదనీ, వాళ్ళసలు చంద్రబాబు హయాంలో నష్టపోలేదనీ, వాళ్ళెవరూ చంద్రబాబుకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయలేదనీ అంటున్నారు. దీనికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా విడుదల చేశారు ధూళిపాళ్ళ. అయితే, అవి సీక్రెట్‌గా తీసిన వీడియోల్లా కనిపిస్తున్నాయి. అంటే, మళ్ళీ బెదిరింపుల ద్వారానే టీడీపీ తన పని సజావుగా చేసుకుపోయిందని అనుకోవాలేమో.
ఒక్కటి మాత్రం నిజం.. రాజధాని అమరావతిలో అక్రమాలపై వైఎస్ జగన్ సర్కార్ అలసత్వం ప్రదర్శించడాన్నీ సమర్థించలేం. నేరుగా బాధిత దళిత రైతులతో కేసులు పెట్టించకుండా ఎమ్మెల్యే ద్వారా కేసులు పెట్టించడం అధికార పార్టీ డొల్లతనాన్ని బయటపెడ్తోందన్న విమర్శలున్నాయి.