వినాశకాలే విపరీత బుద్ధి

Destructive extravagant intellect
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి విరామం లేకుండా అమలుచేస్తున్న సంక్షేమ పధకాలు, ఎక్కడకు వెళ్లినా జగన్మోహన్ రెడ్డికి దక్కుతున్న ప్రశంసలు, ఇంతవరకు ఒక్క కుంభకోణం కూడా జరగకపోవడం, అవినీతిభూతం నుంచి మంత్రులను కట్టడి చెయ్యడం, జగన్ ఏ ప్రణాళిక ఇచ్చినా తూచా తప్పకుండా అమలు చేస్తున్న అధికార యంత్రాంగం, అమరావతి భ్రమరావతిగా మిగిలిపోవడంతో చంద్రబాబును నమ్మి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినవారి భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారు కావడం లాంటి అనేక అంశాలు తెలుగుదేశం,  కాంగ్రెస్, జనసేన, ఉభయ కమ్యూనిస్ట్, బీజేపీ లలో తీవ్ర అసహనాన్ని రేకెత్తిస్తున్నాయి.  ముఖ్యంగా అధికారం కోల్పోవడంతో తన సామాజికవర్గం వారికి కోలుకోలేని దెబ్బ తగిలిందని భావిస్తున్న చంద్రబాబు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం సాధ్యం కాదని గ్రహించి ప్రజల మధ్య మతవిద్వేషాలను రాజేయడానికి పధకాలు రచిస్తున్నారని గత అయిదారు రోజులుగా సంభవిస్తున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.  
 
Destructive extravagant intellect
Destructive extravagant intellect
తాను ఎంత ప్రయత్నించినా బీజేపీ అధిదేవతలు ప్రసన్నం కాకపోవడం చంద్రబాబును తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి.  తన డెబ్బై ఏళ్ళ జీవితంలో ఏనాడూ నుదుట తిలకం, కుంకుమ ధరించని చంద్రబాబు హఠాత్తుగా వీరహిందువు అవతారం దాల్చారు.  కాస్త దూరం వెళ్ళడానికి కూడా అధికారంలో ఉన్నప్పుడు హెలికాఫ్టర్ ను ను వినియోగించిన చంద్రబాబు మూడు వందల మెట్లను అధిరోహించి బోడికొండ మీద పచ్చ జెండాను ఎగురవేయడానికి ప్రయత్నించారు.   ముఖ్యమంత్రి మతాన్ని పదేపదే ఉచ్చరిస్తూ క్రైస్తవులు అందరినీ దోషులుగా, నేరగాళ్లుగా నిలబెట్టడానికి, వారిమీద హిందువులకు ద్వేషం కలగడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.   పదిరోజుల క్రితం జగన్ ప్రభుత్వం ప్రారంభించిన ఇళ్లపట్టాల పంపిణీ పధకం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది.  ఒకేసారి జగన్ ఇన్ని వేలఎకరాలను పేదలకు ఎలా పంచిపెడుతున్నారో దేశం మొత్తం అబ్బురంగా చూస్తున్నది.  పాలన చేతకాక ఆరునెలల్లోనే కాడి కింద పడేసి జగన్ వెళ్ళిపోతాడని గంపెడు ఆశలు పెట్టుకున్నవారికి నిరాశా నిస్పృహలే జవాబయ్యాయి.  ఇక జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చెయ్యడం ఎలా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నవారికి మనసులను మలినం చేసే మతవిద్వేషాలు రగల్చడమే మార్గం అన్న  భ్రాంతికి వచ్చేశారు.
 
ఇక వరుసగా రాష్ట్రంలో ఏదో ఒక చోట ఒక చిన్న గుడిలో దేవతావిగ్రహాలకు అపచారం జరగడం ప్రారంభం అయింది.  ఆ విషయం అందరికన్నా ముందుగా పచ్చ మీడియాకే తెలుస్తుంది.  పోలీసులకు కూడా తెలిసే ముందే పచ్చమీడియాలో చర్చలు మొదలపోతాయి.  జగన్ అంటే ఒళ్ళంతా కారం పూసుకున్నట్లు పూనకాలు వేసే కొందరు చదువుకున్న జ్ఞానహీనులు  బోలెడంతమంది పచ్చ తెరల మీద ప్రత్యక్షం అవుతారు.  జగన్ స్వయంగా దగ్గరుండి విగ్రహాలు పగలగొడుతున్నట్లు గొంతులు పెంచి అరుస్తుంటారు.  వీరందరికి ఎవరి పాకేజీలు వారికి టంచనుగా అందుతుంటాయి.  జగన్ రాజ్యంలో దేవుళ్ళకు రక్షణలేదు అంటూ కంఠనాళాలు తెగిపడేట్లు రొదపెడుతుంటారు.  వీరందరి ఉమ్మడి శత్రువు జగన్మోహన్ రెడ్డి ఒక్కరే.  ప్రజాక్షేత్రంలో జగన్ ను ఎదుర్కోవడం ఎవ్వరికీ చేతకానిపని.  అందుకే కులాలను, మతాలను కూడా యథేచ్ఛగా వాడుకుంటూ బురద చల్లడానికి తెగబడతారు. 
 
చంద్రబాబు హయాంలో సుమారు వెయ్యికి పైగా దేవాలయాల్లో ఇలాంటి దుర్ఘటనలు జరిగిన సంగతి వీరికి గుర్తు రాదు.  పుష్కరాల పేరుతో నలభై దేవాలయాలను కూల్చేసి మరుగుదొడ్లుగా, వ్యాపార అంగళ్లుగా మార్చేసిన ఘాతుకం పాపం మన స్వామీజీలకు అసలు జ్ఞాపకమే ఉండదు.  విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన వెయ్యికాళ్ల మంటపాన్ని చంద్రబాబు నిరంకుశంగా కూల్చేసినప్పటికీ  ఒక స్వామివారికి అసలు చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు అప్పట్లో.  కొంత రాద్ధాంతం చేసి ఆ తరువాత చంద్రబాబు నుంచి  తిరుమలలో ఆశ్రమం కోసం కొంత స్థలం, భారీ ముడుపులు స్వీకరించి నోటికి తాళాలు వేసుకున్నారని అప్పట్లో ఆయన మీద పత్రికల్లో వార్తలు కనిపించాయి.  ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆ తరువాత ఆయన ఆ పురాతన మంటపాన్ని పునర్నిర్మించాలని ఒక్క ప్రకటన ఇచ్చి సైలెంట్ అయిపోయారు.     అంతర్వేదిలో రధం తగలబడటంపై విచారణను చెయ్యమని రాష్ట్రం  సీబీఐని కోరినా ఇంతవరకు సిబిఐని రప్పించే సాహసం చెయ్యరు బీజేపీ వారు.  
 
ఇప్పుడు చంద్రబాబు గారు గొప్ప హిందుపరిరక్షకుడుగా అవతరించి ఇతర మతాల మీద విమర్శలు గుప్పిస్తున్నారు.  మరి వారి  ఆగ్రహానికి గురి అవుతానని ఆయనకు భయం లేదా?  కేవలం హిందువుల ఓట్లమీదనే ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారా?   తెలుగుదేశం పార్టీని కేవలం హిందువులకే పరిమితం చెయ్యాలని చంద్రబాబుగారి తాపత్రయమా లేకా హిందూ పార్టీ అనిపించి బీజేపీ సముద్రంలో నిమజ్జనం చేసి మోడీ గారి  చరణ కమలాల వద్ద కాసింత స్థానం సంపాదిద్దామనా?
 
ఏదేమైనప్పటికీ చంద్రబాబు కుతంత్రాలను కొందరు తెలుగు తమ్ముళ్లే జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం.  రాబోయే రోజుల్లో ఈ విధానం తమ వినాశనానికి దారి తీస్తుందని భయపడుతున్నారట!  రాజకీయంగా చంద్రబాబు అన్నీ అనుభవించారు.  కొడుకు పైకొచ్చే అవకాశాలు దుర్భిణీ వేసి గాలించినా ప్రయోజనం శూన్యం.  ఇపుడు పార్టీ ఉన్నా లేకపోయినా ఆయనకొచ్చే నష్టం ఏమీ లేదు.  తమ కుటుంబం కోసం  వేలకోట్ల రూపాయల సంపదను సృష్టించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.     బీజేపీ మతరాజకీయాలు చేసినా వారికి ఈ రాష్ట్రం కాకపొతే మరొక రాష్ట్రం ఉంటుంది.  దేశం అధికారమే వారి చేతుల్లో ఉన్నది.  కానీ చంద్రబాబును ఇప్పటికే తెలంగాణ నుంచి తరిమేశారు.  ఆయనకు మిగిలింది ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే.  ఆంధ్రాలో మత పిచ్చి లేదు.   చంద్రబాబు బ్రతికి ఉన్నప్పుడే తెలుగుదేశం సజీవసమాధిలోకి వెళ్లిపోవడం ఖాయం అని ఆయన పార్టీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారట!  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు