YouTuber Jyoti: పాక్ అనుకూల యూట్యూబర్.. ప్రముఖ కంపెనీతో మరో లింక్!

పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తోందన్న ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో నిత్యం కొత్త మలుపులు వెల్లడి అవుతున్నాయి. ప్రస్తుతం హర్యానా పోలీసుల అదుపులో ఉన్న ఆమెపై విచారణ కొనసాగుతుండగా, పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె యూట్యూబ్ వీడియోల్లో పాక్ అనుకూల వ్యాఖ్యలు మాత్రమే కాకుండా, విదేశాల్లో కూడా అనుమానాస్పద వ్యక్తులతో సంబంధాలు పెట్టుకున్నట్లు ఆధారాలు లభించాయి.

పోలీసుల దర్యాప్తులో జ్యోతి మల్హోత్రా గతంలో మూడు సార్లు పాకిస్థాన్ వెళ్లినట్లు, అక్కడ ఇంటెలిజెన్స్ వర్గాలతో మంతనాలు జరిపినట్లు తేలింది. అంతేగాక, ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో పనిచేసే డానిష్ అనే ఉద్యోగితో ఆమెకు సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. ఈ పరిచయం ద్వారానే ఆమె పాక్ టూర్‌కు అనుమతులు, నిధులు పొందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఈ ఘటనలో మరో కీలక అంశం వెగో ట్రావెల్ కంపెనీ. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ దుబాయ్, బెంగళూరు, జకర్తాలో కార్యాలయాలు కలిగి ఉంది. పర్యాటకులకు విమాన, హోటల్ ధరల సులభంగా పోలిక చూపించే మెటాసెర్చ్ ప్లాట్‌ఫామ్‌గా వెగో పేరు తెచ్చుకుంది. అయితే, జ్యోతి తరచూ వెగో ద్వారా ప్రయాణాలు సాగించిందని, ఆమె టూర్ ఖర్చులను ఈ సంస్థే భరించిందని ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. కాగా, రెండు రోజుల క్రితం వెగో కంపెనీ అజర్‌బైజాన్ టూరిజం బోర్డుతో ఒప్పందం చేసుకోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.

ప్రస్తుతం ఈ సంస్థ కార్యకలాపాలపై విచారణ చేపట్టిన అధికారులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డేటాను విశ్లేషిస్తున్నారు. ప్రత్యక్ష నిధుల బదిలీకి ఆధారాలు లేవని చెబుతున్నా, జ్యోతి మల్హోత్రా ద్వారా పాక్‌కు సమాచారం అందిన అనుమానం గాఢంగా మారింది. ఈ కేసులో అన్ని కోణాల్లో విచారణ జరపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచించినట్లు సమాచారం.