పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి సవరించిన అంచనాల్ని ఆమోదించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరగాల్సి వస్తోంది రాష్ట్ర ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే పలు మార్లు కేంద్రంతో ఈ విషయమై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పలు మార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపారు, జరుపుతూనే వున్నారు. కేంద్రం మాత్రం, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ‘కొర్రీలు’ పెట్టడం మాత్రం మానడంలేదు. ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు హయాంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం వల్లనే ఈ సమస్య.. అన్నది వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతున్న వాదన. అయితే, ఈ విషయాన్ని కేంద్రం ధృవీకరించడంలేదు.
పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందా.? లేదా.?
పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ 2019 ఎన్నికలకు ముందు వ్యాఖ్యానించిన విషయం విదితమే. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానాల్లో ఎప్పుడూ, పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని పేర్కొనలేదు. అయినాగానీ, పోలవరం ప్రాజెక్టు చుట్టూ ‘అవినీతి రచ్చ’ మాత్రం కొనసాగుతూనే వుంది. చంద్రబాబు, కాంట్రాక్టులకు కక్కుర్తిపడి, పోలవరం ప్రాజెక్టుని కేంద్రానికి తాకట్టుపెట్టేశారన్నది వైసీపీ ఆరోపణ. చంద్రబాబు హయాంలోనే పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు, ఇంకా పూర్తి కాకపోవడానికి కారణాలు చాలానే వున్నాయి. ప్రధానంగా కేంద్రం, ఇవ్వాల్సిన స్థాయిలో నిధులు ఇవ్వకపోవడమే ప్రాజెక్టు ఆలస్యానికి కారణం.
అంచనాల్లో తేడాలు.. ఎవరి పాపం.?
చంద్రబాబు హయాంలోనే దాదాపు 55 వేల కోట్ల రూపాయల సరికొత్త అంచనాలతో రూపొందించిన నివేదికను కేంద్రానికి, అప్పటి ప్రభుత్వం పంపింది. దాన్ని కేంద్రం ఆమోదించింది కూడా. అయితే, ఇప్పుడు దాదాపు 25 వేల కోట్లకు కొర్రీలు పెట్టింది కేంద్రం. మరి, ఈ పాపం ఎవరిది.? చంద్రబాబు వల్లే ఈ సమస్య అనీ, 2016లోనే పోలవరం ప్రాజెక్టు విషయమై చంద్రబాబు, కేంద్రంతో రాజీ పడ్డారనీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్ కుమార్ యాదవ్ ఆరోపిస్తున్నారు.
కేంద్ర మంత్రి ఏం చెప్పారో మరి.!
కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో మంత్రులు బుగ్గన, అనిల్ ఈ రోజు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రితో భేటీ తర్వాత, ‘ఆశాభావం’ వ్యక్తం చేశారు మంత్రులు.. ప్రాజెక్టుకి కేంద్రం తగిన విధంగా నిధులు ఇస్తుందని. కానీ, తప్పెవరిదన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. చంద్రబాబు హయాంలో తప్పు జరిగితే, ఆ తప్పుకీ కేంద్రమే బాధ్యత వహించాలి. వైఎస్ జగన్ హయాంలో తప్పు జరిగినా.. ఆ తప్పు బాధ్యత కూడా కేంద్రానిదే. ఎందుకంటే, పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు. కేంద్రం నోరు మెదపదు.. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు మాత్రం, ‘నేరం నీది.. అంటే, కాదు నీది..’ అంటూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.