BRS Is Dead: రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది: మధుసూదన్ రెడ్డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను చూస్తే తనకు జాలి కలుగుతోందని దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్ గద్వాల పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంట్లోనూ, ఫామ్‌హౌస్‌లోనూ ఉండలేని పరిస్థితుల్లోనే కేటీఆర్ బయటకు వచ్చారని విమర్శించారు.

కేటీఆర్‌పై ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తోందని మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. ఒకవైపు సోదరి కవిత, మరోవైపు బావ హరీశ్‌రావు, ఇంకోవైపు తండ్రి కేసీఆర్ నుంచి వస్తున్న ఒత్తిళ్లతో కేటీఆర్ సతమతమవుతున్నారని అన్నారు. “ఏం చేయాలో తెలియక, పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా జారుకుంటుండటంతో ఇలా పర్యటనలు చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందని మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ నిజాన్ని కేటీఆర్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదని హితవు పలికారు. ఆ పార్టీకి ఎన్ని లేపనాలు పూసినా లాభం లేదని, అవినీతి కంపు తప్ప మరో వాసన రాదని విమర్శించారు. కేటీఆర్ పర్యటనల వల్ల డీజిల్ ఖర్చు తప్ప మరే ప్రయోజనం లేదని, సోషల్ మీడియాలో స్టంట్ల కోసమే ఆయన సభలు పెడుతున్నారని ఆరోపించారు.

“బీఆర్ఎస్ చెప్పే చెత్త కబుర్లు వినడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు వారిని ఫామ్‌హౌస్‌కు పంపారు” అని మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి, తుమ్మడిహట్టి, జూరాల వంటి ప్రాజెక్టులను గాలికొదిలేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే జూరాలపై రూ. 120 కోట్లతో కొత్త వంతెన నిర్మిస్తోందని తెలిపారు. పదేళ్ల పాటు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మింగేసిన బకాసురులు బీఆర్ఎస్ నేతలని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

Nepal Situation In India?: Prof Kurapati Venkatanarayana | Modi | Telugu Rajyam