వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. లిక్కర్ స్కాం కేసులో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో ఛాతిలో నొప్పిగా అనిపిస్తోందని చెబుతూ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం చెవిరెడ్డిని వైద్యులు పరీక్షిస్తున్నారు. ECG సహా ఇతర ప్రాథమిక పరీక్షలు చేస్తున్నారు. ఛాతి నొప్పి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని డాక్టర్లు ఆయనను సాయంత్రం వరకు ఆసుపత్రిలోనే పర్యవేక్షణలో ఉంచాలని నిర్ణయించారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న చెవిరెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
గురువారం బెంగళూరులోని ఎయిర్‌పోర్ట్ వద్ద చెవిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో విజయవాడకు తరలించి, ACB కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆయనను జూలై 1 వరకు రిమాండ్‌లోకి పంపింది. కాగా చెవిరెడ్డిపై లిక్కర్ స్కామ్ లో భాగంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను SIT సేకరిస్తోంది.
అస్వస్థతతో ఆసుపత్రికి వెళ్లిన చెవిరెడ్డిని తిరిగి జైలు తరలించే విషయంలో వైద్యుల నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఆరోగ్య పరిస్థితిపై ఇంకా అధికారికంగా పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.