ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించడంతో ‘న్యాయం జగనన్న వైపు నిలిచింది.. చంద్రబాబు ప్రభావం న్యాయ వ్యవస్థపై తగ్గుతోంది..’ అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. రాష్ట్రంలో రాజ్యాంగ వైఫల్యం.. అంటూ హైకోర్టు చేసి, చేస్తున్న కీలక వ్యాఖ్యల నేపథ్యంలో పెను దుమారమే రేగుతోంది. అక్రమ అరెస్టులు తదితర వ్యవహారాలపై విచారణ సందర్భంగా జస్టిస్ రాకేష్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు, ఈ క్రమంలో ప్రభుత్వానికి తగిలిన షాక్‌లతో అధికార వైసీపీ ఒకింత డిఫెన్స్‌లో పడింది. అదే సమయంలో ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పండగ చేసుకుంది. న్యాయస్థానాల్లో కేసుల విచారణ ఎలా జరుగుతుంది.? ఏయే అంశాల ప్రాతిపదికన తీర్పులు వస్తాయి.? ఇవన్నీ న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాలు. కానీ, న్యాయ వ్యవస్థలో కూడా టీడీపీ వర్సెస్ వైసీపీ.. అనే స్థాయికి ప్రచారాన్ని తీసుకొచ్చింది తెలుగు మీడియా.
గ్యాగ్ ఆర్డర్స్ విషయంలోనూ ఇంతే.!
రాజధాని అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి ప్రభుత్వం విచారణకు ఆదేశించడం, ఈ క్రమంలో పలువురు ప్రముఖుల పేర్లు తెరపైకి రావడం, మాజీ అడ్వొకేట్ జనరల్ సహా ఆయన కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావనకు రావడంతో.. అప్పట్లో హైకోర్టు ‘గ్యాగ్ ఆర్డర్స్’ జారీ చేసింది.. అదీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన దరిమిలా మాత్రమే. అయితే, సర్వోన్నత న్యాయస్థానం, ఆ గ్యాగ్ ఆర్డర్స్‌ని కొట్టి పారేసింది. దాంతో, అప్పట్లోనే వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఇప్పుడు ఇంకోసారి మరింత గట్టిగా సంబరాలు చేసుకుంటున్నాయి.
హైకోర్టు చీఫ్ జస్టిస్‌ల బదిలీల వెనుకా రాజకీయమేనా.?
హైకోర్టు న్యాయమూర్తులు కావొచ్చు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కావొచ్చు.. వీరి నియామకాలకు సంబంధించి ఎప్పటినుంచో దుమారం రేగుతోంది. అది మరింత ముదిరి పాకాన పడింది ఈ మధ్య. తెలుగునాట న్యాయమూర్తుల నియామకాలపై పెద్ద రచ్చే జరిగింది. ‘న్యాయ వ్యవస్థకు సంబంధించి కీలకమైన అంశాలపై చర్చ జరగాలి’ అంటూ బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించడం అప్పట్లో పెను దుమారం రేపింది. న్యాయమూర్తులకు దురుద్దేశ్యాలు ఆపాదించడం ఎంతవరకు సబబు.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. అదే సమయంలో, ‘వాళ్ళూ మనుషులే కదా..’ అన్నది ఇంకో వాదన
చంద్రబాబు పనైపోయినట్లేనా.?
ఎవరైతే న్యాయవ్యవస్థలపై బురద చల్లారో, ఇప్పుడు వాళ్ళే.. తమకు అనుకూలంగా తీర్పులు వస్తున్న దరిమిలా.. ‘అహో అద్భుతం ఈ న్యాయవ్యవస్థ’ అంటున్నారు. ‘చంద్రబాబు కబంధ హస్తాల నుంచి న్యాయ దేవతకు స్వేచ్ఛ లభిస్తోంది..’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు వాళ్ళంతా. ఎవరి ఆనందం వాళ్ళది. మళ్ళీ న్యాయస్థానాల్లో మొట్టికాయలు పడితే, ఆ వెంటనే ‘ఇది చంద్రబాబు పైత్యమే..’ అంటారనుకోండి.. అది వేరే సంగతి. ఏదిఏమైనా, సర్వోన్నత న్యాయస్థానం ఆయా అంశాలపై సీరియస్‌గా స్పందించిన దరిమిలా, ఉన్నత న్యాయస్థానం నుంచి వచ్చే తీర్పుల పట్ల ఒకింత అనుమానాలైతే కలగడం సామాన్యులకి సహజమే కదా.!