ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ‘అరెస్ట్ డ్రామా’ తెలుగుదేశం పార్టీలో కొత్త ఊపు తెచ్చింది. ‘అది అరెస్ట్ కాదు, విచారణ మాత్రమే..’ అని పోలీసులు చెప్పినా, టీడీపీ అధినేత చంద్రబాబులో మాత్రం ఆవేశం కట్టలు తెంచుకుంది. ఇది నిజంగా వచ్చిన ఆవేశమేనా.? లేదంటే, లేని ఆవేశాన్ని.. నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు కష్టపడి తెచ్చుకున్నారా.? అన్న అనుమానాలు జనానికి కలుగుతున్నాయి. రామతీర్థంలో రాములోరి విగ్రహ ధ్వంసానికి సంబంధించి టీడీపీ, బీజేపీ, జనసేన ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు కూడా, ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ క్రమంలో కొంత యాగీ జరిగింది. వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డిపై చెప్పులతో దాడి చేశారు కొందరు. ఆ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు.. కళా వెంకట్రావుని విచారించారు.
ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో పోలీసులు కళా వెంకట్రావు దగ్గరకు వెళ్ళడాన్ని టీడీపీ తప్పు పడుతోంది. టీడీపీ అధినేత అయితే, ఇతర్రతా చాలా అంశాల్ని తెరపైకి తెచ్చి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద విరుచుకుపడిపోయారు, డీజీపీ గౌతమ్ సవాంగ్ మీద కూడా మండిపడిపోయారు. ఇంత ఆవేశం ఈ వయసులో చంద్రబాబుకి అవసరమా.? అందునా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకి, రాజకీయాలు ఎలా వుంటాయో, పాలన ఎలా వుంటుందో, అధికారంలో వున్నోళ్ళు ఎలా వ్యవహరిస్తారో తెలియకపోతే ఎలా.? ఎక్కడిదాకానో ఎందుకు, 2014 నుంచి 2019 మధ్య పోలీసు వ్యవస్థను చంద్రబాబు ఎలా వాడుకున్నారో, రాజకీయ ప్యత్యర్థుల మీదకు పోలీసుల్ని ఎలా ఉసిగొల్పారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అవన్నీ అప్పట్లో చంద్రబాబుకి సమ్మగా అనిపించాయి. ఎందుకంటే, అప్పుడాయన ముఖ్యమంత్రి. ఇప్పుడేమో జరుగుతున్న పరిణామాలు ఆయనకు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి.. కారణం, చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్ష నేత. పరిస్థితులు అలాగే వున్నాయ్.. కానీ, పదవులే అటూ ఇటూ అయ్యాయ్. ట్రీట్‌మెంట్ ఒక్కో పదవికీ ఒక్కోలా వుంటుందని రుచి చూపించిందే చంద్రబాబు. ‘నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్షా’ అన్నట్టు.. చంద్రబాబుకి, రాజకీయం ఏంటో రుచిచూపిస్తున్నారు వైఎస్ జగన్. ఇది రాజకీయ కోణం. ఈ సంగతి పక్కన పెడితే, అధికారంలో ఎవరున్నా ఇంతే.. అని వైసీపీ అనుకుంటే.. అధికారం మారుతుంటుంది గనుక.. భవిష్యత్తులో వైసీపీ కూడా, ఇప్పుడు టీడీపీ ఎదుర్కొంటున్న దుస్థితికి మించి కష్ట కాలాన్ని కొనితెచ్చుకోవాల్సి వస్తుందేమో.!