ఇంకా ప్రాయశ్చిత్తం చేసుకోని చంద్రబాబు నాయుడు 

Chandrababu Naidu has not yet repented
“నేనేం తప్పు చేశానో తెలియదు.. అభివృద్ధి చేయాలనుకోవడం తప్పైతే క్షమించండి” అంటూ చంద్రబాబు చెప్పే నంగనాచి కబుర్లు ఇంకా నమ్మేవారున్నారు అనుకోవడమే ఆయన చేస్తున్న అసలైన పెద్ద తప్పు.  రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు అనుభవజ్ఞుడని, ఆయన చేతుల్లో రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తుంది అని ప్రజలు భ్రమించడమే వారు చేసిన తప్పు అని చంద్రబాబు ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన ఏడాదిన్నర తరువాత కూడా గ్రహించలేకపోవడం ఆయన తప్పు!  
 
Chandrababu Naidu has not yet repented
Chandrababu Naidu has not yet repented
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరువందల హామీల్లో ఒక్కదాన్ని కూడా నెరవేర్చకపోవడం ఆయన చేసిన తప్పు.  ఆయన దొంగహామీలను నమ్మి ఓట్లు వెయ్యడం ప్రజలు చేసిన పెద్ద తప్పు.  అమరావతి పేరుతో కేవలం తన సామాజికవర్గ  కోట్లాధిపతుల కోసం  దేవేంద్రనగరాన్ని నిర్మించాలనుకోవడం చంద్రబాబు చేసిన తప్పు.   ఆయన మాటలను నమ్మి ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను రైతులు ఇవ్వడం అతి పెద్ద తప్పు.   ప్రతిపక్షాలు విమర్శించినపుడల్లా ఒక విదేశాన్ని భ్రమరావతిలో దింపేసి కొత్త కొత్త డిజైన్లంటూ ప్రజలను భ్రమల్లో ముంచెత్తడం చంద్రబాబు  చేసిన తప్పు.  వందిమాగధులను వెంటబెట్టుకుని ప్రత్యేకవిమానాల్లో జల్సా పర్యటనలు చేస్తూ ప్రజలను మోసం చెయ్యడం చంద్రబాబు చేసిన తప్పు.  విశాఖలో పెట్టుబడుల సదస్సులంటూ డ్రామాలు ఆడి లక్షలకోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయంటూ ప్రజలను మోసం చెయ్యడం పెద్ద తప్పు.  నిరుద్యోగభృతి ఇస్తామని వాగ్దానం చేసి ఒక్కరికి కూడా ఒక్క నయాపైసా ఇవ్వకపోవడం చంద్రబాబు తప్పు.  “బాబు వస్తే జాబు వస్తుందని” నమ్మడం ప్రజలు చేసిన తప్పు.  
 
కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని, రాష్ట్రానికి నయాపైసా భారం లేకుండా తన నిధులతో నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును కమీషన్లకోసం కక్కుర్తి పడి తాను తీసుకోవడం చంద్రబాబు చేసిన తప్పు.  చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తెలిసినప్పటికీ కేవలం అధికారంలో వాటా కోసం చంద్రబాబు దురాశను నెరవేర్చడం కేంద్రప్రభుత్వం చేసిన పెద్ద తప్పు.  ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అని తెలిసీ కూడా ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని హోదాను తాకట్టు పెట్టడం చంద్రబాబు చేసిన తప్పుల్లోకల్లా పెద్ద తప్పు.  హోదా అంటే జైలుకే అని ప్రజలను హెచ్చరించడం ఆయన చేసిన తప్పు.  కేంద్రంతో తనకున్న సంబంధాలతో హోదాను తెస్తారని చంద్రబాబును నమ్మడం ప్రజలు చేసిన తప్పు.  హోదాను గాలికి వదిలేసి ఆయనెవరో కేంద్రమంత్రి లక్షల కోట్ల రూపాయల పాకేజీ ఇస్తామంటే దాన్ని నమ్మి అంగీకరించడం ప్రత్యేకహోదాను గాలికి వదిలెయ్యడం చంద్రబాబు చేసిన పెద్ద తప్పు.  ఆ తరువాత ఆ పాకేజీని కూడా తీసుకుని రాకుండా ప్రజలను మోసం చెయ్యడం చంద్రబాబు తప్పు.  
 
ప్రతిపక్షం నుంచి అరవైఏడు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వారిలో ఇరవై మూడు మందిని కొనెయ్యడం చంద్రబాబు చేసిన తప్పు.  ఆ గెలిచినవారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం ప్రజాస్వామ్యం పట్ల చంద్రబాబు చేసిన తప్పు.  కాళ్ళ పారాణి కూడా ఆరకుండా ప్రతిపక్షం నుంచి ముగ్గురు ఎంపీలను కొనుగోలు చెయ్యడం అతి పెద్ద తప్పు.  పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అయిదు కోట్లకు బేరం చేసి ఒక ఓటును కొనబోయి అక్కడి ఎసిబికి దొరికిపోయి ఆంధ్రుల పరువు తీయడం చంద్రబాబు చేసిన తప్పు.  ఆ తప్పు ఫలితంగా పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కును వదులుకుని రాత్రికి రాత్రి అమరావతి పరిగెత్తుకెళ్ళడం అతి పెద్ద తప్పు.  
 
ఒకటికాదు రెండు కాదు.  శిశుపాలుడు చేసింది కేవలం నూరు తప్పులే.  చంద్రబాబు చేసింది పదివేల తప్పులు.  ఆనాడు శ్రీకృష్ణుడు ఆ శిశుపాలుడు మస్తక విచ్చేదన  గావించాడు.  ఈనాడు చంద్రబాబు సైకిల్ చక్రాలను ప్రజలు తుత్తునియలు గావించారు.  చంద్రబాబుకు ఆ సంగతి తెలియక కాదు.  తనను తాను వంచించుకోవడం, ప్రజలను వంచనకు గురిచేయడం…ఇంకా భ్రమల్లో ఉంచడం.  చంద్రబాబు చేసిన తప్పులు ఏమిటో ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు.  ఆయన నాటకాలు ఇకమీద చెల్లకపోవచ్చు! 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు