ఎన్నికల రణక్షేత్రం నుంచి పరారైన చంద్రబాబు, లోకేష్ 

chandrababu naidu and lokesh escaped from ghmc elections
ఇవి  కేవలం ఒక నగరానికి సంబంధించిన ఎన్నికలు మాత్రమే.   ఎమ్మెల్యేల మాదిరిగా  గెలిచినవారిలో పాతికమందికి మంత్రి పదవులు రావు.  ఒక్కరికి మాత్రమే మేయర్ పదవి వస్తుంది.  మరొకరికి ఉపమేయర్ పదవి వస్తుంది.  అయినప్పటికీ నగర కార్పొరేషన్ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నాయి.  దుబ్బాక ఉపఎన్నికలో గెలిచిన ఉత్సాహంలో బీజేపీ జాతీయస్థాయి నేతలను కూడా ప్రచారరంగంలోకి దించింది.  కిషన్ రెడ్డి స్థానికుడు కాబట్టి ఆయన ప్రచారం చేసినా వేలెత్తి చూపడానికి ఏమీ లేదు.  కానీ, జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా, అమిత్ షా, స్మ్రుతి ఇరానీ, దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి హేమాహేమీలు కట్టగట్టుకుని భాగ్యనగరంలో వాలిపోయారు.  ఈరోజు సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా నగరానికి విచ్చేస్తున్నారు.  పేరుకు ఆయన ఏదో వాక్సిన్  పరిశీలనకు వస్తున్నారని చెబుతున్నా, మరో నలభై ఎనిమిది గంటల్లో ఎన్నికల ప్రచార గడువు ముగుస్తున్న సమయంలో ప్రధానమంత్రి కావాలని పని పెట్టుకుని వస్తున్నారంటే అది పరోక్ష ఎన్నికల ప్రచారం కోసమే అని వేరే చెప్పాల్సిన పనిలేదు.  
 

chandrababu naidu and lokesh escaped from ghmc elections

 
ఇక బీజేపీ ఇస్తున్న హామీలు కోటలు దాటేశాయి.  వారి హామీలు నెరవేర్చాలంటే లక్షల కోట్లు కూడా సరిపోవు.  ఆఫ్ కోర్స్…తమను అధికారంలోకి తెస్తే ఒక్కొక్క పౌరుడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తామని, వందరోజుల్లో విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కు తెస్తామని ప్రచారం చేసి జనాన్ని మోసం చేసిన బీజేపీకి నగర కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఇంటికి పాతికవేలు ఇస్తామని, రాష్ట్ర అసెంబ్లీ చెయ్యలేని శాసనాలు కూడా తామే చేస్తామని చెప్పడంలో ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.  ఏదైనా ఓటర్ల చేతిలో ఉంది.  
 
ఇక కాంగ్రెస్ పార్టీ తరపున జాతీయ నాయకులు ఎవరూ రాకపోయినా, స్థానిక నాయకులు బాగానే ప్రచారం చేస్తున్నారు.  వారి పాట్లు వారు పడుతున్నారు. మజ్లీస్ పార్టీ తరపున అక్బరుద్దీన్ ఒవైసి స్టార్ కాంపెయినర్ గా ఉన్నారు.  ఆయన ప్రచారం కూడా సవాళ్లతో, ప్రతిజ్ఞలతో సాగుతున్నది. ఇక జనసేన సంగతి కూడా అయోమయం జగన్నాధం అన్న చందంగా ఉన్నది.  ఎన్నికల సమయంలో విలువైన మూడు రోజుల సమయాన్ని ఢిల్లీ వీధుల్లో నడ్డాను కలవడానికి పడిగాపులు కాసి, కనీసం ఒక్క కేంద్రమంత్రిని కూడా కలవలేని జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఒకసారి, చేయడంలేదని మరొకసారి మాటలు మర్చి పరువు పోగొట్టుకుని అభాసుపాలయ్యారు.  కనీసం మిత్రపక్షం బీజేపీ విజయానికైనా కృషి చేస్తారో లేదో తెలియదు.  ప్రచారం చేస్తారో లేదో తెలియదు.  ప్రచారం చేస్తే కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడాలి.  కానీ కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే జగన్ మీద నోరు పారేసుకున్నంత సులభం కాదు కదా!  కేసీఆర్ ఒక్క చిటికె వేస్తె తునకలు తునకలు అవుతానేమో అన్న భయంతో నరాలు వణుకుతుండగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారా? ఒకవేళ చేసినా తూతూమంత్రంగా చేస్తారా అనేది ఆసక్తిదాయకం.  
chandrababu naidu and lokesh escaped from ghmc elections
 
అంతా బాగానే ఉన్నది… కానీ, కార్పొరేషన్ ఎన్నికలలో నూట ఆరు మంది అభ్యర్థులను నిలబెట్టిన ఆ పార్టీ ప్రచారం ఎక్కడా కనిపించడం లేదు.  పైగా అది జాతీయపార్టీ,  ఆ పార్టీకి ఆయన జాతీయాధ్యక్షుడు.  ఆయన కొడుకు జాతీయ ప్రధాన కార్యదర్శి.  రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీకి అధ్యక్షులు ఉన్నారు.  ఇక ఉపాధ్యక్షులు,  ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శుల సంఖ్యాబలం  కౌరవ సోదరుల సంఖ్యను అధిగమించి సగరపుత్రుల  స్థాయికి చేరుకుంది.   అన్నింటిని మించి ఆ పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారే అయినా ఆయన శాశ్వత నివాసం హైద్రాబాద్ లోనే.  ఆయన వ్యాపార కేంద్రాలు అన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయి.  వార్డ్ మెంబర్ ఎన్నిక అయినా యమా సీరియస్ గా తీసుకుంటారని ఆ పార్టీ అధ్యక్షుడికి జాతీయస్థాయిలో ప్రాచుర్యం ఉన్నది.  ఆయన ఏకైక కుమారుడు ఇప్పటికే ఉత్తర కుమారుడుగా, లక్ష్మణ కుమారుడుగా మాచెడ్డ పేరు తెచ్చుకున్నవాడు.  
 
ఇన్ని క్లూలు ఇచ్చినా అర్ధం కానివారుంటే ఇక ఆ పేర్లను చెబుతాను.  అదేనండి…మన శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీశ్రీశ్రీ లోకేష్ నాయుడుంగార్లు!   గత ఎన్నికల్లో వీరిద్దరూ చండప్రచండంగా నగరంలో తిరిగి ప్రచారం చేశారు.  హైదరాబాద్, సైబరాబాద్, మెట్రో, శంషాబాద్ విమానాశ్రయం అన్నీ నేనే తెచ్చాను, నేనే నిర్మించాను అని ఇప్పటికీ మా గొప్పగా ప్రచారం చేస్తుంటారు.  పచ్చ క్షుద్రమీడియా వారు చెప్పిందే వేదవాక్కుగా పరిగణించి అచ్చొత్తుతుంటారు.  అలాంటి మేధావులు మరో నలభై ఎనిమిది గంటల్లో ప్రచార వ్యవధి ముగిసిపోతున్నా, ఈరోజు వరకు ఎక్కడా కనిపించడంలేదు.  చంద్రబాబు అంటే వృద్ధుడు కాబట్టి కోవిద్ భయంతో ఆయన గడపదాటి బయటకు రావడం లేదని ఒపుకుందాం.  మరి కుర్రాడు, యువకుడు, నవ యవ్వనుడు లోకేష్ నాయుడుకేమైంది?  ఆయన సాటివాడు కేటీఆర్ యమా ఉత్సాహంతో కాలికి బలపం కట్టుకుని ఇల్లిల్లూ, వీధి వీధి తిరుగుతూ ప్రచారం చేస్తుంటే, మరి లోకేష్ నాయుడు పత్తా లేకుండా పారిపోవడం సబబేనా?  పైగా హైద్రాబాద్ లో ఉంటె ప్రచారానికి వెళ్లాల్సివస్తుందేమో అని భయపడి ఈ క్రూషియల్ సమయంలో బెజవాడ పారిపోవడం ఏమిటి?  బెజవాడలో ఆయన చేయాల్సిన రాచకార్యాలు ఏమున్నాయి?  
chandrababu naidu and lokesh escaped from ghmc elections
chandrababu naidu and lokesh escaped from ghmc elections
మొత్తానికి ఎన్నికలకు ముందే తెలుగుదేశం కాడి కింద పారేసి తండ్రీకొడుకులు పారిపోయారని జనం నవ్వుకుంటున్నారు.  ఏదో తమ కులస్తుల ఓట్లనైనా చీల్చి టీఆరెస్ కు వ్యతిరేకంగా ఓట్లు వేయించే దురుద్దేశ్యం తప్ప వాస్తవ పోరాట లక్షణం ఏదీ?  ఎన్నికల్లో పోరాడటం, కష్టించి గెలుపు సాధించడం అంటే వెన్నుపోటు పొడిచినంత తేలిక కాదు కదా! 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు